ప్రతి మలుపూ కొత్తగా...!

18 Feb, 2016 23:09 IST|Sakshi
ప్రతి మలుపూ కొత్తగా...!

 ‘యముడికి మొగుడు, చంటి, బంగారు బుల్లోడు, పెదరాయుడు’... లాంటి కమర్షియల్ టచ్ ఉన్న కుటుంబ కథాచిత్రాలనందించి సక్సెస్‌ఫుల్ దర్శకుడనిపించుకున్నారు రవిరాజా పినిశెట్టి. ఆయన రెండో కుమారుడు ఆది పినిశెట్టి తమిళంలో గుర్తింపున్న హీరో. ఇక, పెద్ద కుమారుడు సత్యప్రభాస్ తండ్రి బాటలో దర్శకుడయ్యారు. తమ్ముడు ఆది హీరోగా తండ్రి నిర్మాణంలో ఆదర్శ చిత్రాలయ పతాకంపై సత్యప్రభాస్ దర్శకత్వం వహించిన చిత్రం ‘మలుపు’. ఇవాళ తెరపైకొస్తున్న ఈ చిత్రం గురించి సత్యప్రభాస్ మాట్లాడుతూ - ‘‘నేను ఏంబీఏ పూర్తి చేశాక అమెరికా వెళ్లాను. అక్కడి ఫిలిమ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాలంటే ఏదైనా షార్ట్ ఫిలిమ్ తీయాలి.
 
 అప్పుడు ‘మై సిస్టర్ అండ్ ఐ’ పేరుతో నేను తీసిన షార్ట్ ఫిలిమ్ చూసి, చేర్చుకున్నారు. అక్కడ డిగ్రీ పూర్తి చేశాక, కమర్షియల్, కామెడీ టచ్ ఉంటూనే కొత్త రకం సినిమాలు తీయాలని బలంగా నిర్ణయించుకుని ఇండియాకు వచ్చాను. ఆ మేరకు నిజజీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ‘మలుపు’ చేశాను. ప్రతి మలుపూ కొత్తగా ఉంటూ, ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుంది. దర్శకుడిగా నాన్నగారి ప్రభావం నా పై లేదు. ఆయన కూడా మేము స్వశక్తిగా ఎదగాలనుకుంటారు.
 
 ఈ సినిమా చూసి, ‘పాసయ్యావ్.. ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ యు’ అని అభినందించారు’’ అని చెప్పారు. హీరో ఆది పినిశెట్టి మాట్లాడుతూ, ‘‘గంటా యాభై నిమిషాల నిడివితో సాగే ఈ చిత్రం ఓ కొత్త సినిమా చూసిన ఫీల్‌ని ప్రేక్షకులకు కలిగిస్తుంది. నేపథ్యం అంత కొత్తగా ఉంటుంది’’ అని తెలిపారు. అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న ‘సరైనోడు’లో ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నారు. ‘‘హీరోగానే చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. నటుడన్నాక అన్ని రకాల పాత్రలూ చేయాలన్నది నా అభిప్రాయం. అందుకే ‘సరైనోడు’ ఒప్పుకున్నా. అందులో నేను స్టైలిష్ అండ్ స్లీక్ విలన్‌గా కనిపిస్తా’’ అని యువ నటుడు చెప్పారు.