గొల్లపూడికి కన్నీటి వీడ్కోలు

15 Dec, 2019 12:33 IST|Sakshi

చెన్నైలో అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు

సాక్షి, చెన్నై: ప్రఖ్యాత నటుడు, రచయిత, సాహితీవేత్త గొల్లపూడి మారుతీరావు భౌతికకాయానికి అంత్యక్రియలు ఆదివారం చెన్నైలో అశ్రునయనాల మధ్య ముగిశాయి. ఉదయం పలువురు సినీప్రముఖులు, బంధువులు గొల్లపూడి పార్థివదేహానికి నివాళులర్పించారు. గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, నిర్మాత దగ్గుబాటి సురేశ్, దక్షిణ భారత సినీ వాణిజ్య మండలి అధ్యక్షుడు కాట్రగడ్డ ప్రసాద్, సినీ ప్రముఖులు మారుతీరావు భౌతికకాయానికి నివాళులర్పించారు. ఉదయం 10 గంటలకు గొల్లపూడి భౌతికకాయానికి కుటుంబ సభ్యులు శాస్త్రీయంగా అంతిమ కార్యక్రమాలను నిర్వహించారు. 11.30 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమైంది. కుటుంబ సభ్యులతో పాటు, బంధువులు, అభిమానులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు చెన్నై టీ నగర్‌ కన్నమ్మపేటలోని శ్మశాన వాటికలో గొల్లపూడి మారుతీరావు అంత్యక్రియలు జరిగాయి. కుమారుడు రామకృష్ణ తలకొరివి పెట్టారు. 

గొల్లపూడి మారుతీరావు 1939 ఏప్రిల్ 14న విజయనగరంలో జన్మించారు. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఇంట్లో రామయ్య- వీధిలో క్రిష్ణయ్య సినిమాతో ఆయన నటుడిగా పరిచయం అయ్యారు. దాదాపు 250 సినిమాల్లో నటించారు. సినిమాల్లోకి రాకముందు నాటకాలు, నవలలు, కథలు రాసేవారు. డాక్టర్‌ చక్రవర్తి సినిమాతో రచయితగా సినిమాలోకానికి పరిచయం అయ్యారు. వినూత్న విలనిజానికి ఆయన పెట్టింది పేరు. రచయితగా, ప్రతినాయకుడిగా, సహాయనటుడిగా, హాస్యనటుడిగా ఇలా అన్ని కోణాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.

మరిన్ని వార్తలు