పురస్కారాలు పదిలం చేసుకోవాలి

27 Jan, 2014 03:59 IST|Sakshi
పురస్కారాలు పదిలం చేసుకోవాలి
 పురస్కారాలను పొందడం ఎంత ప్రధానమో వాటిని పదిలపరచుకోవడం అంతే ముఖ్యమని ప్రఖ్యాత నటుడు పద్మశ్రీ కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. తాజాగా ప్రతిష్టాత్మకమైన అవార్డు పద్మభూషణ్‌ను సొంతం చేసుకున్న ఈ సకల కళావల్లభుడు ఆదివారం స్థానిక ఆల్వార్‌పేటలోని తన కార్యాలయంలో మీడియూతో మాట్లాడారు. పద్మభూషణ్ అవార్డు తనను వరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి పురస్కారం కోసం ఎందరో ఎదురు చూస్తుంటారని, అలాంటి అవార్డు తనకు దక్కడం గర్వంగా భావిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా విలేకరుల ప్రశ్నలకు కమల్ హాసన్ కింది విధంగా బదులిచ్చారు. 
 
ఈ అవార్డు రావడానికి కారణం ఎవరు?
 కచ్చితంగా నా తల్లిదండ్రులు, గురువులే. తల్లిదండ్రులు ఏర్పరచిన పునాది, గురువులు బోధించిన విద్యనే కారణం. దర్శకుడు కె.బాలచందర్, ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు బాలమురళీ కృష్ణలాంటి వారే పద్మభూషణ్ లాంటి వారు. వారు నాకు గురువులు కావడం నా అదృష్టం. నిజానికి వారి స్థారుు అంత ఉందనినాకప్పుడు అనిపించలేదు. ఇప్పుడు అనిపిస్తోంది. నాతోపాటు ప్రముఖ గీత రచయిత వైరముత్తుకు పద్మభూషణ్ అవార్డు లభించడం సాహితీ రంగానికే గర్వకారణం అన్నారు.
 
 పద్మభూషణ్‌పై మీకు రావడంపై కామెంట్?
 అవార్డును పొందడం దక్కించుకోవడం సంతోషంగా ఉన్నా దాన్ని నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడాలి. పురస్కారాన్ని పొందాలి, దాన్ని పదిలపరచుకోవాలి. అలాగే ఇలాంటి అత్యుత్తమ అవార్డు కోసం ఎదురు చూస్తున్న ప్రతిభావంతులు చాలా రంగాల్లో ఉన్నారు. అలాంటి వారికి నేను సిఫార్సు చేయడానికి సిద్ధమే. ఆహా మనకూ స్థానం దక్కిందని వాళ్లు సం తోషిస్తారు. ఇంతటి గొప్ప పురస్కారాన్ని అందిస్తున్న భారత దేశానికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.
 
దక్షిణ  చిత్ర పరిశ్రమపై మీ అభిప్రాయం ఏమిటి?
దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి ప్రయాణిస్తోంది. అది మన కళాకారుల గొప్పతనం. ఇలాంటి పురస్కారాలతో మన దేశ సంస్కృతికి విజయం దక్కిం దని భావిస్తున్నాను. దేశ గౌరవాన్ని ప్రపంచ వేదికపై నిలబెట్టింది.
 
  అనువాద చిత్రాల సమస్యలపై ఏమంటారు?
భిన్నత్వంలో ఏకత్వం అంటారు. దాన్ని పాటిం చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకరి సంస్కృతిని ఇతరులు గౌరవించాలి. మాతృ భాష అనేది ఆ మని షిని చాలా దగ్గరగా తీసుకెళుతుంది. వేరే భాషలో అంతగా తాత్పర్యం ఇవ్వడం సాధ్యం కాదు. అయి నా ప్రేక్షకులు పరిభాషా చిత్రాలను ఆదరిస్తున్నారు. అలాంటి చిత్రాలను నిషేధించడం సరైన పద్ధతి కాదు. ఎవరికి నచ్చిన చిత్రాన్ని వారు చూస్తారు. 
 
 విశ్వరూపం-2 ఏ దశలో ఉంది? విశ్వరూపం - 2 చిత్రం తొలి భాగం కంటే సాంకేతిక పరిజ్ఞానంతోపాటు అన్ని విధాలుగా బెటర్‌గా ఉంటుంది. చిత్ర ఆడియోను కూడా మరింత ప్రత్యేకంగా తీర్చి దిద్దుతున్నాం. విశ్వరూపం -2 కోసం మరికొంత షూటింగ్ చేయాల్సి ఉంది. లొకేషన్ అనుమతి కోసం వేచి చూస్తున్నాం. మరో మూడు నెలల్లో చిత్రం విడుదలవుతుంది.
 
 చివరిగా మీ కూతురు శృతి హాసన్ గురించి?
  శృతి సినీ, సంగీత రంగాల్లో గుర్తింపు పొందారు. ప్రస్తుతం నటిగా పలు భాషల్లో ప్రకాశిస్తున్నారు. ఆమె కూడా నాకు ఒక అవార్డులాంటిదే. ఆ విధంగా పుత్రికోత్సాహాన్ని అనుభవిస్తున్నాను.