ఈ అయిదు పాత్రలూ అదుర్స్!

6 Dec, 2014 23:01 IST|Sakshi
ఈ అయిదు పాత్రలూ అదుర్స్!

 సందర్భం: ధర్మవరపు సుబ్రహ్మణ్యం ప్రథమ వర్ధంతి
  కొందరు ‘నవ్వించడానికే’ అన్నట్లు భూమ్మీద పుడతారు. ఆ కోవకు చెందిన నటుడే ధర్మవరపు సుబ్రహ్మణ్యం. ‘ఆనందో
 బ్రహ్మ’ అనే సూక్తిని చివరి శ్వాస వరకూ పాటించి... నవ్వుతూ, నవ్విస్తూ జీవితాన్ని సార్థకం చేసుకున్న నటుడాయన. దబాయించి మరీ దశాబ్దాల పాటు కామెడీని తెరపై బజాయించిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం ప్రథమ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆయన వదిలి వెళ్లిన అయిదు తీపి జ్ఞాపకాలు మీ కోసం...

 
  1 స్వాతికిరణం (1992)
 కాకా హోటల్‌తో కుటుంబాన్ని పోషించుకునే కళాభిమానిగా ఈ చిత్రంలో కనిపిస్తారు ధర్మవరపు. బాలగంధర్వుణ్ణి కన్నతండ్రిగా అనుక్షణం ఆనందాన్ని పొందుతుంది ఆయన పాత్ర. సంగీత ప్రపంచంలో త్రివిక్రమునిగా ఎదిగిపోతున్న కొడుకుని చూసి పొంగిపోతాడు. ఈర్ష్యా ద్వేషాలనే కాలసర్పాల కాటుకి బలైపోయిన కొడుకుని చూసి కృంగిపోతాడు. ధర్మవరపు నటజీవితంలో చిరస్థాయిగా నిలిచిపోతే పాత్ర ఇది.
 
  2    నువ్వు-నేను (2001)
 ఇందులో...ప్రిన్సిపాల్ పాత్ర పోషించిన ఎమ్మెస్ నారాయణ ప్రసంగాన్ని మక్కికి మక్కీగా ధర్మవరపు అనువదించడం ఎవ్వరూ మరిచిపోలేరు. ‘ది హోల్ కాలేజ్’.. అని ఎమ్మెస్ అంటే, ‘కాలేజీలో బొక్క పడింది’ అంటూ అనువాదం చేస్తాడాయన. పైగా హెయిర్‌స్టయిల్‌లో శోభన్‌బాబు రింగు ఒకటి. ఆ పాత్ర గుర్తొస్తే చాలు.. ప్రేక్షకుల ముఖాలు ఆనందంతో విచ్చుకుంటాయి. లెక్చరర్లను కామెడీగా చూపించే ట్రెండ్ ఈ సినిమాతో మరింత ఊపందుకుంది. ధర్మవరపును స్టార్‌ని చేసిన పాత్ర ఇది.
 
   3   ఒక్కడు (2003)
 కథతో సంబంధం లేకపోయినా... ఒక్క సీన్లో అలా కనిపించి, ఏళ్ల తరబడి గుర్తిండిపోయేంత అభినయాన్ని పలికించడమంటే సాధారణమైన విషయం కాదు. ‘ఒక్కడు’లో ధర్మవరపు చేసిన ఫీట్ అదే. ఇందులో పాస్‌పోర్ట్ ఆఫీసర్‌గా కనిపిస్తారాయన. ‘9 8 4 8 0... 3 2 9 1 9...’ అంటూ... తనదైన శైలిలో... ఆన్‌లైన్‌లో ఉన్న తన ప్రేయసికి రొమాంటిగ్గా ఆయన నంబర్ చెప్పే తీరు ప్రేక్షకులకు అలా గుర్తుండిపోతుంది.
 
  4    అమ్మ - నాన్న -  ఓ తమిళమ్మాయి (2003)
 ‘ఏమిరా బాలరాజు.. ఏమిరా లాభం మీ వల్ల.. ఏమైనా పని చేసుకోరా బేవకూఫ్..’ ఈ డైలాగ్ వినగానే ‘అమ్మ నాన్న - ఓ తమిళమ్మాయి’ చిత్రంలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం గుర్తొస్తారు. కాదంబరి కిరణ్‌కు బ్రెయిన్ వాష్ చేసే ఆ సన్నివేశం కామెడీ ప్రియులకు నిజంగా విందుభోజనమే. ఇందులో నాట్యాచార్యుడైన తమిళియన్ పాత్ర ఆయనది. ఈ సినిమాపై ఆయనపై ఎక్కువ సన్నివేశాలు లేకపోయినా... సినిమా ఆద్యంతం గుర్తుండిపోతుంది ధర్మవరపు పాత్ర.
 
 5లీలామహల్ సెంటర్  (2004)  
 థియేటర్లో ఏ సినిమా విడుదలైతే, ఆ గెటప్‌లో కనిపిస్తూ.... ప్రపంచంలో ఏ థియేటర్ మేనేజర్‌కీ లేని మేనరిజంతో ఈ చిత్రంలో ధర్మవరపు రెచ్చిపోతారు. ‘మా బాబే కనుక సినిమా హీరో అయితే... ఈ పాటికి ఇండస్ట్రీ మొత్తం చేత ‘బాబూ బాబూ..’ అని పిలిపించుకునేవాణ్ణి...’ అంటూ ఇండస్ట్రీపై తనదైన శైలిలో సెటైర్ వేస్తారు. ‘లీలామహల్ సెంటర్’లో ఆయన పాత్ర చూసి నవ్వని వారుండటంటే అతి శయోక్తి కాదు. ధర్మవరపు పోషించిన పాత్రల్లో అదుర్స్ అనిపించినవి... ఇవి మచ్చుకు మాత్రమే. ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి. భౌతికంగా మాత్రమే ఈ రోజు ఆయన మన మధ్య లేరు. నటునిగా మాత్రం ఎప్పుడూ ధర్మవరపు మనతోనే ఉంటారు. పాత్రల రూపంలో తరచూ మనల్ని పలకరిస్తూనే ఉంటారు. పగలబడి నవ్విస్తూనే ఉంటారు.