సారీ చెప్పినా.. సిధార్థ్‌పై ఎఫ్‌ఐఆర్‌

27 Jan, 2018 13:40 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్‌ నటుడు సిధార్థ్‌ మల్హోత్రా చిక్కుల్లో పడ్డాడు. భోజ్‌పురి భాషను అవమానించాడన్న విమర్శల నేపథ్యంలో అతనిపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలైంది. ఈ విషయాన్ని భోజ్‌పురి నటుడు, బీజేపీ నేత మనోజ్‌ తివారీ వెల్లడించారు. 

‘‘సిధార్థ్‌ చేసిన వ్యాఖ్యలు నేను విన్నా. 22 కోట్ల మంది మనోభావాలను అతను దారుణంగా దెబ్బతీశాడు. నేను వాటిని ఖండిస్తున్నా. మనం ప్రతీ భాషను గౌరవించాల్సిన అవసరం ఉంది. కళాకారులకు ఆ బాధ్యత ఇంకా ఎక్కువగానే ఉంటుంది. అతను మంచి నటుడే. కానీ, ఇలా వ్యవహరించటం కుసంస్కారం. క్షమాపణలు చెప్పినా ప్రజలు అతన్ని వదిలేస్తారని నేను అనుకోవట్లేదు’’ అని తివారీ తెలిపారు. 

పట్నా, వారణాసి, కోల్‌కతా, ముంబై, తదితర ప్రాంతాల్లో ఇప్పటికే సిధార్థ్‌ పై భోజ్‌పురి కమ్యూనిటీ ఫిర్యాదులు చేయగా.. అతనిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయినట్లు సమాచారం అందుతుందని తివారీ వెల్లడించారు. 

అసలేం జరిగిందంటే... ‘అయ్యారీ’ సినిమా ప్రమోషన్‌ కోసం హీరో సిధార్థ్‌, హీరోయిన్‌ రకుల్‌, నటుడు మనోజ్‌ బాజ్‌పాయి... సల్మాన్‌ హోస్ట్‌ చేస్తున్న బిగ్‌ బాస్‌ షోకు వెళ్లి సందడి చేశారు. ఈ సందర్భంలో మనోజ్‌ బాజ్‌పాయి బలవంతం మేరకు భోజ్‌పురి భాషలో సిధార్థ్‌ ఓ డైలాగ్‌ చెప్పాడు. అయితే ఫన్నీగా సాగిన ఆ ఎపిసోడ్‌ కాస్త అభ్యంతరకర వ్యాఖ్యలుగా మారిపోవటంతో భోజ్‌పురి కమ్యూనిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సిధార్థ్‌ దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన వ్యక్తం చేసింది. నటి నీతూ చంద్ర కూడా ఈ వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేస్తూ ఆ వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. అయితే చివరకు సిధార్థ్‌ ట్విటర్‌ వేదికగా క్షమాపణలు చెప్పినా.. పరిస్థితి చల్లారటం లేదు.

మరిన్ని వార్తలు