ప్రెసిడెంట్‌గారి మనవరాలు

5 May, 2019 00:01 IST|Sakshi

లండన్‌లో పుట్టి గోవాలో పెరిగి బెంగళూరులో చదువు పూర్తి చేసింది రుక్షర్‌ ధిల్లాన్‌.  కన్నడ సినిమాతో వెండితెరకు పరిచయమైన రుక్సర్‌ ఆమధ్య ‘కృష్ణార్జున యుద్ధం’తో ‘ప్రెసిడెంట్‌గారి మనవరాలు’గా తెలుగు తెరపై మెరిసింది. అల్లు శిరీష్‌ ‘ఏబీసీడీ’ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనున్న రుక్షర్‌ గురించి కొన్ని ముచ్చట్లు...

డిగ్రీ తరువాతే...
గోవాలో నైంత్‌ గ్రేడ్‌ పూర్తయిన తరువాత తదుపరి చదువుల కోసం బెంగళూరు వచ్చింది రుక్షర్‌. అక్కడ బిషప్‌ కాటన్‌ హైస్కూల్‌లో చదువుకుంది. ఆ తరువాత ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో డిగ్రీ చేసింది. బెంగళూరులో వ్యాపారప్రకటనల్లో నటిస్తున్న రోజుల్లోనే సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అయితే... ‘‘డిగ్రీ తరువాతే సినిమాలు’’ అని డిసైడ్‌ కావడంతో సినిమాల జోలికి వెళ్లలేదు.

తొలి సినిమా
‘రన్‌ ఆంటోనీ’ సినిమాతో వెండితెరకు పరిచమైంది. ఈ రొమాంటిక్‌ థ్రిల్లర్‌లో రాజ్‌కుమార్‌ మనవడు వినయ్‌ రాజ్‌కుమార్‌ సరసన నటించింది. ఈ సినిమాలో సూసైడ్‌ బాంబర్‌గా నటించింది. ఆమె నటనకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. ఆ తరువాత ‘కృష్టార్జున యుద్ధం’ సినిమాలో రియా పాత్రతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

షో టైమ్‌
‘షో టైమ్‌’ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు ఎగిరి గంతేసినంత పనిచేసింది. ఎందుకంటే ఆ సినిమాను డైరెక్టర్‌ చేయబోయే యస్‌.యస్‌.కాంచీ బాహుబలి డైరెక్టర్‌ రాజమౌళికి కజిన్‌ అనేదే ఆమె ఉత్సాహానికి కారణం. ‘సెలెక్ట్‌ అవుతానా!’ అనే చిన్న బెరుకు ఉండేదట. మొత్తానికైతే ఆడిషన్‌లో సెలెకై్ట ఆ సినిమాలో భాగమైపోయింది.

చారిత్రక పాత్రలు...
విభిన్నమైన పాత్రలు చేయడం అంటే తనకు ఇష్టం అని చెబుతుంది రుక్షర్‌. సంజయ్‌ లీలా బన్సాలీ సినిమాల్లో కనిపించే చారిత్రక పాత్రలు వేయడమంటే తనకు ఇష్టమట. ‘భాంగ్రా పా లె’ సినిమాతో బాలీవుడ్‌లోకి ప్రవేశించిన రుక్షర్‌ ‘ఫలానా ఇండస్ట్రీలో మాత్రమే పనిచేయాలని ఉంది’లాంటి పట్టింపులు లేవు అని చెబుతుంది. ‘ప్రాంతీయ చిత్రాలు కూడా ఇప్పుడు బాలీవుడ్‌లో రీమేక్‌ అవుతున్నాయి’ అంటూ ప్రాంతీయ చిత్రాల గొప్పతనాన్ని చెప్పకనే చెప్పింది రుక్షర్‌. 

మరిన్ని వార్తలు