‘జార్జిరెడ్డి’ సినిమాను అడ్డుకుంటే సహించం

22 Nov, 2019 09:30 IST|Sakshi
జార్జిరెడ్డి సినిమాలోని దృశ్యం

సాక్షి, హైదరాబాద్‌: జార్జిరెడ్డి నేటి తరానికి ఆదర్శమని, ఆయన సినిమాను అడ్డుకుంటే సహించేది లేదని ఇండియన్‌ నేషనల్‌ యువజన పార్టీ పేర్కొంది. సినిమా విషయంలో ఎవరికైనా అభ్యంతరాలుంటే కోర్టును ఆశ్రయించాలని సూచించింది. అంతేగానీ ఇష్టానుసారంగా అడ్డుకుంటామని చెప్పడం సరికాదంది. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు బందెల కాంత్రికుమార్‌ మాట్లాడుతూ... కొన్ని అరాచక శక్తులు సినిమాను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాయని, దాన్ని విరమించుకోవాలన్నారు. లేని పక్షంలో ఊరుకోబోమని హెచ్చరించారు. తమ పార్టీ ప్రజాస్వామ్య స్ఫూర్తితో ముందుకెళ్తోందన్నారు. సమావేశంలో పార్టీ జాతీయ కోశాధికారి వినయ్‌సాగర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్‌కల్యాణ్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.  

విలేకరుల సమావేశంలో ఇండియన్‌ నేషనల్‌ యువజన పార్టీ ప్రతినిధులు

ఎవరినీ కించపరచలేదు: దర్శకుడు
చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకున్న జార్జిరెడ్డి జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ‘జార్జిరెడ్డి’ చిత్ర దర్శకుడు జీవన్‌రెడ్డి అన్నారు. సినిమా విడుదల సందర్భంగా గురువారం నారాయణగూడలోని క్రైస్తవ స్మశానవాటికలో జార్జిరెడ్డి సమాధి వద్ద చిత్ర యూనిట్‌ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దర్శకుడు జీవన్‌రెడ్డి, నిర్మాతలు దామోదర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, హీరో సందీప్‌ మాధవ్‌ మాట్లాడుతూ నీతి, నిజాయితీ గల జార్జిరెడ్డి రేపు మళ్లీ పుట్టబోతున్నాడని, ఆయన జీవితం అందరికి ఆదర్శప్రాయంగా ఉంటుందన్నారు. జార్జిరెడ్డి చిత్రం విడుదల తర్వాతే ఎవరికైనా తాను సమాధానం చెబుతానని దర్శకుడు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఎవరినీ కించపరిచే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని నిర్మించలేదని, ఆయన నీతి, నిజాయితీ, నాయకత్వ లక్షణాలు తను ఎంతో ఆకట్టుకున్నాయని, రెండేళ్ల పాటు జార్జిరెడ్డి జీవితాన్ని అధ్యయనం చేశాక సినిమాగా రూపొందించామన్నారు. 25 ఏళ్లకే ఓ విద్యార్థి నాయకుడిగా ఎదిగి నాటికి, నేటికి యువతకు స్ఫూర్తిగా నిలిచాడని సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. సినిమాపై ఎలాంటి ఆపోహలు వద్దని, ఎవరికైనా అభ్యంతరముంటే వారితో కలిసి తాము సినిమాను చూస్తామని, వారికి సమాధానం చెబుతామని జీవన్‌రెడ్డి అన్నారు. జార్జిరెడ్డి జీవితకథ మాత్రమే చిత్రంలో చూపిస్తున్నామన్నారు. సమాజం జార్జిరెడ్డి లాంటి వాళ్లను చాలామందిని కోల్పోయిందని, ఎలా కోల్పోయామో తెలిపేందుకు సినిమా తీశామన్నారు.  (చదవండి: ‘జార్జిరెడ్డి’ సినిమా ఎలా ఉందంటే..?)

జార్జిరెడ్డి సమాధి వద్ద నివాళి అర్పిస్తున్న దృశ్యం

మరిన్ని వార్తలు