‘జార్జిరెడ్డి’ ఫస్ట్‌ లుక్‌

1 Aug, 2019 20:12 IST|Sakshi

కాలం కరిగిపోతుంది.. కాలం మాటున చరిత్ర కూడా మరుగునపడుతోంది. కానీ చరిత్ర పుటల్లోని ఒక పేజీని ప్రపంచానికి పరిచయం చేయడానికి ‘జార్జిరెడ్డి’ అనే చిత్రం ముందుకు వస్తోంది. ఉస్మానియా యూనివర్సీటీలో చదువుకున్న విద్యార్థుల్లో జార్జ్‌రెడ్డి పేరు తెలియని వారు ఉండరు. ఉద్యమాల్లో తిరుగులేని నాయకుడిగా ఎదిగిన జార్జిరెడ్డిని ఉస్మానియా క్యాంపస్‌లో దారుణంగా హత్య చేశారు. సమసమాజ స్థాపనే ధ్యేయంగా సాగిన ఆయన జీవితాన్ని, ఆనాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపేందుకు ‘జార్జిరెడ్డి’ అనే చిత్రం రాబోతోంది.

ఉద్యమ కెరటంలా కనిపిస్తున్న ‘జార్జిరెడ్డి’ ఫస్ట్‌లుక్‌ సినిమాపై ఆసక్తిని పెంచింది. బయోపిక్‌ చిత్రం అయినప్పటికీ కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ పుష్కలంగా ఉన్నాయని పోస్టర్‌ చూస్తుంటేనే అర్థమవుతోంది. తన పేరును చరిత్రలో శాశ్వతంగా లిఖించుకున్న జార్జ్‌రెడ్డి అనే విద్యార్థి నాయకుడి ఆత్మకథతో వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన మొదటి లుక్‌ను చిత్ర బృందం గురువారం విడుదల చేసింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయని నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రాన్ని మైక్ మూవీస్ అధినేత అప్పిరెడ్డి సిల్లీ మంక్స్, త్రీ లైన్స్‌ సినిమా బ్యానర్లతో కలిసి నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సురేష్‌ బొబ్బిలి సంగీతం అందిస్తుండగా.. సైరాట్‌, నాల్‌ చిత్రాలకు పనిచేసిన సుధాకర్‌ యెక్కంటి కెమెరామెన్‌గా పనిచేస్తున్నారు. జీవన్‌ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు