స్కిల్‌ కన్నా విల్‌ ముఖ్యం

25 Feb, 2019 09:22 IST|Sakshi

హైదరాబాదీలకు ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతోంది

శారీరక, మానసిక ఆరోగ్యమూ ప్రధానమే..

సమతుల ఆహారం తీసుకోవడం మరిచిపోవద్దు 

మన పనులు మనమే చేసుకోవడం ఉత్తమం

ప్రముఖ ఫిట్‌నెస్‌ ట్రెయినర్‌ ముస్తఫా అహ్మద్‌ సూచనలు  

సాక్షి, సిటీబ్యూరో: టాలీవుడ్, బాలీవుడ్‌ హీరోలైన మహేశ్‌బాబు, రితిక్‌ రోషన్, రణ్‌వీర్‌ సింగ్‌లకు ఆయన ఫిట్‌నెస్‌ మంత్రం నేర్పిస్తున్నాడు. ఆ రంగంలో తనదైన ముద్రతోనే ముందుకు సాగుతున్నాడు. నాలుగేళ్లుగా నగరానికి వస్తూ పోతున్నాడు. ఆయన ఎవరో కాదు ఫిట్‌నెస్‌ ట్రెయినర్‌ ముస్తఫా అహ్మద్‌. ప్రస్తుతం ముంబైలో ఫిట్‌నెస్‌ సెంటర్‌ నిర్వహిస్తున్న ముస్తఫా అహ్మద్‌ ఓ ఈవెంట్‌లో పాల్గొనేందుకు ఇటీవల నగరానికి వచ్చాడు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడాడు. ఈ సందర్భంగా పలు ఫిట్‌నెస్‌ సూచనలు చేశారు. అవి ఆయన మాటల్లోనే..

ఫిజిగ్గా ఉంటేనే సరిపోదు..
ఫిజిక్‌ ఉంటే ఫిట్‌నెస్‌ ఉన్నట్టు కాదు. ఫిజిక్‌ ఫిట్‌నెస్‌లో ఒక భాగం మాత్రమే. ఆరోగ్యంగా ఫీల్‌ అవుతూ ఒక ఆరోగ్యవంతుడు చేయగలిగిన పనులన్నీ చేయడమే ఫిట్‌నెస్‌. అరగంటలో 5 కి.మీ పరిగెత్తడం, కొంత బరువు ఎత్తగలగడం, ఫ్రీగా శరీరాన్ని కదిలించగలగడం ఇవన్నీ కలిపితే ఫిట్‌నెస్‌. ఎవరైతే సరైన ఆహారపు అలవాట్లు కలిగి ఉంటారో వారికి తక్కువ శిక్షణ అవసరం. శరీరానికి అవసరమైన ఆహారం కరెక్టుగా తీసుకుంటే శారీరకంగానూ, మానసికంగానూ ఆరోగ్యంగా, చలాకీగా ఉండవచ్చు.  

మూడు ముఖ్య సూచనలు..
7 నుంచి 8 గంటల నిద్ర మొదటిది. రెండోది స్థానికంగా దొరికే ఆహారం తినటం. మనం తినే ఆహారంలో 60 శాతం లోకల్‌గా దొరికేది తినాలి. వెస్ట్రన్‌ ఆహార పదార్థాల జోలికి వెళ్లవద్దు.  స్థానిక ఆహారం వల్ల శరీరానికి ఎక్కువ మేలు కలుగుతుంది. మూడోది పనిచేసే చోట అయినా, ఇంట్లో అయినా కదులుతూ, నడుస్తూ ఉండటం. జిమ్‌కి వెళ్లకపోయినా ఫర్వాలేదు. మెట్లు వాడవచ్చు. నడవండి. దుకాణానికి వెళ్లి మీరే సరుకులు తెచ్చుకోండి. 

ఫ్యాట్‌ ఫ్రీ అంటే కొనేయొద్దు..   
చాలా మంది ఇళ్లలో, ఫ్రిజ్‌లలో అనేక ఫ్యాట్‌ ఫ్రీ ఫుడ్‌ ప్రొడక్టŠస్‌ కొని తెచ్చి పెట్టుకుంటారు. ఫ్యాట్‌ అన్ని సార్లూ చెడ్డది కాదు. నెయ్యితో మంచి ఫ్యాట్‌ లభిస్తుంది, నెయ్యితో వంటలు చేసుకోవచ్చు.  ఈ మధ్య చాలా మంది అర్థం చేసుకుంటున్నారు. నెమ్మదిగా మార్పు వస్తోంది.

ఫిట్‌నెస్‌లో హైదరాబాద్‌..
నవాబ్‌ల నగరం ఇది. మిగతా నగరాలతో పోల్చితే ఇక్కడ ఫిట్‌నెస్‌ గురించి పెద్దగా పట్టించుకోరు అనే మాట మారుతోంది. ఇక్కడ మార్పు వస్తోంది. ఫిట్‌నెస్‌ విషయంలో ఢిల్లీ, ముంబై స్థాయికి హైదరాబాద్‌ మరో 3, 4 ఏళ్లలో చేరుకోవచ్చు. ఇక్కడి వారికి ఫిట్‌నెస్‌పై  అవగాహన పెరుగుతోంంది.  

ఇలా చేస్తే మంచిది..  
సీట్లో కూర్చుని, వర్క్‌ప్లేస్‌లో కూడా ఫిట్‌నెస్‌ పొందడానికి ఎన్నో చెయ్యొచ్చు. ఇంటర్నెట్‌లో వేల మార్గాలున్నాయి.
ఫిట్‌నెస్‌ కావాలంటే స్కిల్‌ కన్నా విల్‌ అవసరం. ఎవరైనా ఏమైనా అనుకుంటారనే ఆలోచన అనవసరం. మీరు మీ కోసం వర్క్‌ చేయండి.  
టీనేజ్‌లో, ఏ ఏజ్‌లో అయినా ఏం తింటున్నారో చూసుకోండి. అవసరమైన మార్పులు చేసుకోండి. తర్వాత మంచి ట్రెయినర్‌ ఉన్న జిమ్‌లో చేరండి. 6 నెలల్లో మీకు నేర్పిస్తారు. తర్వాత మీరు స్వయంగా చేసుకోవచ్చు.  
ఇక సన్నగా, లావుగా లేదా అనుకున్న తీరులో శరీరాకృతి మారడానికి వారి వారి జెనెటిక్స్, మెటబాలిజమ్‌ని బట్టి టైం పడుతుంది. కానీ కరెక్టు ఆహారం, వ్యాయామ శిక్షణ వల్ల మార్పులు మాత్రం2, 3 నెలల్లోనే కనిపిస్తాయి.  
ఇక చిన్న పిల్లలకి క్రీడలు అలవాటు చేస్తే ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఆటోమెటిక్‌గా పెరుగుతుంది. ఇది తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంది. టీనేజ్‌లో పిల్లలను తప్పకుండా ఆటల్లోకి పంపాలి.  
గర్భిణులు సైతం వ్యాయామం చేయొచ్చు. డెలివరీ తర్వాత 40 రోజుల తర్వాత ఇంట్లోనే చిన్న చిన్న వ్యాయామాలు కూడా చేసుకోవచ్చు. 

మరిన్ని వార్తలు