నా బాధను...మాటల్లో చెప్పలేను!

31 Mar, 2016 23:34 IST|Sakshi
నా బాధను...మాటల్లో చెప్పలేను!

 పిల్లలు పరీక్షలు రాస్తుంటే తల్లిదండ్రులు కూడా రాస్తున్నట్లే. అలాగే ఇంట్లో అమ్మమ్మ - నానమ్మ-తాతయ్యలు ఉంటే వాళ్లూ రాస్తున్నట్లే. పిల్లలను చదివిస్తూ, నానా హైరానా పడిపోతుంటారు. ఇది పరీక్షల సీజన్ కాబట్టి, ప్రణీత తన ఫ్లాష్‌బ్యాక్ గుర్తు చేసుకున్నారు. చదువుకొనే రోజుల్లో నాయనమ్మ తనను చదివించేవారని ప్రణీత చెబుతూ - ‘‘పదో తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మా నానమ్మ నన్ను బాగా చదివించేది. తెల్లవారుజామునే నాతో పాటు తను కూడా నిద్ర లేచేది.
 
 ముఖ్యంగా కన్నడ సబ్జెక్ట్ నాకు చాలా కష్టంగా అనిపిస్తే, తనే చదివి అర్థం చెప్పేది. అంతలా పెంచిన మన పెద్దల కోసం మనం పెద్దయ్యాక సమయం కేటాయించం. ముఖ్యంగా గ్రాండ్ పేరెంట్స్ ప్రేమను పట్టించుకోం. చిన్నప్పుడు అర్థం కాక పట్టించుకోకపోతే, టీనేజ్‌లోకొచ్చాక టైమ్ లేక పట్టించుకోం. తీరా కొంత వయసు పెరిగి, పరిణతి వచ్చాక పట్టించుకుందామనుకుంటే మనల్ని పట్టించుకునే స్థితిలో వాళ్లు ఉండకపోవచ్చు. అందుకే, ఇప్పుడు మా నానమ్మకు నేను సమయం కేటాయించాలనుకుంటున్నాను. ఏవేవో ముచ్చట్లు చెప్పాలనుకుంటున్నాను.
 
 కానీ, అర్థం చేసుకునే పరిస్థితిలో ఆమె లేదు. అసలు తను ఇంత ముసలావిడ ఎప్పుడు అయ్యిందో తెలియనంతగా రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు మా నానమ్మ ఒక పసిపాప లాంటిది. ఎవరి సహాయమూ లేకుండా తను నడవలేదనీ, తినలేదనీ తల్చుకుంటుంటే నాకు చాలా బాధగా ఉంది. నేను ఆవిడ గది వైపుగా వెళుతునప్పుడు తన కేర్ టేకర్‌తో నానమ్మ పొందిక లేని, స్పష్టంగా లేని కథలు చెప్పడం వినపడుతుంది. అప్పుడు నాకు కలిగే బాధను మాటల్లో చెప్పలేను. అందుకే, పెద్దవాళ్లు బాగున్నప్పుడే వాళ్ల కోసం మనం సమయం కేటాయించాలి’’ అన్నారు.