దేవుడికి పబ్లిసిటీ దేనికి?

27 Apr, 2014 23:12 IST|Sakshi
దేవుడికి పబ్లిసిటీ దేనికి?

 శ్రీరామ్ వేగిరాజు... అమెరికాలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. సినిమాలంటే విపరీతమైన అభిమానం. అందుకే... యూఎస్‌లోని సియాటెట్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో దర్శకత్వంలో శిక్షణ తీసుకున్నారాయన. తొలి ప్రయత్నంగా ‘డిస్టంట్ బీట్స్’ అనే లఘు చిత్రాన్ని తీశారు. అనేక అవార్డులు, ప్రశంసలు లభించాయి. ఆ కాన్ఫిడెన్స్‌తోనే ఇప్పుడాయన ‘ఓరి దేవుడోయ్’ సినిమాను తెరకెక్కించారు. సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ హీరోగా నటించిన     ఈ ఫాంటసీ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీరామ్ హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు.
 
 దేవుడు పబ్లిసిటీ కోరితే!
 మనిషి పబ్లిసిటీని కోరుకోవడం సహజం. కానీ దేవుడు పబ్లిసిటీ కోరితే? అనే వెరైటీ పాయింటే మా ‘ఓరి దేవుడోయ్’. సమకాలీన పరిస్థితుల్లో క్షణం తీరిక లేని జీవితాన్ని గడుపుతున్న మనిషి తనను పట్టించుకోవడం లేదని దేవుడు ఆవేదన చెందుతాడు. తనకూ పబ్లిసిటీ అవసరమే అని భావించి ఓ సాఫ్ట్‌వేర్ సీఈఓని ఆశ్రయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది ఇందులో ఆసక్తికరమైన అంశం. సరదా సంఘటనల సమాహారంగా ఈ చిత్రం ఉంటుంది.
 
 ఇరవైకి పైగా పురాణ పాత్రలు
 ఇందులో రాజీవ్ సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈఓగా నటించారు. దేవుడికి ప్రచారం కల్పించే పాత్ర ఆయనది. ఆ పాత్రలో రాజీవ్ ఒదిగిపోయాడు. కథ రీత్యా ఇందులో ఇరవైకి పైగా పురాణ పాత్రలుంటాయి. ఆ పాత్రల్ని సుమన్, నరేశ్, కృష్ణభగవాన్... తదితర సీనియర్ నటులు పోషించారు. వినోదానికి పెద్ద పీట వేస్తూ రూపొందించిన ఈ ఫాంటసీ చిత్రం తప్పకుండా అన్ని వర్గాలనీ ఆకట్టుకుంటుంది. కోటి సంగీతం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. వినూత్నమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, భిన్నంగా ఈ పాటల్ని విడుదల చేశాం. ఈ వారంలోనే సెన్సార్ పూర్తి చేసి, త్వరలో సినిమాను విడుదల చేస్తాం.