మాది గురుశిష్యుల సంబంధం

12 Dec, 2019 18:05 IST|Sakshi

గొల్లపూడి మృతిపై మెగాస్టార్ చిరంజీవి స్పందన

సాక్షి, హైదరాబాద్‌ : ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు మృతిపట్ల మెగాస్టార్‌ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనతో   తనకున్న అనుబంధాన్ని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. గొల్లపూడి మారుతిరావుతో తనకున్నది గురుశిష్య సంబంధమని ఆయన అన్నారు. 'ఆ మధ్య  తన కుమారుడు పేరున నిర్వహించే గొల్లపూడి శ్రీనివాస్ అవార్డ్ ఫంక్షన్‌కి నేను వెళ్ళడం జరిగింది. తర్వాత మళ్ళీ నేను  ఆయన్ని కలిసే అవకాశం దొరకలేదు. ఆరోగ్యంగా ఉండేవారు. ఇంతలో ఇలా అవుతుందని ఊహించలేదు. ఆయనకి నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. గురు శిష్యుల్లాంటి సంబంధం. నేను 1979లో ‘ఐలవ్‌యూ’ అనే సినిమా చేసినప్పుడు, ఆ సినిమా ప్రొడ్యూసర్ భావన్నారాయణగారు నాకు గొల్లపూడి మారుతిరావుగారిని పరిచయం చేశారు. 

అప్పటికే గొల్లపూడి మారుతిరావుగారు చాలా పెద్ద రచయిత, నాటక రచయిత, జర్నలిస్టుగా కూడా పనిచేశారు. సాహిత్య పరంగా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తి, విద్యాధికుడు. ఆయన దగ్గర డైలాగ్స్ నేర్చుకో అని నన్ను పంపించారు. ఆ రకంగా గొల్లపూడి మారుతిరావుగారు డైలాగులు ఎలా పలకాలో క్లాస్‌లు తీసుకున్నారు. ఈ విధంగా ఆయన నాకు గురువనే చెప్పగలను. ఆ సరదా పరిచయం మాకు స్నేహంగా మారింది. ఖాళీ ఉన్నప్పుడల్లా నేను టీ.నగర్‌లో వాళ్ళింటికి వెళ్తుండేవాడిని. ఆయన నాతో ఎన్నో సాహిత్య పరమైన విషయాలు చెప్పేవారు. తన గతం గురించి,  గొప్ప గొప్ప కవులు, రచయితల గురించి చెప్తుంటే చాలా ఆసక్తికరంగా వింటుండేవాడిని. 

చదవండి: సీనియర్‌ నటుడు గొల్లపూడి కన్నుమూత

నాకు కూడా సాహిత్యం పట్ల, గొప్ప రచయితల గురించి తెలుసుకునే అవకాశం ఆయన ద్వారానే కలిగింది. 1982లో కోడి రామకృష్ణగారు నాతో ‘ఇంట్లో రామయ్య వీధిలో క‌ృష్ణయ్య’ సినిమా తీయాలనుకున్నప్పుడు ఆ కథలో ఈ పాత్రని గొల్లపూడి మారుతిరావుగారు వేస్తే బాగుంటుందని అనగానే నాకు కూడా అది మంచి చాయిస్ అనిపించింది. ఒకరకమైన శాడిజం భర్త, కామెడీగా ఉండే క్యారెక్టర్. ఆయన ఆ పాత్రలో ఒదిగిపోయి అద్బుతంగా నటించి అందరి మన్ననలు పొందారు. ఆ విధంగా నా సహ నటుడుగా ఆయన చేయడం అనేది మంచి అనుభూతి నాకు. 

ఆ తర్వాత నుంచి ‘ఆలయ శిఖరం‘ , ‘అభిలాష’, ’ఛాలెంజ్‘ లాంటి వరుసగా ఎన్నో సినిమాలు ఇద్దరం కలిసి నటించారు. మేం ఎప్పుడు కలుసుకున్నా గతాన్ని గుర్తు చేసుకుంటూ చాల ా ఆప్యాయంగా మాట్లాడేవారు. అలాంటి గొప్ప బహుముఖ ప్రజ్ఞాశాలి, సాహిత్యవేత్త, గొప్ప నటుడు, నాటక రచయిత అయిన గొల్లపూడి మారుతిరావుగారు దూరమవ్వడం అన్నది చాలా బాధాకరం. వారి కుటుంబానికే కాదు, యావత్తు సినీ ప్రపంచానికే తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను' అని చిరంజీవి అన్నారు.

మరిన్ని వార్తలు