గుండెను తడిమేలా ఘంటసాల ది గ్రేట్‌

7 Oct, 2018 05:23 IST|Sakshi
కృష్ణచైతన్య, రాఘవేంద్ర రావు, రామారావు

‘‘ఘంటసాల అంటే పాట. పాట అంటే ఘంటసాల అని మనందరికీ తెలుసు. కానీ ఆయన వ్యక్తిత్వం ఏంటో తెలియజేసేదే ఈ చిత్రం’’ అని ‘ఘంటసాల ది గ్రేట్‌’ చిత్రబృందం పేర్కొంది. ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు ఘంటసాల జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఘంటసాల ది గ్రేట్‌’. ఘంటసాల పాత్రను గాయకుడు కృష్ణచైతన్య పోషించారు. సీహెచ్‌ రామారావు దర్శకత్వంలో ఆయన సతీమణి లక్ష్మీ నీరజ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం పోస్టర్స్‌ను దర్శకుడు రాఘవేంద్రరావు రిలీజ్‌ చేశారు.  డిసెంబర్‌లో రిలీజ్‌ కానున్న ఈ చిత్రం గురించి తుమ్మల రామసత్యనారాయణ మాట్లాడుతూ – ‘‘రామారావు చేసిన ఈ సాహసాన్ని అభినందించాలి. పాత్రల గురించి బాగా స్టడీ చేసి సినిమా తీశారు’’ అన్నారు.

‘‘బయోపిక్‌లు తీయడం చాలా కష్టం. గట్స్‌ ఉండాలి. ఇందులో హీరోగా ఓ పాత్ర చేశాను. చాలా అనుభవం ఉన్న దర్శకుడిలా రామారావు వర్క్‌ చేశారు’’ అన్నారు సాయి వెంకట్‌. ‘‘గొప్ప విజయాలను నమోదు చేయడమే కాకుండా గుండె తడి చేసి, గుండెను తడిమేసే సన్నివేశాలు ఈ కథలో ఉన్నాయి’’ అన్నారు సుదర్శన్‌. ‘‘నేను చాలా చిన్నవాణ్ని. మొదట ఈ సినిమా చేయకూడదనుకున్నా. ఇప్పుడు అలా ఎందుకు అన్నానా అనిపిస్తోంది. ఘంటసాలగారి పాటలు విన్నాం. ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసు. ఈ సినిమాలో ఆయన వ్యక్తిత్వం తెలియజేస్తున్నాం’’ అన్నారు కృష్ణ చైతన్య. ‘‘ఘంటసాలగారి మీద ఆరాధనతో ఈ సినిమా తీశాను. మా కష్టాన్ని అభినందిస్తారనుకుంటున్నాను’’ అన్నారు దర్శకుడు. ఈ చిత్రానికి సంగీతం: సాలూరి వాసూరావు, కెమెరా: వేణు వాదనల.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు