ఎఫ్ఐఆర్ కింగ్ అయ్యాను!

22 Jan, 2016 15:26 IST|Sakshi
ఎఫ్ఐఆర్ కింగ్ అయ్యాను!

జైపూర్: వ్యక్తిగత జీవితాల గురించి హద్దులు దాటి మాట్లాడుతున్నందున భారత్ లో పరిస్థితులు చాలా కష్టమని బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహర్ వ్యాఖ్యానించాడు. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న అసహనం లాంటి వివాదాలపై తాను పోరాడదలుచుకోలేదన్నట్లు తెలిపాడు. ఎవరి గురించైనా మాట్లాడితే జైలులో పెడతారని చెప్పాడు. జైపూర్ సాహిత్య వేడుకలో పాల్గొన్న కరణ్ ఈ విధంగా స్పందించాడు. స్వలింగసంపర్కుల కాన్సెప్ట్ మీద 'దోస్తానా', భార్యాభర్తల అనుబంధాల తీరుపై 'కబి అల్విదా నా కెహనా' లాంటి చిత్రాలను కరణ్ తీశాడు. వాక్ స్వాతంత్ర్యం ఉందనుకోవడం ప్రపంచంలోనే ఓ పెద్ద జోక్ అని, ప్రజాస్వామ్యం అనేది రెండో పెద్ద జోక్ అవుతుందంటూ కరణ్ జోహార్ చెప్పుకొచ్చాడు.

ప్రతి విషయంలో కొన్ని హద్దులుంటాయని, సినిమాలలో తాను ప్రస్తావించిన విషయాలపై, సభలలో తాను మాట్లాడిన అంశాలపై లీగల్ నోటిసులు అందుకోవాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతానన్నాడు. ఎక్కడికి వెళ్లినా తాను భయపడాల్సి వస్తుందని.. ప్రస్తుతం జైపూర్లో ఏం మాట్లాడిన ఇంటికి వెళ్లేలోగా తనపై కేసు నమోదు అవుతుందోనంటూ వ్యాఖ్యానించాడు. ఓ విధంగా చెప్పాలంటే తాను ఎఫ్ఐఆర్ కింగ్ మాదిరిగా తయారయ్యనంటూ చమత్కరించాడు. గతేడాది ముంబైలో వెస్ట్రన్ మూవీ కమెడీని అపహాస్యం చేశాడన్న ఆరోపణలతో తనపై కేసు నమోదు విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశాడు. అయితే, బాంబే హైకోర్టు నుంచి కరణ్ కు ఊరట లభించింది. తనపై ఎటువంటి చార్జిషీట్ దాఖలు చేయవద్దని ముంబై పోలీసులకు సూచించినట్లు కరణ్ జోహర్ వివరించాడు.