సాక్షి 'విత్‌ టీఎన్‌ఆర్‌'

8 Oct, 2018 08:32 IST|Sakshi
తుమ్మల నరసింహారెడ్డి

సెలబ్రిటీ ఇంటర్వ్యూల స్పెషలిస్ట్‌ టీఎన్‌ఆర్‌

132 మంది టాలీవుడ్‌ ప్రముఖులతో ముఖాముఖి

యూట్యూబ్‌లో 20 కోట్ల మంది ఫాలోవర్స్‌

మాది మంచిర్యాల. నాన్న రాజిరెడ్డి. గ్రామ సర్పంచ్‌గా మూడు దఫాలు సేవలందించారు. అమ్మ చిన్నప్పుడే చనిపోతే అక్కే అమ్మలా నన్ను పెంచింది. నాన్న నా జీవితంతో అన్ని అంశాల్లో అండగా ఉన్నారు. హైదరాబాద్‌లో సరస్వతి శిశుమందిర్‌లో స్కూలింగ్, వివేకవర్థినిలో డిగ్రీ చేశాను.  

శ్రీనగర్‌కాలనీ: ఒకరితో అరగంట మాట్లాడాలంటే ఎంతో ఓపిక ఉండాలి. మనకు కావాల్సిన విషయం రాబట్టాలంటే ఓపికతో పాటు సమయం సందర్భం చూసుకోవాలి. మరి సెలబ్రిటీల నుంచి ప్రేక్షకులకు కావాల్సిన కొత్త విషయాలను రాబట్టాలంటే ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి..! అలాంటిది తనకు కావాల్సిన అంశాన్ని అతి సులువుగా రాబట్టేస్తాడతడు. అవతలి వారి మనసుతో కలిసిపోయి మధురంగా మాటల్లోకి దింపి పదునైన ప్రశ్న సంధిస్తాడు. అతడే తుమ్మల నరసింహారెడ్డి. ఆ పేరు చెబితే పెద్దగా తెలియపోవచ్చు.. కానీ ‘ఫ్రాంక్లీ విత్‌ టీఎన్‌ఆర్‌’ అంటే మాత్రం యూట్యూబ్‌తో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికీ చిరపరితమే. సాధారణంగా ఓ వీడియోను పది నిమిషాలు చూడాలంటే బద్ధకం వస్తుంది. వెంటనే దాన్ని ఫార్వర్డ్‌ చేసేస్తాం.

కానీ టీఎన్‌ఆర్‌ సెలబ్రిటీలతో చేసిన ఇంటర్వ్యూలు చూస్తుంటే మాత్రం సమయం కూడా మరిచిపోతాం. అవి కూడా మినిమం గంట.. 2 గంటల నుంచి మాగ్జిమం 8 గంటలు కూడా ఉంటాయి. అయినా ఇంకా చూడాలనిపిస్తుంటుంది. ఇంకే ప్రశ్నలు వేస్తాడు.. అవతలి నుంచి ఏం సమాధానం వస్తుందన్న ఉత్సుకత ఉంటుంది. అందుకే ఆయన చేసిన వీడియోలను 20 కోట్ల మంది వీక్షించారంటే అతిశయోక్తి కాదు. ‘ఐడ్రీమ్స్‌’ యూట్యూబ్‌ ఛానల్‌లో ‘ఫ్రాంక్లీ విత్‌ టీఎన్‌ఆర్‌’ ద్వారా సుపరిచితమైన తుమ్మల నరసింహారెడ్డి పెద్దపెద్ద సినీస్టార్లను, డైరెక్టర్లను తన మాటల చాతుర్యంతో కట్టిపడేసి.. వీక్షకులను సైతం ఆకట్టుకున్నారు. టీఎన్‌ఆర్‌ ప్రస్థానం తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసే టీఎన్‌ఆర్‌ను ‘సాక్షి’ ప్రత్యేకంగా పలకరించినపుడు తన జర్నీని పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

ఇండస్ట్రీ చాలా గొప్పది..
తెలుగు ఇండస్ట్రీ చాలా గొప్పది. లక్షలాది మందికి జీవనోపాధిగా ఉంది. కాస్టింగ్‌ కౌచ్‌ అంటూ ఇండస్ట్రీ మీద రుద్దడం తప్పు. అన్ని రంగాల్లో కాస్టింగ్‌ కౌచ్‌ ఉంది. సినిమాను వ్యాపారంగా చూసేవాళ్లతో పాటు, ప్యాషన్‌తో సినిమాను చేయాలనే తపన ఉన్నవారు వేలల్లో ఉన్నారు. సినిమాల్లో ఎవరో చెబుతున్నట్లు క్యాస్ట్‌ ఫీలింగ్‌ అన్నది నిజం కాదు. అవకాశం ఇవ్వాలని ప్రోత్సహిస్తారే తప్ప.. నిజంగా క్యాస్ట్‌ ఫీలింగ్‌ లేదు. అందరూ కలిసి సినిమాలు చేస్తారు. ఇండస్ట్రీ కొత్త కథలతో మంచి విజయాలను సొంతం చేసుకుంటుంది. అంతర్జాతీయ ఖ్యాతి పొందాలన్నదే నా ఆకాంక్ష.

త్వరలో డైరెక్షన్‌ చేస్తా..  
నటుడిగా కూడా కొన్ని సినిమాలు చేశాను. సుమంత్‌ హీరోగా చేసిన ‘బోణీ’ చిత్రంలో కొద్ది సమయమైనా మంచి పాత్రలో నటించాను. ‘నేనే రాజు నేనే మంత్రి’లోను చేశాను. జార్జిరెడ్డి, సుబ్రమణ్యపురంలో నటించాను. ప్రస్తుతం ఆది, నందు చిత్రాల్లో చేస్తున్నాను. నా స్వీయ దర్శకత్వంలో మానవ విలువలతో పాటు ప్రేక్షకులు మెచ్చే చిత్రాన్ని రూపొందించాలనే కోరిక ఉంది. వచ్చే ఏడాది ఆ దిశగా అడుగులు వేస్తున్నాను. నాకు గుర్తింపు చెత్తిన ఇంటర్వ్యూలను మాత్రం వదలను.. చేస్తూనే ఉంటాను.. అంటూ ముగించారు.  

ఫ్రాంక్లీ విత్‌ టీఎన్‌ఆర్‌గా..
తేజగారి ఇంటర్వ్యూ వైరల్‌ తర్వాత నా మీద మరింత బాధ్యత పెరిగింది. దాంతో ‘ఫ్రాంక్లీ విత్‌ టీఎన్‌ఆర్‌’ పేరుతో సెలబ్రిటీస్‌ ఇంటర్వ్యూస్‌ మొదలేట్టా. అలా రామ్‌గోపాల్‌వర్మ, కృష్ణవంశీ, తనికెళ్ళ భరణి, విజయ్‌ దేవరకొండ, రమాప్రభ, ఆర్‌. నారాయణమూర్తి, కొరటాల శివ, సుకుమార్, బండ్ల గణేష్, సుధాకర్, బ్రహ్మాజీ, రవిరాజా పినిశెట్టి, రవిబాబు, సుధీర్‌బాబు, క్రిష్, మారుతి, వంశీ, చోటా కె నాయుడు, దశరథ్, ఎన్‌.శంకర్‌ వంటి సెలబ్రిటీలతో ఇప్పటి వరకూ 132 ఇంటర్వ్యూలు చేశాను. వాటిలో నాకు తనికెళ్ళ భరణి ఇంటర్వ్యూ చాలా స్పెషల్‌గా అనిపించింది. నటుడు, రచయిత, నా గురువు ఎల్‌బీ శ్రీరామ్‌ ఇంటర్వ్యూ అయితే 8 గంటలు నడిచింది. ఎక్కడా తీసివేయలేని అంశాలు ఆయన పంచుకున్నారు. ఇప్పటికీ 20 కోట్ల మంది నా ఇంటర్వ్యూస్, ప్రోమోస్‌ చూసారంటే నమ్మశక్యంగా లేదు.. అది చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా సినిమా అభిమానులకు, నెటిజన్లకు నా హృదయపూర్వక దన్యవాదాలు. నాకు దర్శకుడు త్రివిక్రమ్, పవన్‌ కళ్యాణ్‌లను ఇంటర్వ్యూ చేయాలనుంది. ఆ ఆశ తీరుతుందో లేదో కాలమే నిర్ణయిస్తుంది.

మరిన్ని వార్తలు