అరె కలరుఫుల్లు చిలకా!

12 Jan, 2019 21:46 IST|Sakshi

‘బీరువా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సురభి... ‘ఎక్స్‌ప్రెస్‌ రాజా’, ‘ఎటాక్‌’, ‘ఒక్క క్షణం’...  సినిమాలతో మరింత చేరువయింది.  ‘ఓటర్‌’ సినిమాతో మరోసారి పలకరించనున్న సురభి ముచ్చట్లు...

పాడుతా తీయగా!
చిన్నప్పటి నుండి సినిమాలు అంటే ఇష్టం. పాటలు పాడటం, పియానో ప్లే చేయడం, పెయింటింగ్‌ వేయడం, డ్యాన్స్‌ చేయడం...ఇలా రకరకాల అభిరుచులు ఉండేవి. పేరెంట్స్‌ ప్రోత్సాహం బాగా ఉండేది. ఇప్పటికీ నా స్ట్రెంత్‌ పేరెంట్సే. నా అభిమాన తార మాధురిదీక్షిత్‌. ఢిల్లీలో ఉన్నప్పుడు మోడలింగ్‌ చేశాను. నటనలో కూడా శిక్షణ తీసుకున్నాను.

 గజిని 2లో...
మోడలింగ్‌ చేస్తున్న టైమ్‌లో  ఒక తమిళ సినిమాలో అవకాశం వచ్చింది. నటి కావాలనే నా కల అలా నిజమైంది. ఇప్పటికీ టఫ్‌ రోల్‌ అంటే నా తొలి సినిమాలో చేసిన ‘మాలిని’ పాత్ర అంటాను. పేజీల కొద్ది తమిళ డైలాగులు నోటికి చెప్పేదాన్ని. లిప్‌సింక్‌ చక్కగా కుదిరేది. దీంతో దక్షిణాది సినిమాల్లో నటించగలను అనే నమ్మకం ఏర్పడింది. ‘‘ఇక్కడ ఎక్కువమందితో ఫ్రెండ్‌షిప్‌ చెయ్, వారితో తమిళ్‌లోనే మాట్లాడు...అప్పుడు  చకచకా మాట్లాడగలవు’’ అని డైరెక్టర్‌ మురగదాస్‌  సలహా ఇచ్చారు. అప్పుడు నేను... ‘‘సార్, 
గజిని 2 ఎప్పుడు తీస్తున్నారు? అందులో నన్ను తీసుకుంటారు కదా!’’ అన్నాను. ఆయన నవ్వారు.

పాఠాలేన్నో నేర్చుకొని...
సులభంగా ఏది దరికి చేరదు అని నమ్ముతాను. సినిమాల్లో నటించాలనేది నా కల. నా కల కోసం అవకాశాలు వెదుక్కుంటూ రావు కదా! అందుకే ఎన్నో ఆడిషన్‌ టెస్ట్‌లకు హాజరయ్యాను. ఫలితం మాట ఎలా ఉన్నా పట్టుదలగా ముందుకు వెళ్లాను.  ప్రతి ఆడిషన్‌ టెస్ట్‌ నుంచి పాఠాలు నేర్చుకున్నాను. తీరికవేళల్లో సంగీతం వింటాను. లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ కదా! ప్రతి క్షణాన్ని ఎంజాయ్‌ చేయడానికి ప్రయత్నిస్తాను.

అలా అనుకున్నారు...
చిన్నప్పుడు సంగీతం మీద నా  ఆసక్తిని చూసి... ‘‘మా అమ్మాయి భవిష్యత్‌లో మ్యూజీషియన్‌ అవుతుంది’’ అనుకున్నారు పేరెంట్స్‌. బొమ్మలు వేయడం చూసి... ‘‘పెయింటర్‌ అవుతుంది’’ అనుకున్నారు! కానీ ‘‘నువ్వు ఇది కావాలి.... అది మాత్రమే చదవాలి’’ అని ఎప్పుడూ బలవంత పెట్టలేదు. మా పేరెంట్స్‌ అడ్వర్‌టైజింగ్‌ రంగానికి చెందినవారు. ఆ క్రియేటివ్‌ జీన్స్‌ నాకు వచ్చాయేమో!

డిస్కవరింగ్‌
‘నువ్వు ఎక్కువగా గ్లామరస్‌ రోల్స్‌ చేయవచ్చు కదా!’ అని సన్నిహితులు సలహా ఇస్తుంటారు. ‘ఎలాంటి పాత్ర చేయాలి?’ అనే దాని గురించి నాకేమీ గందరగోళం లేదు. నటిగా ముందు నన్ను నేను డిస్కవరింగ్‌  చేసుకునే ప్రయత్నంలో ఉన్నా. 

మరిన్ని వార్తలు