మీతో పోల్చుకుంటే ఇదేం పెద్ద విషయం కాదు

13 May, 2020 15:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ములకు జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు తమదైన శైలిలో కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతిరోజు తమకు శీతల పానియాలు అందిస్తున్నందుకుగానూ గాంధీ ఆస్పత్రి వద్ద ఆయన పేరుతో ప్లకార్డులను ప్రదర్శిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. బుధవారం ట్విటర్‌ వేదికగా దీనిపై స్పందించిన శేఖర్‌ కమ్ముల ‘‘ గాంధీ ఆస్పత్రి వద్ద జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు నా కోసం ఇలా చేయటం వెలకట్టలేనిది. ఇది నాకు అతి పెద్ద బహుమతి. నేను చేసిన ఓ పని మిమ్మల్ని కదిలించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ, మీరు రాత్రింబవళ్లు మా కోసం చేస్తున్న దాంతో పోల్చుకుంటే ఇదేం పెద్ద విషయం కాదు. ( రానా పెళ్లిపై సురేష్‌ బాబు క్లారిటీ )

కాగా, మండే ఎండలను సైతం లెక్క చేయకుండా కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న గాంధీ ఆస్పత్రి పరిధిలోని జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల కోసం శీతల పానియాలు అందించే కార్యక్రమాన్ని చేపట్టారు శేఖర్‌ కమ్ముల. దాదాపు 1000 మందికి బట్టర్‌ మిల్క్‌, బాదాం మిల్క్‌ అందిస్తున్నారు. ఓ నెల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నారు. అంతేకాకుండా కర్నూల్‌ టౌన్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులకు కూడా శీతల పానియాలను అందిస్తున్నారాయన.

మరిన్ని వార్తలు