గోవాలో చిక్కుకుపోయిన నటికి ప్రభుత్వ సాయం

3 Apr, 2020 10:46 IST|Sakshi

పనజి: లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్యాన్సర్‌ పేషెంట్‌, నటి నఫీసా అలీకి గోవా ప్రభుత్వం సాయం అందించింది. నఫీసాకు అవసరమైన మందులను అధికారులు ఆమెకు అందించనున్నారు. వివరాలు.. ఢిల్లీలో నివసించే నఫీసా అలీ కొన్ని రోజుల క్రితం తన కూతురిని చూసేందుకు గోవా వెళ్లారు. ఈ క్రమంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించారు. దీంతో బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా గోవాలో లాక్‌డౌన్‌ కఠినంగా అమలు చేస్తున్న తరుణంలో మందుల విషయంలో నఫీసా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ... ‘‘లాక్‌డౌన్‌ ప్రకటించిన తర్వాత గోవాలో తొలివారం చాలా కఠినంగా గడిచింది. అయితే ఇప్పుడు కూరగాయలు, నిత్యావసరాల షాపులు తెరుస్తున్నారు. అయితే పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. నీళ్లు లేవు. రేషన్‌ లేదు. బయటకు వెళ్తే పోలీసులు కొడుతున్నారు. నా మందులు అయిపోయాయి. క్యాన్సర్‌ నివారణకు వాడే మందులు ఇక్కడ లభించడం లేదు. ఢిల్లీలో లభిస్తాయి గానీ కొరియర్‌ సర్వీసు పనిచేయడం లేదు. నాకేం చేయాలో అర్థం కావడం లేదు’’అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం గోవా ప్రభుత్వ దృష్టికి రావడంతో ముఖ్యమంత్రి కార్యాలయం వెంటనే స్పందించింది. అధికారులు నఫీసాను కలిసి ఆమెకు సహాయం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సైతం వారు షేర్‌ చేశారు. ఇక దేశ వ్యాప్తంగా 2,069 కరోనా కేసులు నమోదు కాగా.. 53 మంది మృత్యువాత పడ్డారు.

కాగా బెంగాల్‌లో జన్మించిన నఫీసా ‍ప్రముఖ నటిగా గుర్తింపు పొందారు. పలు బాలీవుడ్‌ సినిమాల్లో నటించారు. నఫీసా తాతయ్య వాజిద్‌ అలీ ప్రముఖ రచయిత. ఇక ఆమె మేనత్త జైబ్‌-ఉన్నీసా- హమీదుల్లా స్త్రీవాదిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఒవేరియన్‌ క్యాన్సర్‌తో బాధ పడుతున్న నఫీసా చికిత్స తీసుకుంటున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు