దంగల్ అమ్మాయిలకు కోచ్ ఎవరో తెలుసా?

27 Dec, 2016 15:38 IST|Sakshi
దంగల్ అమ్మాయిలకు కోచ్ ఎవరో తెలుసా?
దంగల్ సినిమాలో గీతా కుమారి ఫొగాట్ పాత్రలో నటించిన అమ్మాయి ఫాతిమా సనా షేక్. కామన్వెల్త్ క్రీడల ఫైనల్లో దాదాపు ఓడిపోయిన పరిస్థితుల్లో ఒకే ఒక్క మూవ్‌తో ఐదు పాయింట్లు సాధించి బంగారు పతకం సాధించిన వైనాన్ని అద్భుతంగా చూపించింది. అందుకు ఆమె కూడా రెజ్లింగ్ నేర్చుకోవాల్సి వచ్చింది. ఆమెతో పాటు మరికొందరు అమ్మాయిలకు కూడా రెజ్లింగ్ నేర్చుకోక తప్పలేదు. వీళ్లందరికీ రెజ్లింగ్ పాఠాలు నేర్పించింది ఎవరో తెలుసా.. తెరమీద అయితే అమీర్ ఖానే గానీ, తెర వెనుక నిజంగానే ఒక ఫేమస్ రెజ్లర్ వీళ్లకు ట్రైనింగ్ ఇచ్చారు. ఆయనెవరో కాదు.. 2005 కామన్వెల్త్ క్రీడల్లో రెజ్లింగ్ అంశంలో భారతదేశానికి స్వర్ణపతకాలు సాధించిన కృపా శంకర్. సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ ఆయన ఈ సినిమా కోసం బూట్లు వేసుకుని.. రెజ్లింగ్‌లోకి దిగారు. 
 
ఇండోర్‌కు చెందిన కృపా శంకర్ అర్జున అవార్డు గ్రహీత. ఆయనే అమీర్‌ఖాన్‌తో పాటు ఫాతిమా సనా షేక్, సన్యా మల్హోత్రా, జైరా వసీమ్, సుహానీ భట్నాగర్.. వీళ్లందరికీ రెజ్లింగ్‌లో శిక్షణ ఇచ్చారు. నితేష్ తివారీ దర్శకత్వం వహించిన ఈ సినిమా మొత్తం భారత మాజీ రెజ్లర్ మహావీర్ సింగ్ ఫొగాట్ జీవిత చరిత్రకు సంబంధించి ఉంటుంది. నిజజీవితంలో ఆయనతో పాటు ఆయన కుమార్తెలు గీతా కుమారి ఫొగాట్, బబితా కుమారి ఫొగాట్ కూడా రెజ్లర్లే. స్వయంగా ఆయనే వారికి శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు సినిమాలో నటించిన అమ్మాయిలకు ఎలా శిక్షణ ఇచ్చామన్న విషయమై యూటీవీ మోషన్ పిక్చర్స్ ఓ వీడియో విడుదల చేసింది. ఇందులో అమీర్‌ఖాన్, దర్శకుడు నితేష్ తివారీ, శిక్షకుడు కృపాశంకర్ బిష్ణోయ్, నటించిన అమ్మాయిలు అంతా తమ అనుభవాలను పంచుకున్నారు. సినిమాలలో నటించడం నుంచి నిజమైన రెజ్లింగ్ చేసేవరకు తమను కోచ్ ఎలా మార్చారో వివరించారు.