ఆదివారం గొల్లపూడి అంత్యక్రియలు

12 Dec, 2019 15:27 IST|Sakshi

సాక్షి, చెన్నై : ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం చెన్నైలో జరుగుతాయని ఆయన రెండో కుమారుడు రామకృష్ణ తెలిపారు. కాగా గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని లైఫ్‌లైన్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. అయితే కుటుంబ సభ్యులు, బంధువులు విదేశాల నుంచి వచ్చే వరకూ గొల్లపూడి భౌతికకాయాన్ని ఆస్పత్రిలోనే ఉంచనున్నారు. శనివారం మధ్యాహ్నం ఆస్పత్రి నుంచి భౌతికకాయాన్ని గొల్లపూడి నివాసానికి తరలించి ఆదివారం మధ్యాహ్నం వరకూ అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. మారుతీరావుకు ముగ్గురు మగ సంతానం సుబ్బారావు, రామకృష్ణ, శ్రీనివాస్.

అయితే  గొల్లపూడి చిన్నకుమారుడు శ్రీనివాస్‌ 1992లో ప్రేమ పుస్తకం అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తూ షూటింగ్‌ సమయంలో ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. కుమారుడి జ్ఞాపకంగా గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవార్డు నెలకొల్పి, ఉత్తమ నూతన సినిమా దర్శకునికి రూ. 1.5 లక్షలు నగదు బహుమతి అందిస్తున్నారు. కాగా  గొల్లపూడి మారుతీరావు రచయితగా, నటుడుగా, సంపాదకుడుగా, వ్యాఖ్యాతగా, విలేఖరిగా  తెలుగు సాహిత్యాభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. తెలుగు సినిమా రంగంలో మాటల రచయితగాను నటుడిగానూ సుపరిచితుడు. సినిమాల్లోకి రాకముందు నాటకాలు, కథలు, నవలలు రాశారు. రేడియో ప్రయోక్తగానూ, అసిస్టెంట్ స్టేషను డైరెక్టరుగా, ఆంధ్రప్రభ (దినపత్రిక) ఉప సంపాదకుడిగా పనిచేశారు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రంతో గొల్లపూడి చిత్రరంగ ప్రవేశం చేశారు. 

చదవండిసీనియర్‌ నటుడు గొల్లపూడి కన్నుమూత

కుమారుని మరణం కుంగదీసింది 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు