శింబు, అనుష్కలతో మల్టీస్టారర్‌ చిత్రం?

8 Jun, 2018 08:21 IST|Sakshi

తమిళ సినిమా: దర్శకుడు గౌతమ్‌మీనన్‌ మల్టీస్టారర్‌ చిత్రం గురించి మరోసారి వార్తల్లో నానుతోంది. ఈ దర్శకుడు ప్రస్తుతం విక్రమ్‌ హీరోగా ధ్రువనక్షత్రం, ధనుష్‌ కథానాయకుడిగా ఎన్నై నోక్కి పాయుమ్‌ తూట్టా చిత్రాలు చేస్తున్నారు. అయితే ఈ రెండు చిత్రాలు చాలా కాలం నిర్మాణంలో ఉన్నాయన్నది గమనార్హం. అదే విధంగా గోలీసోడా–2 చిత్రంలో గౌతమ్‌మీనన్‌ ఒక ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. గౌతమ్‌మీనన్‌ ఇది వరకే ఒక మల్టీస్టారర్‌ చిత్రం చేయనున్నట్లు ప్రకటించారు. తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో తెరకెక్కించే ఈ చిత్రంలో నాలుగు భాషలకు చెందిన ప్రముఖ నటులు హీరోలుగా నటిస్తారని, హీరోయిన్‌గా అనుష్క నటిస్తారని వెల్లడించారు.

నటి అనుష్క కూడా భాగమతి చిత్ర ప్రచారం కార్యక్రమంలో తాను దర్శకుడు గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో నటించడానికి అంగీకరించినట్లు తెలిపారు. ఆ క్రేజీ చిత్రాన్ని త్వరలో ప్రారంభించడానికి గౌతమ్‌మీనన్‌ సన్నాహాలు చేస్తున్నట్లు తాజాగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ మల్టీస్టారర్‌ చిత్రంలో తమిళ వెర్షన్‌లో హీరోగా నటుడు మాధవన్‌ నటించనున్నట్లు దర్శకుడు గౌతమ్‌మీనన్‌ ఇంతకు ముందు తెలిపారు. అయితే ఇప్పుడా పాత్రలో నటుడు శింబును నటింపజేయడానికి  చర్చలు జరిపిన్నట్లు ప్రచారం. ఇక మలయాళ వెర్షన్‌లో టోవినో థామస్, కన్నడంలో పునీత్‌ రాజ్‌కుమార్‌ హీరోలుగా నటించనున్నారు. అదే విధంగా తెలుగులో ఒక ప్రముఖ నటుడి నటింపజేయడానికి చర్చలు జరుపుతున్నట్లు టాక్‌. ఇకపోతే ఇందులో అనుష్క హీరోయిన్‌గా నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. శింబు,గౌతమ్‌మీనన్‌ల కాంబినేషన్‌లో ఇంతకు ముందు విన్నైతాండి వరువాయా, అచ్చం యంబదు మడమయడా వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాలు వచ్చాయన్నది తెలిసిందే. ఈ మల్టీస్టారర్‌ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలతో అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం.

మరిన్ని వార్తలు