మన తెరపై మహాశివుళ్లు

26 Feb, 2014 23:08 IST|Sakshi
మన తెరపై మహాశివుళ్లు
ఒకే ఒక్కసారి: అక్కినేని నాగేశ్వరరావు శివుడి పాత్ర చేసిన విషయం చాలా మందికి తెలియదు. ‘మూగ మనసులు’ సినిమాలో ఆయన ఈ గెటప్‌లో కనపడతారు. అది కూడా కొద్దిసేపే. ‘గౌరమ్మా.. నీ మొగుడెవరమ్మా..’ పాటలో ఆయన్ను శివుడిగా చూడొచ్చు. ‘పరమానందయ్య శిష్యుల కథ’లో శోభన్‌బాబు, ‘వినాయక విజయం’లో కృష్ణంరాజు భోళాశంకరునిగా కనిపిస్తారు. నందమూరి బాలకృష్ణ ‘సీతారామ కల్యాణం’లో శివుడిగా కాసేపు కనబడతారు.
 
 దేవుళ్ల పాత్రలు పోషించడం అంత సులభతరం కాదు. ఆహార్యం కుదరాలి. వాచికం ఉండాలి. హావభావాల్లో దైవత్వం కనబడాలి. ఇక శివుడి పాత్ర అయితే చెప్పనే అక్కర్లేదు. ఓ రకంగా కత్తి మీద సాము. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఇప్పటివరకూ వెండితెరపై రాణించిన  వెండికొండ శివుళ్లను ఓసారి గుర్తు చేసుకుందాం..!
 
 తెలుగు తెరపై తొలి శివుడెవరు?: తెలుగు సినిమా పుట్టింది 1932లో. సినిమా శివుడు మాత్రం 1935లో పుట్టాడు. ప్రముఖ నటి దాసరి కోటిరత్నం నిర్మించిన ‘సతీ అనసూయ’లో శివుడి పాత్ర ఉంది. అయితే ఆ పాత్ర ఎవరు చేశారో రికార్డులకెక్కలేదు.
 
 సదా... శివుడు:  అప్పట్లో శివ పాత్రలకు స్పెషలిస్ట్ ఎవరంటే సదాశివరావు. చిన్నా పెద్దా ఏ సినిమాలో అయినా శివుడు పాత్ర అంటే ఆయన్నే అడిగేవారు. ‘దక్ష యజ్ఞం’, ‘గుణసుందరి కథ’ తదితర చిత్రాల్లో శివుడిగా కనిపించింది ఆయనే. సదా శివరావు ఆహార్యం, అభియం అచ్చంగా శివుడే అనే భావన కలిగించడంతో ఆయన్ను ఎక్కువ ఆ పాత్రకు అడిగేవారు.
 
 భళా బాలయ్య: కేరక్టర్ నటుల్లో ఎక్కువసార్లు శివుడి పాత్ర పోషించిన ఘనత ఎం. బాలయ్యకే దక్కుతుంది. ‘పార్వతీ కళ్యాణం’ (1958)తో మొదలుపెట్టి ‘భక్త కన్నప్ప’, ‘మల్లమ్మ కథ’, ‘జగన్మాత’ తదితర చిత్రాల్లో ఆయన శివయ్యగా కనిపించారు. అలాగే కన్నడ సినిమా ‘శివభక్త’లో కూడా ఆయన ముక్కంటిగా కనిపించడం ఓ విశేషం. రూపం పరంగా చూసుకుంటే ఎన్టీఆర్ తర్వాత శివుడంటే బాలయ్యే అని అప్పట్లో ఓ బ్రాండ్. ‘భక్త కన్నప్ప’ క్లయిమాక్స్‌లో శివుడి విశ్వరూపం చూపించే సన్నివేశంలో బాలయ్య రూపం తెలుగువారి గుండెల్లో నిలిచిపోయింది.
 
 కొడుకు కోసం శివుడి పాత్ర చేసిన కాంతారావు: జానపద చిత్రాల్లో తనదైన శైలిలో విజృంభించిన కాంతారావు, శివుడి పాత్రను కూడా గొప్పగా పండించారు. ‘శ్రీ గౌరీ మహత్యం’ చిత్రంలో ఆయన తొలిసారిగా వెండితెరపై శివుడిగా దర్శనమిచ్చారు. కానీ, పాముని మెడలో వేసుకుని నటించడానికి విపరీతంగా భయపడ్డారట. ఆ పాము ఒకచోట ఉండక శరీరం మీద తిరుగుతుండటంతో మేకప్ చెరిగిపోయేదట. మళ్లీ మళ్లీ మేకప్ వేయించుకుని, భయాన్ని దిగమింగుకుని కాంతారావు ఆ పాత్ర పోషించారు. ఆ తర్వాత మరోసారి శివుడిగా నటించే అవకాశం ‘భక్త మార్కండేయ’ ద్వారా వచ్చిందాయనకు. ఈసారి కాంతారావు పెద్దగా భయం లేకుండానే ఈ పాత్రను చేశారు. శివుడిగా మూడోసారి ఆయన కనిపించిన చిత్రం ‘శ్రీ రామాంజనేయ యుద్ధం’. అయితే ఆయన ఈ సినిమా చేయడం వెనక ఓ కథ ఉంది. ఆ సమయంలో కాంతారావు కుమారుడికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో, వైద్యం చేయించడానికి డబ్బు అవసరమైంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆయన ‘శ్రీ రామాంజనేయ యుద్ధం’లో రాముడిగా నటించిన అమర్‌నాథ్‌ని సాయం చేయమని కోరితే ఆ చిత్రంలో శివుడు పాత్ర ఇప్పించారు. ఏ కొడుకుని కాపాడుకోవడం కోసం అయితే కాంతారావు ఆ సినిమా అంగీకరించారో, షూటింగ్‌లో పాల్గొని ఇంటికెళ్లేసరికి ఆ కొడుకు చనిపోవడం దురదృష్టకరం.
 
 శివుడంటే ఎన్టీఆరే!: వెండితెరపై రాముడన్నా, శ్రీకృష్ణుడన్నా ఎన్టీఆరే. పరమశివుడిగానూ ఆయనకు తిరుగు లేదు. అయితే, చిత్రంగా ఆయన ఈ పాత్రను చేసింది రెండే రెండు సినిమాల్లో. అయినా కూడా బలమైన ముద్రనే వేశారు. ‘దక్షయజ్ఞం’లో ఎన్టీఆర్ శివపాత్ర పోషణ నభూతో న భవిష్యతి. క్లయిమాక్స్‌లో ఆయన చేసిన ప్రళయ తాండవం... రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. ఆ తర్వాత ‘ఉమా చండీ గౌరీశంకరుల కథ’ చిత్రంలో శివుడిగా నటించారు. 
 
 ముక్కంటిగా మెగాస్టార్: ఎన్టీఆర్ తర్వాతి జనరేషన్‌లో శివుడి పాత్రను పూర్తి స్థాయిలో అభినయించే అదృష్టం దక్కింది చిరంజీవికే. ‘పార్వతీ పరమేశ్వరులు’ చిత్రంలో ఓ పాటలో శివుడి గెటప్‌లో కనిపించిన చిరంజీవి, ఆ తర్వాత ‘ఆపద్భాందవుడు’లో కూడా ఓ పాటలో కనిపించారు. ‘శ్రీ మంజునాథ’ చిత్రంలో టైటిల్ రోల్ చేశారు. ఈ చిత్రంలో ఆయన పాత్ర నిడివి ఎక్కువ. మంచి మాస్ ఇమేజ్ ఉన్న చిరంజీవి శివుడి పాత్రలో కూడా మెప్పించగలిగారు.
 
 శివుడిగా ప్రతినాయకులు: హీరోలే కాదు.. విలన్లుగా రాణించిన నటులు కూడా శివుడి పాత్రలో మెప్పించారు. ముఖ్యంగా నాగభూషణం అయితే ఈ విషయంలో ఎక్స్‌ట్రార్డినరీ అని చెప్పాలి. నాగుల చవితి, భూకైలాస్, చెంచులక్ష్మి సినిమాల్లో ఆయన శివుడిగా నటించారు. ‘భూకైలాస్’ క్లయిమాక్స్‌లో రావణాసురుడు శివలింగానికి తలను మోదుకుంటున్న సమయంలో నాగభూషణం ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ సూపర్బ్. నిజమైన పాముని మెడలో వేసుకుని నటించిన ఘనత ఆయన సొంతం. ఆ పాము ఒంటిపై పాకుతున్నా, ఆయన మొహంలో హావభావాలు చెడకుండా జీవించారు. అలాగే,  వేమూరి గగ్గయ్య ‘భక్త సిరియాళ’లోనూ, రావు గోపాలరావు ‘మా ఊళ్లో మహాశివుడు’లోనూ,  త్యాగరాజు  ‘బాలనాగమ్మ’లోనూ శివుడిగా కనపడతారు. రాజనాల, కైకాల సత్యనారాయణ, ప్రభాకర్‌రెడ్డి కూడా పరమేశ్వరుని పాత్ర పోషించారు. కేరక్టర్ నటుల్లో అమర్‌నాథ్ ( సతీ అనసూయ),  మాధవపెద్ది వెంకట్రామయ్య (సతీ తులసి),  రామశర్మ (సతీ తులసి), ఘంటసాల రాధాకృఫ్ణయ్య (పార్వతీ కళ్యాణం), రాయప్రోలు సుబ్రహ్మణ్యం (భక్త మార్కండేయ), వి. శివరాం (వీరాంజనేయులు),  సీహెచ్ నారాయణరావు (గంగా గౌరీ సంవాదం) ముక్కంటిలుగా కనిపించారు.
 
 ఇక కష్టమే!! ఇప్పుడసలు పౌరాణిక చిత్రాలే అరుదైపోయాయి. ఒకవేళ ఇలాంటివి వచ్చినా మన యువ కథానాయకులు శివ పాత్రలో కనబడటానికి ఎంతవరకూ ఆసక్తి చూపిస్తారో!? ఇక వెండితెర శివుళ్లుగా మన హీరోలను చూడలేమేమో!?
 - డి.జి. భవాని