సెహభాష్‌ శాతకర్ణి

12 Jan, 2017 23:21 IST|Sakshi
సెహభాష్‌ శాతకర్ణి

రివ్యూ

చిత్రం: ‘గౌతమిపుత్ర శాతకర్ణి’
తారాగణం: బాలకృష్ణ,
హేమమాలిని, శ్రియ, కబీర్‌బేడీ
స్క్రీన్‌ప్లే కన్సల్టెంట్‌:భూపతిరాజా
మాటలు: బుర్రా సాయిమాధవ్
పాటలు: సీతారామశాస్త్రి
సంగీతం: చిరంతన్‌ భట్
కళ: భూపేశ్‌ ఆర్‌. భూపతి
కెమేరా: వి.ఎస్‌. జ్ఞానశేఖర్‌ (బాబా)
ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్
కూర్పు: సూరజ్‌ జగ్‌తప్ రామకృష్ణ, ఎగ్జిక్యూటివ్‌
నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు
నిర్మాతలు: రాజీవ్‌రెడ్డి,సాయిబాబు
రచన -దర్శకత్వం: క్రిష్
రిలీజ్‌: జనవరి 12,
నిడివి: 135 నిమిషాలు


బ్రాహ్మణ వంశ పరిపాలకుడైనా, బౌద్ధాన్ని ఆదరించిన మహాచక్రవర్తి శాతకర్ణి! ఇప్పటి తెలంగాణలోని కోటి లింగాల నుంచి, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని ధాన్యకటకం (అమరావతి) నుంచి భారతదేశాన్ని ఏకఖండంగా పాలించిన మన తెలుగువాడూ, శాతవాహన వంశ చక్రవర్తీ ఆయన. ఒకప్పుడు ముక్కలు ముక్కలుగా ఉన్న భారతదేశంలో 33 గణరాజ్యాల్ని జయించి ఒకే గొడుగు కిందకు తెచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి చరిత్ర గొప్పది. బి.యస్‌.ఎల్‌. హనుమంతరావు (‘ఆంధ్రుల చరిత్ర’), ఖండవల్లి లక్ష్మీరంజనం (‘ఆంధ్రుల చరిత్ర–సంస్కృతి’) లాంటి పెద్దల చరిత్ర రచనలు, చరిత్రకారులు– శాసన పరిశోధకులైన బి.ఎన్‌. శాస్త్రి ‘బ్రాహ్మణరాజ్య సర్వస్వము’, విశ్వనాథ సత్యనారాయణ వారి ‘ఆంధ్రప్రశస్తి’ లాంటి గ్రంథాలు, నాసిక్‌ తదితర శాసనాలు తప్ప శాతకర్ణి గురించి వివరాలు తక్కువ. యుద్ధంలో ఓటమెరుగని ఈ తెలుగు యోధుడి కథ తెలుగునాట కూడా చాలామందికి తెలియదు. మన గురించి మనకే తెలియడం లేదనే కోపం, ఆవేశం, ఆవేదనతో దర్శకుడు క్రిష్‌ ఈ కథను తెరకెక్కించారు. ‘యాన్‌ అన్‌సంగ్‌ స్టోరీ ఆఫ్‌ ఇండియాస్‌ గ్రేటెస్ట్‌ వారియర్‌ ఎంపరర్‌’ అని ప్రచారం చేశారు.

కథ ఏమిటంటే..:  చిన్న చిన్న రాజ్యాలు ఎక్కువై, దేశమంతటా యుద్ధాలతో సంక్షోభం రేగుతుండడంతో, అయిదేళ్ళ వయసు నుంచి దేశమంతటినీ ఒకే పాలన కిందకి తేవాలని శాతకర్ణి (బాలకృష్ణ) కల. తల్లి గౌతమి (హేమమాలిని) ఆశీస్సులతో దండయాత్రలు సాగిస్తాడు. దక్షిణాపథమంతా జయిస్తాడు. కుటుంబం పట్టడం లేదన్న భార్య వాసిష్టి (శ్రియ) నిష్ఠూరాలు, బౌద్ధ సన్న్యాసుల అపోహల మధ్యనే నహాపాణుడు (కబీర్‌బేడీ) లాంటి బలవంతులైన ఎందరో రాజుల్ని జయిస్తాడు. రాజసూయ పూజ చేసి, తల్లి పేరును తన ముందు చేర్చుకొని, గౌతమీపుత్ర శాతకర్ణి అవుతాడు. భార్య మెప్పు పొంది, పరాయి గ్రీకుల పీచమణిచి, కల నిజం చేస్తాడు.

బిగి సడలని కథా సంవిధానం:  మొదటి నుంచి వైవిధ్యభరితమైన కథాంశాలతో సినిమాలు తీయడం దర్శక, రచయితగా క్రిష్‌కున్న బలం. ఈ చారిత్రక కథాంశాన్ని కూడా ఒక డాక్యుమెంటరీలా కాక, బిగువైన కమర్షియల్‌ కథలా అల్లుకున్న తీరు, దాని నుంచి పక్కకు రాకుండా చెప్పడం ఈ సినిమాలో ఆయన అనుసరించిన రచనా వ్యూహం. చారిత్రక కథే అయినా, దీనిలో వ్యూహ ప్రతివ్యూహాలు, విషకన్య (గ్రీకు యువతి ఎథీనా) ప్రయోగాలు, చైల్డ్‌ సెంటిమెంట్, రాజకోటలో వెన్నుపోట్ల లాంటి జానపద సినిమాల్లో అలవాటైన మసాలాలూ దిట్టంగా పడ్డాయి. స్క్రిప్ట్‌ పరంగా 3 యుద్ధాలు, వాటి మధ్య నలిగిపోయిన భార్యాభర్తల బంధం, పసి వారసుడి సెంటిమెంట్‌ – లాంటి వాటి మధ్య ఈ కథను రాసుకోవడం ఒక రకంగా సాహసమే. అయినా సరే, ‘గ్లాడియేటర్‌’, ‘300’, ‘ట్రాయ్‌’ లాంటి సినిమాలు చూడడం అలవాటైన కొత్త తరానికి కూడా బాగుండేలా యుద్ధ సన్నివేశాలు, వాటికి ఉపోద్ఘాతంగా ఎప్పటికప్పుడు బలమైన సీన్లు, ట్విస్టులు అల్లుకోవడంతో సినిమా విసుగనిపించదు.

రెండుంబావు గంటల సినిమాలో ఎక్కడా లాగ్‌ కనిపించదు. ఎడిటింగ్‌ నేర్పునూ ఆ మేరకు మెచ్చుకోవాల్సిందే. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాలు, హీరో, హీరోయిన్ల టైట్‌ క్లోజప్‌లు వారి హావభావాలు ముద్ర పడేలా చేయడంలోనూ నైపుణ్యం కనిపిస్తుంది. విశేషమేమిటంటే తెరపై బాలకృష్ణ కాక గౌతమీపుత్ర శాతకర్ణి కనపడడం! కథనీ, పాత్రనీ ఆయన పూర్తిగా ఆవాహన చేసుకొని, తానే ఆ పాత్రగా మారినట్లనిపిస్తుంది. సినిమాలో ఆయన ఆంగికం, వాచికాల్లో అది స్పష్టంగా కనిపిస్తుంది. సందర్భానుసారంగా ఆయన హావభావాలూ అంతే! నటనలో ఎక్కడా దర్శక, రచయితల గీతను దాటలేదు.

చాలామంది హీరోలు: హీరో రూపురేఖల్ని చక్కదిద్దిన డి.ఐ.లో కరెక్షన్ల దగ్గర నుంచి ప్రతి సాంకేతిక శాఖా శ్రద్ధగా పనిచేసింది. అందుకే హీరో బాలకృష్ణ కావచ్చు కానీ, తెరపై ఈ చరిత్ర సృష్టికి అసలు హీరోలు చాలామందే! దర్శకుడు, మాటల రచయిత, పాటల రచయిత, కెమేరామన్, ఎడిటర్, సౌండ్‌ డిజైనర్, విజువల్‌ ఎఫెక్ట్స్‌ నిపుణుడు – ఇలా అందరి పాత్రా సమష్టికృషిగా సినిమాలో కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా, అవసరమైన ప్రతిచోటా మాటల రచయిత విశ్వరూపం చూపారు. ‘సమయం లేదు మిత్రమా! శరణమా? రణమా?’, ‘దేశం మీసం తిప్పుదాం’ లాంటి ఇప్పటికే పాపులరైన డైలాగ్స్‌ మాత్రమే కాకుండా క్లైమాక్స్‌ సహా అనేక కీలక సందర్భాల్లో రాసిన సందర్భోచితమైన పదునైన డైలాగ్స్‌ పాత్రల్నీ, సన్నివేశాల్నీ పైయెత్తున నిలిపాయి. ‘ఎకిమీడా...’ (రాజు, ప్రభువు అని అర్థం) లాంటి అచ్చతెలుగు పదాన్ని వాడిన యుగళ గీతం, ఎస్పీబీ, శ్రేయాఘోశల్‌ గొంతులో కొత్త సొబగులు పోయిన ‘అధరమదోలా అదిరినదేలా... మృగనయనా భయమేలనే’ పాట లాంటి వాటితో సీతారామశాస్త్రి కలం జుళిపించారు. ‘కంచె’ ఫేమ్‌ జ్ఞానశేఖర్‌ లైటింగ్, కెమేరా పనితనం, మ్యూజిక్‌ డైరెక్టర్‌ చిరంతన్‌భట్‌ బాణీలు, రీ–రికార్డింగ్‌ ఈ కథకు పెట్టని కోటలు. హీరోయిన్‌కు గాయని సునీత డబ్బింగ్‌ బాగుంది.

భాష తెలియనితనం, వేరేవాళ్ళ డబ్బింగ్‌ అక్కడక్కడా కొంత ఇబ్బందైనా, శాతకర్ణి తల్లి – రాజమాత గౌతమిగా హేమమాలిని చూడడానికి నిండుగా ఉన్నారు. ఆ పాత్ర ప్రాధాన్యాన్ని నిలబెట్టారు. శాతకర్ణి భార్య వాసిష్టిగా శ్రియ, పసివాళ్ళను బంధించే సౌరాష్ట్ర రాజైన శక వంశీకుడు నహాపాణుడిగా కబీర్‌బేడీ బాగున్నారు. శివకృష్ణ, ‘శుభలేఖ’ సుధాకర్, తనికెళ్ళ లాంటి సుపరిచితులూ ఉన్నారు.

లొకేషన్స్‌ అదుర్స్‌: కృష్ణాతీరంలోని అమరావతి రాజధానిగా కోటను చూపించడం కోసం మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్‌ (మషిష్మతి రాజ్యం అని ప్రసిద్ధి)లో రాణీ అహల్యాబాయ్‌ కోటలో తీసిన సీన్లు, ఏనుగుపై ఊరేగింపు, రాజసూయ యాగం వగైరా మనల్ని ఆ కాలానికి తీసుకెళతాయి. చాలా వరకు వీర రస ప్రధానంగా సాగే ఈ సినిమాలో మొదట వచ్చే ఓడలో ఫైట్, నహాపాణుడితో యుద్ధానికి ఎంచుకున్న మొరాకోలోని కోట (‘గ్లాడియేటర్‌’, ‘ట్రాయ్‌’ తదితర హాలీవుడ్‌ సినిమాలన్నీ చేసిన అట్లాస్‌ స్టూడియో), యవన (గ్రీకు) సమ్రాట్‌ డెమెత్రియస్‌తో క్లైమాక్స్‌లో హిమాలయ పర్వత సానువుల వద్ద యుద్ధాన్ని ప్రతిబింబిస్తూ పచ్చని మైదానాలు, మంచు కొండల నేపథ్యం కోసం రష్యా సరిహద్దు వద్ద జార్జియాలో చేసిన షూటింగ్‌ – ఇవన్నీ కథకు వన్నెలు అద్దాయి.

ఈ ప్రశ్నలకు బదులేది?: అదే సమయంలో, క్రీ.శ. 1వ శతాబ్దం నాటికి ‘దుకాణం’ లాంటి ఉర్దూ భాషా పదప్రయోగాలు తెలుగునాట ఉండేవా? చక్రవర్తి చేతిలో తంజావూరు వీణ, కొన్ని రకాల కాస్ట్యూమ్స్, జ్యువెలరీ చూసినప్పుడు కథాకాలాన్ని సరిగ్గా ప్రతిబింబించారా? ఆ రోజుల్లో వితంతువులు (ఆహార్యం, వస్త్రధారణల్లో) ఎలా ఉండేవారు? ‘ఏకబ్రాహ్మణుడు’ అనే బిరుదున్న ఈ బ్రాహ్మణ పరిపాలకుడిలో ఆ ఛాయలు లేవేంటి? శాతకర్ణి గుర్రం పశ్చిమ, దక్షిణ, తూర్పు సముద్రాలు మూడింటి నీరు తాగిందంటూ ‘త్రిసముద్ర తోయ పీత వాహన’ (తల్లి వేయించిన నాసిక్‌ శాసనం) అని బిరుదైతే, సినిమాలో ‘...పాన వాహన’ అన్నారేంటి? శాలివాహన శకానికీ, శాతకర్ణికీ నిజంగానే సంబంధం ఉందా? లాంటి ప్రశ్నలు చరిత్ర ప్రియులకు వస్తే తప్పుపట్టలేం. (ఇంటర్వెల్‌ను ‘శకారంభం’ అనాల్సింది ‘శఖారంభం’ అనడమూ పంటి కింద రాయే). అయితే, దాదాపు 2 వేల ఏళ్ళ క్రితం నాటి చరిత్రను... దొరుకుతున్న కొద్దిపాటి ఆధారాలనూ తీసుకొని, ఇవాళ ఊహాత్మకంగా, రాజకీయ వ్యూహాత్మకంగా తెరపై పునఃసృష్టిస్తున్నప్పుడు దీనిని సినిమాటిక్‌ లిబర్టీగా అర్థం చేసుకోవాలేమో!

తొడగొట్టాడంతే...: మొత్తం మీద తెలుగు జాతి చరిత్రలోని ఒక ముఖ్య ఘట్టాన్నీ, ఒక యోధుడి జీవితాన్నీ సంక్షిప్తంగానే అయినా – సీటులో నుంచి కదలనివ్వకుండా పిల్లలు, పెద్దలు చూసేలా తీసిన సినిమా ఇది. ‘బాహుబలి’తో పోలికలూ వస్తాయి. ప్రభుత్వాల నుంచి పన్ను మినహాయింపులు ఆల్రెడీ అందుకున్న ఈ చిత్రం సమష్టి సాంకేతిక కృషికి గుర్తింపుగా రానున్న రోజుల్లో అవార్డుల జల్లులో తడిస్తే ఆశ్చర్యం లేదు. వాణిజ్య ఫలితమంటారా? బాలకృష్ణ తొడకొడితే సిన్మా హిట్‌ అని ప్రచారం! ఈ సినిమాలో ఇంటర్వెల్‌లో ఆయన ఒకసారి ఒక తొడ కొట్టారు. క్లైమాక్స్‌లో ఏకంగా రెండు తొడలూ కొట్టారు. పైగా, ఆయన సంక్రాంతి సెంటిమెంట్‌ సరేసరి! ఇక రిజల్ట్‌ వేరే చెప్పాలా?

అన్ని రకాలుగా గుర్తుండిపోయే సిన్మా!
ఇలాంటి చారిత్రక పాత్రలకు నప్పే హీరో బాలకృష్ణకు (అతిథి పాత్రపోషణ సినిమాలు కలప కుండా) ఇది 100వ సినిమా.  తెలుగులో రెండే రెండు చిత్రాల్లో (ఎన్టీఆర్‌ ‘పాండవ వనవాసం’– 1965, ‘శ్రీకృష్ణ విజయం’ –1971) నటించిన హిందీ నటి హేమమాలిని 46 ఏళ్ళ తర్వాత మళ్ళీ తెలుగు తెరపైకి వచ్చారు. గ్రాఫిక్‌ ప్లేట్‌ వర్క్స్‌తో కలిపి రికార్డు టైమ్‌లో 85 రోజుల్లో ఈ భారీ చిత్రం షూటింగ్‌ పూర్తవడం విశేషం. రూ. 40 కోట్ల పైగా వ్యయమైనట్లు భోగట్టా. రూ. 60 కోట్లకు పైనే వ్యాపారమై 20 కోట్ల టేబుల్‌ ప్రాఫిట్‌ వచ్చింది.

– రెంటాల జయదేవ