బాలా చేతిలో మరో వారసురాలు

13 Mar, 2018 05:11 IST|Sakshi
సుబ్బులక్ష్మీ, ధృవ్‌

దర్శకుడు బాలా మరో నట వారసురాలిని నటిగా మలచనున్నారా? ఈ ప్రశ్నకు కోలీవుడ్‌ వర్గాల నుంచి అవుననే బదులు వస్తోంది. వైవిధ్యభరిత కథా చిత్రాలకు పెట్టింది పేరు దర్శకుడు బాలా. సేతు, పితామగన్, నందా, నాన్‌కడవుల్‌ ఇలా ఒకదానికొక్కటి సంబంధం లేని కథా చిత్రాల సృష్టి కర్త బాలా. ఇటీవల జ్యోతిక, జీవీ ప్రకాశ్‌కుమార్‌లు నటించిన నాచియార్‌ చిత్రంతో మరో సారి తన సత్తా చాటుకున్నాడు. ఈ దర్శకుడు తాజాగా తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్‌రెడ్డి చిత్రాన్ని తమిళంలో రీమేక్‌ చేసే బాధ్యతలను భుజాన వేసుకున్నారు.

ఈ చిత్రం ద్వారా నటుడు విక్రమ్‌ కొడుకు ధృవ్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ ఇటీవలే తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది కూడా. అయితే ఇందులో నాయకి ఎవరన్నది ఇంకా నిర్ణయం కాలేదు. తెలుగులో ఈ పాత్ర పోషించిన మరాఠీ  భామ శాలినిపాండే  విపరీతంగా క్రేజ్‌ తెచ్చుకుంది. ఇక అర్జున్‌రెడ్డి తమిళ రీమేక్‌కు బాలా వర్మ అనే టైటిల్‌ను పెట్టారు. ఇందులో శాలినిపాండే పాత్రలో చిల్లన్ను ఒరు కాదల్‌ చిత్రంలో బాల నటిగా నటించిన శ్రియశర్మను నటింపజేయడానికి చర్చలు జరిగాయి.

ఆ తరువాత తెలుగులో నటించిన శాలినిపాండేనే తమిళంలోనూ నటించనుందనే ప్రచారం జరిగింది. అయితే తాజాగా మరో పేరు వెలుగులోకి వచ్చింది. సీనియర్‌ నటి గౌతమి కూతురు సుబ్బులక్ష్మీని బాలా కథానాయకిగా పరిచయం చేయనున్నారన్నదే ఆ న్యూస్‌. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. వర్మ చిత్ర షూటింగ్‌ రెండో షెడ్యూల్‌ త్వరలో చెన్నైలో నిర్వహించడానికి చిత్ర యూనిట్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో ధృవ్‌తోపాటు సుబ్బులక్ష్మీ పాల్గొనే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు