'జెంటిల్మన్' మూవీ రివ్యూ

17 Jun, 2016 13:30 IST|Sakshi
'జెంటిల్మన్' మూవీ రివ్యూ

టైటిల్ : జెంటిల్మన్
జానర్ : థ్రిల్లర్
తారాగణం : నాని, నివేదా థామస్, సురభి, అవసరాల శ్రీనివాస్
సంగీతం : మణిశర్మ
దర్శకత్వం : ఇంద్రగంటి మోహనకృష్ణ
నిర్మాత : శివలెంక కృష్ణప్రసాధ్

వరుస సక్సెస్లతో మంచి ఫాంలో ఉన్న నాని హీరోగా, అతడిని హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జెంటిల్మన్. వరుసగా ప్రయోగాలు చేస్తూ వస్తున్న నాని ఈ సినిమాతో కూడా మరోసారి అదే ప్రయత్నం చేశాడు. ఫస్ట్ టైమ్ నెగెటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్లో నాని కనిపించటంతో, పాటు దర్శకుడు మోహనకృష్ణ కూడా తొలిసారిగా థ్రిల్లర్ సబ్జెక్ట్ను డీల్ చేశాడు. మరి ఈ ఇద్దరి ప్రయత్నం ఫలించిందా..? నాని జెంటిల్మన్గా అభిమానులను మెప్పించాడా.?


కథ : జయరామ్ ముళ్లపూడి (నాని) చిన్న వయసులోనే యంగ్ ఎంటర్ ప్రెన్యూర్ గా అవార్డ్ అందుకున్న పెద్ద బిజినెస్ మన్, జైగౌరీ కంపెనీ అధినేత. మంచి బిజినెస్ మన్ గానే కాదు.. మంచి మనిషిగా కూడా పేరున్న జైని తన ఇంటి అల్లుడు చేసుకోవాలనుకుంటాడు ఐశ్వర్య ఇండస్ట్రీస్ ఓనర్. జై కూడా ఐశ్వర్య(సురభి)తో పెళ్లికి ఒప్పుకుంటాడు. కొద్ది రోజుల్లో పెళ్లి అనుకుంటున్న సమయంలో తన ఫ్రెండ్స్ని కలవటానికి లండన్ వెళుతుంది ఐశ్వర్య. తిరిగి వచ్చేటప్పుడు ఫ్లైట్లో కలిసిన క్యాథరిన్(నివేదా)కు కొద్ది సమయంలోనే మంచి స్నేహితురాలవుతుంది.

ఫ్లైట్ దిగిన ఐశ్వర్యను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన జయరామ్, అచ్చు తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్(నాని) లాగే ఉండటం చూసి షాక్ అవుతుంది క్యాథరిన్. అదే సమయంలో తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్ యాక్సిడెంట్లో చనిపోయాడని తెలుస్తుంది. అయితే గౌతమ్ యాక్సిడెంట్లో చనిపోలేదని, ఎవరో చంపారని ఓ రిపోర్టర్ ద్వారా తెలుసుకున్న క్యాథరిన్, గౌతమ్ మరణం వెనక మిస్టరీని ఛేదించాలనుకుంటుంది. మరి అనుకున్నట్టుగా క్యాథరిన్, గౌతమ్ను చంపింది ఎవరో కనిపెట్టిందా..? అసలు జయరామ్కు, గౌతమ్కు సంబంధం ఏంటి..? నిజంగా నాని హీరోనా..?  విలనా..? అన్నదే మిగతా కథ.

నటీనటులు :
జయరామ్గా రిజర్వర్డ్గా, గౌతమ్గా ఎనర్జిటిక్గా రెండు పాత్రల్లోనూ నాని తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. తొలిసారిగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించిన నాని నేచురల్ స్టార్గా మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన నివేదా థామస్ ఆకట్టుకుంది. బాయ్ ఫ్రెండ్ను పొగొట్టుకొని, ఆ బాధలోనే అతని మరణం వెనక రహాస్యాన్ని ఛేదించే అమ్మాయిగా మంచి నటన కనబరిచింది. సురభి పాత్ర చిన్నదే అయిన ఉన్నంతలో అందంతో అభినయంతో మెప్పించింది. మరో ప్రధాన పాత్రలో నటించిన అవసరాల శ్రీనివాస్ రోటీన్ కు భిన్నంగా కొత్త తరహా పాత్రలో మెప్పించాడు. ఇతర పాత్రలలో రోహిణి, తనికెళ్ల భరణి, ఆనంద్, వెన్నెల కిశోర్, సత్యం రాజేష్లు తమ పరిధి మేరకు పాత్రలకు ఆకట్టుకున్నారు.

సాంకేతిక నిపుణులు :
ఇప్పటి వరకు అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్, అంతకు ముందు ఆ తరువాత లాంటి క్లాస్ లవ్ స్టోరీస్ను తెరకెక్కించిన ఇంద్రగంటి మోహనకృష్ణ తొలిసారిగా థ్రిల్లర్ జానర్లో ఈ సినిమాను తెరకెక్కించాడు. ఫస్ట్ హాఫ్ అంతా తనకు బాగా పట్టున్న క్లాస్ ఫార్మాట్లో నడిపించిన మోహనకృష్ణ, సెకండ్ హాఫ్లో థ్రిల్లర్ ఎలిమెంట్స్ను కూడా అద్భుతంగా డీల్ చేశాడు.

ముఖ్యంగా నాని పాత్రను మలచిన తీరు ఆకట్టుకుంటుంది. లాస్ట్ సీన్ వరకు అభిమానులను కట్టి పడేసేలా అద్భుతమైన స్క్రీన్ప్లేతో ఆకట్టుకున్నాడు మోహనకృష్ణ. సినిమాకు మరో ప్లస్ పాయింట్ మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం. ప్రతీ సీన్ను తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో మరింత ఇంట్రస్టింగ్గా మలిచాడు, అయితే పాటల విషయంలో మరింత కేర్ తీసుకొని ఉంటే బాగుండేది. పిజి విందా సినిమాటోగ్రఫి, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ సినిమా స్థాయిని పెంచాయి.

ప్లస్ పాయింట్స్ :
నాని పర్ఫామెన్స్
స్క్రీన్ప్లే
నేపథ్య సంగీతం

మైనస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్ స్లో నేరేషన్
పాటలు

ఓవరాల్గా జెంటిల్మన్ నాని స్థాయిని పెంచే పర్ఫెక్ట్ థ్రిల్లర్

- సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్