అందం కోసం హింసించుకుంటున్నా : త్రిష

7 Oct, 2013 02:07 IST|Sakshi
అందం కోసం హింసించుకుంటున్నా : త్రిష
 ‘జోడీ’ సినిమాలో సిమ్రాన్ ఫ్రెండ్స్‌లో ఓ ఫ్రెండ్‌గా కనిపిస్తారు త్రిష. ఆ సినిమా వచ్చి పధ్నాలుగేళ్లు అయ్యింది. అంటే... త్రిషది 14ఏళ్ల సినీ కెరీర్ అన్నమాట. ఇంతటి సుదీర్ఘమైన నట ప్రస్థానం ఉన్న కథానాయిక ప్రస్తుతం త్రిష ఒక్కరే అని చెప్పాలి. ఈ ఏడాదితో ఈ చెన్నయ్ చందమామకు 30 ఏళ్లు నిండాయి కూడా. కానీ ఇంకా ప్రేమకథల్లో నటించగలిగేంత గ్లామరస్‌గా ఉన్నారు త్రిష. టీనేజర్లను సైతం తలదన్నే ఒంపుసొంపులతో నాజూగ్గా కనిపిస్తారామె. త్రిషలో మరో ఆకర్షణ చామనఛాయలో ఉండే ఆమె కలర్, దాంతో పాటు అందమైన ఆ నవ్వు... ఆమెను ప్రేక్షకులకు మరింత చేరువ చేశాయి. 
 
 ఇంత గ్లామరస్‌గా ఎలా ఉండగలుతున్నారు? అని ఇటీవల త్రిషను అడిగితే ఆమె ఇలా చెప్పుకొచ్చారు. ‘‘నా తోటి కథానాయికలతో పోల్చి చూస్తే నాది పెక్యులర్ బాడీ. ఇలాంటి ఆకృతినిచ్చిన నా అమ్మానాన్నలకు ఈ విషయంలో థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఒక నటి శరీరాకృతి ఎలా ఉండాలో... నా ఆకృతి అలా ఉంటుంది. అన్ని రకాల పాత్రలకూ నా శరీరం సూటవుతుంది. ఒక బిగ్‌షాట్ కూతురు పాత్ర అనుకోండీ... నాతో పాటు అందరు కథానాయికల్నీ ప్రేక్షకులు ఒప్పుకుంటారు. అయితే... ఒక రిక్షాపుల్లర్ కూతురు పాత్ర అనుకోండీ... మిగిలిన వాళ్లతో పోలిస్తే నాకే ఎక్కువ మార్కులేస్తారు.
 
 
 అంటే... అటు గొప్పింటి అమ్మాయిగా కనిపించగలనూ ఇటు పేదింటి అమ్మాయిగా మెప్పించగలను. అలాగే... బుక్స్ పట్టుకొని కాలేజ్‌కి వెళ్లగలను, కాటన్‌శారీ కట్టుకొని లెక్చరర్‌గా కనిపించగలను. మోర్ గ్లామరస్‌గానూ నటించగలను, డీగ్లామరస్ పాత్రలతో ఒప్పించగలను. నా బాడీ తీరు అలాంటిది. అందుకే... దేవుడిచ్చిన ఈ వరాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను. ఇక నుంచి గ్లామరస్ పాత్రలకంటే... నటనకు అవకాశం ఉన్న పాత్రలకే పెద్ద పీట వేయాలనుకుంటున్నా’’ అని చెప్పారు. 
 
 ఇంకా చెబుతూ- ‘‘మీ అందరికీ నా గ్లామర్ మాత్రమే కనిపిస్తుంది. కానీ దాని కోసం నేను పడే కష్టం గురించి ఎవరికీ తెలీదు. నా అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి నా శరీరాన్ని నేను ఓ స్థాయిలో హింసించుకుంటాను. నేను చేసే వ్యాయామాలు చాలా కఠినమైనవి. అయితే.. ఆ బాధ కూడా ఇష్టంగా అనుభవిస్తాన్నేను. నా అందానికి కారణం అదే’’ అని చెప్పుకొచ్చారు త్రిష.