అప్పట్లో నా వైపు వింతగా చూసేవాళ్లు!

10 Jul, 2015 23:29 IST|Sakshi

‘‘శరీరం, మనసు... రెండూ తేలికగా ఉంటే ఏ పనైనా తేలికగా చేసేయొచ్చు. కానీ, అవి తేలికగా ఉండాలంటే ఏం చేయాలి? ఎప్పటికీ సాధించలేమనుకునే కొన్ని విషయాలను కూడా ఒక పనితో ఇట్టే సాధించగలం. అదెలా? ఈ రెండు ప్రశ్నలకూ సమాధానం ఒకటే... యోగా’’ అని శిల్పా శెట్టి అంటున్నారు. ఇప్పుడామె వయసు నలభై ఏళ్లు. కానీ, ఆమె శరీరాకృతి పాతికేళ్ల పడుచులను పోలినట్లుగా ఉంటుంది. అలాగే, శిల్పాశెట్టి చాలా హుషారుగా కనిపిస్తారు. అందంతో పాటు మంచి ఆరోగ్యంతో ఉన్నట్లు అనిపిస్తుంటారు.

ఆ ఘనత మొత్తం యోగాకే దక్కుతుందంటున్నారామె. యోగా గురించి ప్రత్యేకంగా కొన్ని విషయాలను ఆమె ఈ విధంగా పంచుకున్నారు.

 
యోగా అనేది మన సంస్కృతి. కానీ, మన దేశంలో కన్నా విదేశాల్లోనే దీనికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఇక్కడ కూడా యోగా విలువ తెలుసుకుంటున్నారు. పధ్నాలుగేళ్ల క్రితం నేను యోగా మొదలుపెట్టాను. అప్పట్లో నేను యోగా చేస్తుంటే చాలామంది వింతగా చూసేవాళ్లు.

యోగా అనేది వృద్ధుల కోసమే అనే అపోహ ఒకప్పుడు ఉండేది. ఆ అపోహ తొలగించాలనే సంకల్పంతోనే నేను యోగా డీవీడీ చేశాను. ఆ డీవీడీని పెద్దలు మాత్రమే కాదు.. పిల్లలు కూడా చూడాలని కోరుకున్నాను. ఎందుకంటే, భవిష్యత్తు అంతా పిల్లల పైనే ఆధారపడి ఉంది. ‘మీ యోగా డీవీడీ చాలా ఉపయోగంగా ఉంది’ అని నాతో చాలామంది అంటుంటారు. అప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంటుంది.

జిమ్‌తో పోలిస్తే యోగా చేయడానికి అయ్యే ఖర్చు తక్కువ. ఇంకా చెప్పాలంటే రూపాయి ఖర్చు లేకుండా యోగా చేయొచ్చు. ఉచితంగా యోగా చేయించేవారి శాతం ఇప్పుడు ఎక్కువే ఉంది. జిమ్ చేస్తున్నప్పుడు శరీర భాగాలన్నీ కదులుతాయో లేదో నాకు తెలియదు కానీ, యోగా చేస్తున్నప్పుడు కదలని భాగం ఉండదు.

యోగాకు కులమతాలతో సంబంధం లేదు. అందరూ చేయొచ్చు. వయసు తారతమ్యం లేదు. ఆస్తి, అంతస్థుల పట్టింపు లేదు. ఆరోగ్యం మీద శ్రద్ధ ఉన్న ప్రతి ఒక్కరూ చేయొచ్చు. ప్రాణాయామం మంచి ఫలితాన్నిస్తుంది. అందుకనే నేను దాదాపు రోజూ యోగా చేస్తాను. దీనికోసం కనీసం ఐదు నిమిషాలైనా కేటాయిస్తాను.

నాకు అన్ని ఆసనాలూ ఇష్టమే. ఒక్కో ఆసనం పని తీరు ఒక్కో విధంగా ఉంటుంది. కానీ, ‘సూర్య నమస్కారాలు’ మాత్రం శరీరంలో ఉన్న అన్ని భాగాలనూ కదిలిస్తాయి. రోజుకి జస్ట్ మూడుసార్లు సూర్య నమస్కారాలు చేసి చూడండి. చెమట పట్టేస్తుంది. శరీరంలో ఉండే మలినం ఆ చెమట రూపంలో బయటకు వచ్చేస్తుంటుంది. ఇక, ఎక్కువసార్లు సూర్య నమస్కారాలు చేస్తే ఎంత ఫలితం ఉంటుందో ఊహించుకోవచ్చు. మీరు కనుక ఎక్కువసార్లు సూర్య నమస్కారాలు చేస్తే, ఇక ఆ తర్వాత ఏ ఆసనాలూ వేయాల్సిన అవసరం లేదు. అదే సరిపోతుంది.

నా జీవనశైలి ఎంతో క్రమశిక్షణతో ఉంటుంది. రాత్రి త్వరగా నిద్రపోవడం, తెల్లవారుజామున మేల్కోవడం నా అలవాటు. ఒక్క ఆదివారం మినహా మిగతా అన్ని రోజుల్లోనూ ఓ పద్ధతి ప్రకారం డైట్ ఫాలో అవుతాను. జిహ్వ చాపల్యం తీర్చుకోవడం కోసం కాకుండా, ఆరోగ్యానికి ఏది మంచిదో అదే తింటాను. అది కూడా టైమ్ ప్రకారమే.