సిటీతో ప్రేమలో పడిపోయాను

1 Sep, 2019 08:07 IST|Sakshi

‘కంచె’ సినిమాలో హీరోగారు ‘సీతగారూ! మీరు బాగా మాట్లాడతారు’ అని ఊరకే ప్రశంసిస్తే... మెరిసిన సిగ్గు! ‘ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరితో..’ అని పాడుకుంటే.. కన్నులతో చెప్పిన జాడ!

‘మన ఊరి విశేషాలు తెలుసా సీతగారు... వడగండ్ల వాన పడిందట’ అని బ్రేకింగ్‌ న్యూస్‌  చెబితే... అందంగా బెదిరిన ఆ కళ్లు!  ప్రగ్యా జైస్వాల్‌.

మధ్యప్రదేశ్‌లోని జబల్పూరులో పుట్టి పెరిగిన ప్రగ్యా పుణే లా స్కూలులో చదువుకుంది. ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు సక్సెస్‌ఫుల్‌ మోడల్‌గా రాణించింది. ‘మిర్చీలాంటి కుర్రాడు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ప్రగ్యా ‘కంచె’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘ఓం నమో వెంకటేశాయ’, ‘గుంటూరోడు’, ‘నక్షత్రం’, ‘జయ జానకీ నాయక’ ‘ఆచారి అమెరికా యాత్ర’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది. ప్రగ్యా చెప్పిన ముచ్చట్లు కొన్ని...

మోడలింగ్‌తో...
సినిమాల్లోకి రాక ముందు మోడలింగ్‌ చేశాను. ‘డేగ’(తమిళ్‌–తెలుగు) నా మొదటి సినిమా. ఈ సినిమా యాక్షన్‌ థ్రిల్లర్‌. మొదటి సినిమా కాబట్టి చాలా గారాబంగా చూసుకునేవాళ్లు. తమిళం, తెలుగు రాకపోయినా చిరాకు పడకుండా చాలా ఓపిగ్గా డైలాగులు, సీన్‌ గురించి చెప్పేవాళ్లు.

బిర్యానీ ప్లస్‌...
రెండో సినిమాకి వచ్చే సరికి నటన గురించి అవగాహన వచ్చింది. బాడీలాంగ్వేజ్, డైలాగుల గురించి కాస్త ఎక్కువగా తెలిసింది. అందుకే అంటారేమో... అనుభవం అన్నీ నేర్పిస్తుందని!

నా రెండో సినిమా ‘టిటూ ఎంబీఏ’ (హిందీ) మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది. స్వీట్‌లవ్‌ స్టోరీ. తెలుగు సినిమా ‘కంచె’ షూట్‌ కోసం హైదరాబాద్‌కు వచ్చాను. అప్పుడే ఈ సిటీతో లవ్‌లో పడిపోయాను. ఇక్కడి బిర్యానీతో పాటు లైఫ్‌స్టైల్‌ అంటే కూడా చాలా ఇష్టం. హైదరాబాద్‌లో ఉంటే ఇంట్లో ఉన్నట్లే ఉంటుంది.

టైమ్‌ మెషిన్‌లోకి...
‘కంచె’ సినిమాలో 1930 కాలం అమ్మాయి పాత్ర వేశాను. టైమ్‌ మెషిన్‌లో అక్కడికి వెళ్లినట్లు అనిపించింది. ఈ ప్రాజెక్ట్‌లో ఎంత మమేకమయ్యానంటే సినిమా షూట్‌ పూర్తయిన తరువాత కూడా మళ్లీ సాధారణ జీవితంలోకి రావడానికి కొంత టైమ్‌ పట్టింది.

నాకు ప్రయాణాలు అంటే బోలెడు ఇష్టం. కొత్త ప్రదేశాలు కొత్త విషయాలను నేర్పుతాయి. మనకు తెలియకుండానే ఎడ్యుకేట్‌ అవుతాము. ట్రావెలింగ్‌తో పాటు డ్యాన్స్‌ చేయడమన్నా, సంగీతం వినడమన్నా ఇష్టం. 

మరిన్ని వార్తలు