తొలి తెలుగు గ్లామర్ హీరో : సీహెచ్ నారాయణరావు శతజయంతి

13 Sep, 2013 00:15 IST|Sakshi
తొలి తెలుగు గ్లామర్ హీరో : సీహెచ్ నారాయణరావు శతజయంతి
హీరో అంటే ఎలా ఉండాలి? ఎర్రగా, పొడుగా, నాజూగ్గా, మ్యాన్లీగా, స్టైలిష్‌గా, చూసీ చూడగానే మేగ్నట్‌లా ఆకట్టేసుకోవాలి. అచ్చం సీహెచ్. నారాయణరావులా అన్నమాట. 1940ల్లో హీరో అంటే నాగయ్యే. ఆయనలా డైలాగులు, కర్ణపేయంగా పాటలు పాడితేనే హీరో కింద లెక్క. అలాంటి జమానాలో సీహెచ్ నారాయణరావు గ్లామర్‌తో కొట్టుకొచ్చేశాడు. ఏమి స్మయిలూ ఏమి స్టయిలూ. సీహెచ్ నారాయణరావులా డ్రెస్సులు వేసుకోవడం, క్రాపులు చేయించుకోవడం... పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయనకు.
 
‘మొదటి రాత్రి’ అనే సినిమాలో ఆయన లారీ క్లీనర్ వేషం వేశాడు. అడ్డగళ్ల చారల బనీను వేసుకున్నాడు. అప్పట్లో అదో పెద్ద ఫ్యాషన్. అలాంటి బనీన్లకు ఫుల్ డిమాండ్. అందం అనే కాదు, యాక్టింగులోనూ సూపరే. శివుడి వేషంలో ఆయన్ని కొట్టేవారే లేరు. ‘గంగా గౌరీ సంవాదం’(1958) సినిమాలో ఆయన శివుడి వేషమే హైలైట్. ఆ గెటప్‌లో కేలండర్లు కూడా రిలీజు చేశారు. కేవీరెడ్డి తొలి సినిమా ‘భక్త పోతన’లో శ్రీరామునిగా గెస్ట్ వేషం వేశారు. జనం ఆ పోస్టర్లకే దణ్ణాలు పెట్టేశారు.
 
నారాయణరావు యాక్టింగ్ స్టయిల్ నేచురల్‌గా ఉండేది. ఎక్కడా రంగస్థల ప్రభావం కనపడేది కాదు. ప్రేక్షకులకు ఆ సహజత్వమే నచ్చేసింది. ఆయనవి కొన్ని స్టయిల్స్ కూడా భలే ఉండేవి. ‘జీవితం’ సినిమాలో కోర్టు సీన్‌లో నారాయణరావు అగ్గిపుల్ల వెలిగించే స్టయిల్ చూసి ప్రేక్షకులు తెగ ఇదై పోయారు. ఆయనలా అగ్గిపుల్ల వెలిగించాలని ఎంతమంది ప్రయత్నించారో! ఎన్టీఆర్, ఏయన్నార్‌క్కూడా ఆయనంటే విపరీతమైన గౌరవం. ‘మన దేశం’లో నారాయణరావే హీరో. ఎన్టీఆర్ తొలి సినిమా అదే. ఆయన దగ్గరే కూర్చుని పరిశ్రమ గురించి బోలెడన్ని విషయాలు తెలుసుకున్నారు ఎన్టీఆర్. ‘ముగ్గురు మరాఠీలు’ చిత్రంలో నారాయణరావు, ఏయన్నార్ అన్నదమ్ములుగా నటించారు. నటనలో తనకు అన్నలాంటివారు అంటారు ఏయన్నార్. నారాయణరావు హీరోగా ‘లక్ష్మమ్మ’, ఏయన్నార్ హీరోగా ‘శ్రీలక్ష్మమ్మ కథ’ పోటాపోటీగా రూపొందాయి. ఫైనల్‌గా విజయం నారాయణరావునే వరించిందనుకోండి.
 
అసలు నారాయణరావు సిన్మా యాక్టర్ అవుదామనే అనుకోలేదు. బిఏ చదివాడు. మాజీ రాష్ట్రపతి వీవీ గిరి దగ్గర సెక్రటరీగా పనిచేశాడు. స్వాతంత్య్ర పోరాటంలో జైలుకి కూడా వెళ్లొచ్చాడు.
 
ఆయన గ్లామరే ఆయన్ని సినిమా ఫీల్డ్‌కు తీసుకొచ్చింది. నిర్మాత మీర్జాపూర్ రాజా, దర్శకుడు ద్రోణంరాజు చినకామేశ్వరరావు అడిగి మరీ ఆయనతో ‘జీవన జ్యోతి’ (1940)లో హీరోగా చేయించారు. తొలి సినిమాతోనే క్రేజ్ వచ్చేసింది. ఓ పదేళ్ల పాటు ఆయనదే హవా. దేవత, చెంచులక్ష్మి, మన దేశం, తిరుగుబాటు, లక్ష్మమ్మ, జీవితం, మొదటి రాత్రి, ఆడజన్మ... ఇలా ఓ 30 సినిమాల్లో హీరోగా చేశాడు. ‘దేవదాసు’ సినిమాని మొదట నారాయణరావు, భానుమతితోనే తీయాలనుకున్నారు. తర్వాత అది కాస్తా ఏయన్నార్, సావిత్రి దగ్గరకు వెళ్లింది. మద్రాసులో ఏవీయమ్ స్టూడియోలో జరిగిన తొలి షూటింగ్ ‘జీవితం’లో నారాయణరావే హీరో. మహాగాయకుడు ఘంటసాల తొలి సినిమా ‘మన దేశం’ నారాయణరావుదే. 1949లో విజయవాడలో ఆలిండియా రేడియో కేంద్రాన్ని నారాయణరావే స్వహస్తాలతో ప్రారంభించారు. 1951లో ఆంధ్రా యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. అసలు మన దేశంలోనే గౌరవ డాక్టరేట్ అందుకున్న తొలి సినిమా నటుడు నారాయణరావే. 
 
బళ్లు ఓడలు, ఓడలు బళ్లు అవుతాయి. గ్లామర్ స్టార్‌గా ఓ వెలుగు వెలిగిన నారాయణరావు చివరకు కేరెక్టర్ ఆర్టిస్టు స్థాయికి దిగాల్సి వచ్చింది. అయినా ఏనాడూ వేషాల కోసం దేబిరించలేదు. బాలభారతం, కలెక్టర్ జానకి, భలే మొనగాడు, మధుర స్వప్నం, వింత సంసారం, రాణీకాసుల రంగమ్మ వంటి చిత్రాల్లో నటించారు. ‘పులి బిడ్డ’ ఆయన ఆఖరి సినిమా. 1940 సెప్టెంబర్ 13న కర్నాటకలోని మధుగిరిలో జన్మించిన నారాయణరావు పూర్తి పేరు చదలవాడ అనంత పద్మనాభ దత్తాత్రేయ సత్యనారాయణ. 1984 ఫిబ్రవరి 14న జీవితం చాలించారు.
 
నారాయణరావుకు తొమ్మండుగురు సంతానం. ఏడుగురు అబ్బా యిలు, ఇద్దరమ్మాయిలు. ఈ కుటుంబం నుంచి ఎవ్వరూ కూడా సినిమా ఫీల్డ్ ఛాయలకు రాలేదు. ‘‘మా నాన్నగారిలాంటి గొప్ప వ్యక్తే ఈ పరిశ్రమకు పనికిరాలేదు. ఇక మేమేం పనికి వస్తాం’’ అని నారాయణరావు రెండో కొడుకు అరుణ్‌కుమార్ (శ్రీబాబా) వాపోయారు. నిజమే... ఆయన ఆవేదనలో అర్థం ఉంది.  ఈ తొలి తెలుగు గ్లామర్ హీరోని పరిశ్రమ ఏనాడూ పట్టించుకున్నది లేదు. చివరకు ఈ శతజయంతిని కూడా విస్మరించడం విషాదమే!