‘సంస్కార’ సాహసి గిరీష్‌ కర్నాడ్‌

10 Jun, 2019 13:57 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నారణప్ప అంత్యక్రియలు ఎలా చేయాలనే విషయంలో ఓ బ్రాహ్మణ బృందం తర్జనభర్జనలు పడుతుంటోంది. మద్యం తాగి, మాంసం తినే అలవాటున్న వాడే కాకుండా గుడి కోవెలలోనే చేపలు పట్టిన వాడు, అందులోను ఓ దళిత మహిళతో కలిసి ఉండేందుకు తన బ్రాహ్మణ భార్యను వదిలేసిన వ్యక్తిని ఎలా బ్రాహ్మణుడిగా గుర్తించాలి? బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం ఎలా అంత్యక్రియలు జరపాలన్నది వారి తర్జనభర్జన. ఇంతలో నారణప్ప ప్రేయసి చంద్రి అక్కడికి వస్తుంది. తాను దాచుకున్న, ఒంటికున్న నగలన్నింటిని వలచి ఆ బ్రాహ్మణ బృందం ముందు పడేసి వీటన్నింటిని తీసుకొని నారణప్పకు ఘనంగా అంత్యక్రియలు జరపాలని వేడుకుంటుంది. ఆ బంగారు నగలను చూసి కళ్లు చెదిరిన బ్రాహ్మణులు అసలు విషయాన్ని మరచిపోయి ఆ నగలు ఎవరు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలనే విషయమై చర్చ మొదలవుతుంది. నారణప్ప అంత్యక్రియలు ఎలా జరపాలనే విషయం తేలకపోవడంతో బ్రాహ్మణ అగ్రగణ్యుడు, అగ్రహారపు బ్రాహ్మణుడు ప్రణేశాచార్యకు ఆ చిక్కుముడిని విప్పాల్సిన బాధ్యతను అప్పగిస్తారు. 

1970లో విడుదలై ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు అందుకున్న ‘సంస్కార’ కన్నడ భాషా చిత్రంలోని సన్నివేశం ఇది. ఇందులో ప్రణేశాచార్యగా ప్రముఖ బహు భాషా సినీ నటుడు, దర్శకుడు గిరీష్‌ కర్నాడ్‌ నటించారు. ఆయన నటించిన మొట్టమొదటి చిత్రం ఇదే. యూఆర్‌ అనంతమూర్తి 1965లో ఈ ‘సంస్కార’ అనే నవలను రాశారు. అనుకోకుండా ఆ నవలను చదివిన గిరీష్‌ కన్నాడ్‌ కదిలిపోయారు. ఎలాగైనా దాన్ని సినిమాగా తీయాలని పట్టుకు తిరిగారు. ఆయనకు సహకరించేందుకు ‘మద్రాస్‌ ప్లేయర్స్‌’ థియేటర్‌ గ్రూప్‌నకు చెందిన సభ్యులు, తిక్కవరపు పట్టాభి రామరెడ్డి ముందుకు వచ్చారు. తాను సినిమాను తీసేందుకు డబ్బును సమకూర్చడంతోపాటు దర్శకత్వం వహించేందుకు రామరెడ్డి సిద్ధపడ్డారు. ఆయనతో కలిసి గిరీష్‌ కర్నాడ్‌ ఆ సినిమాకు స్క్రిప్టు రాశారు. అందులో చంద్రిగా పట్టాభి రామిరెడ్డి భార్య స్నేహలతా రెడ్డి నటించారు. 

జాతీయ అవార్డు, ప్రశంసలు
మొదట ఈ సినిమా విడుదలకు అనేక అభ్యంతరాలు వచ్చాయి. బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ప్రతికూలత వస్తోందని నాటి కర్ణాటక ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తం చేసింది. చివరకు ఎలాగో 1970, మే 13వ తేదీన విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అప్పటికే కొనసాగుతోన్న ‘మరో సినిమా’ ఉద్యమానికి ఈ సినిమా కొత్త ఊపిరిని పోసింది. జాతీయ స్థాయిలో దీనికి ‘ఉత్తమ చిత్రం’ అవార్డు వచ్చింది. 

కర్నాడ్‌ పాత్ర అంతర్మథనం
బ్రాహ్మణ కులాచారాలు తప్పకుండా, అటు అబ్రాహ్మణుడైన నారణప్పకు ఎలా అంత్యక్రియలు జరిపించాలో పాలుపోకా అంతర్మథనపడే పాత్రలో గిరీష్‌ కర్నాడ్‌ అద్భుతంగా రాణించారు. ఎలా అంత్యక్రియలు జరపాలో చంద్రిని అడిగి తెల్సుకుందామని ఊరిబయటనున్న ఆమె వద్దకు వెళ్లిన ప్రణేశాచార్య (కర్నాడ్‌) ఆమె ప్రేమ వలపులో చిక్కుకుంటారు. కులం తక్కువ పిల్లతో లైంగిక సుఖాన్ని అనుభవించిన తనదే కులం ఇప్పుడు ? ఎవరి కులంలో ఏముంది ? అసలు కులాలు ఏమిటీ ? అని తాంత్విక చింతనలో పడిన ప్రణేశాచార్య ఊర్లోకి వస్తారు. అప్పటికే ఊరిలో ‘ప్లేగ్‌’ విస్తరించడంతో ప్రజలంతా ఊరొదిలి పారిపోతుంటారు. నారణప్ప మతదేహం కుళ్లిపోవడం వల్ల ప్లేగ్‌ వ్యాపిస్తోంది. నారణప్పకు సకాలంలో అంత్యక్రియలు చేయకపోవడం వల్ల ఊరంటుకుంది అన్న సందేశంతో సినిమా ముగుస్తుంది.

పట్టాభి రామిరెడ్డి సాహసం
ఓ అగ్రవర్ణంలో సంస్కరణను ఆశిస్తూ ఈ చిత్ర నిర్మాణానికి. దర్శకత్వానికి పట్టాభి రామిరెడ్డి ముందుకు రావడం ఓ సాహసమైతే ఆయన భార్యతోనే చంద్రి పాత్రను వేయించడం ఆయన ఉన్నత సంస్కారానికి నిదర్శనం. అడవిలో చంద్రి, ప్రణేశాచార్య శారీరకంగా కలుసుకునే దశ్యానికి వాస్తవికంగా చూపిస్తానంటూ పంతం పట్టి మరీ ఆ దశ్యాన్ని ఆయన చిత్రీకరించడం కూడా విశేషమే. ఎందుకంటే అప్పటి వర కు స్త్రీ, పురుషులు లైంగికంగా కలుసుకున్నారనడానికి రెండు పుష్పాలు పరస్పరం తాకినట్టో పెనవేసుకున్నట్లో చూపేవారు. కళాకారుడు ఎస్‌జీ వాసుదేవ్, రచయిత రాణి డే బుర్రా. ఆస్ట్రేలియా చిత్ర దర్శకుడు టామ్‌ కోవన్‌ తదితరులు ఈ చిత్ర నిర్మాణానికి సహకరించారు. 
(ఈరోజు ఉదయం బెంగళూరులో మరణించిన గిరీష్‌ కర్నాడ్‌ సంస్మరణార్థం ఈ వ్యాసం)

మరిన్ని వార్తలు