మంచినటుడిగా గుర్తిస్తే చాలు : సుశాంత్ సింగ్ రాజ్‌పుత్

4 Sep, 2013 00:28 IST|Sakshi
మంచినటుడిగా గుర్తిస్తే చాలు : సుశాంత్ సింగ్ రాజ్‌పుత్
ముంబై: ‘నేను పెద్ద స్టార్‌గా వెలిగిపోదామని ఇక్కడికి రాలేదు.. నన్ను సినిమా పరిశ్రమ మంచి నటుడిగా గుర్తిస్తే చాలు..’ అని అంటున్నాడు ఈ 27 ఏళ్ల నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమైన ‘కాయ్ పో చే’ సినిమాతో సుశాంత్ చిత్రరంగ ప్రవేశం చేశాడు.  అతడు ప్రసిద్ధ టీవీ షో ‘పవిత్ర రిష్తా’లోని మానవ్ పాత్రతో బుల్లితెర వీక్షకులందరికీ చిరపరిచితుడే. అయితే అభిషేక్ కపూర్ చిత్రమైన కాయ్ పో చే అతడికి చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపునిచ్చింది. 
 
 ఈ సందర్భంగా సుశాంత్ మాట్లాడుతూ ‘నేను ప్రయత్నపూర్వకంగా సినిమా పరిశ్రమలోకి రాలేదు.. అలాగే డబ్బు కోసమో.. పేరు కోసమో కూడా ఇందులోకి రాలేదు.. పరిశ్రమలోకి నా ఆగమనం యాధృచ్ఛికంగా జరిగిపోయింది. పెద్ద స్టార్‌ను అయిపోదామని ఆశపడటంలేదు.. పెద్ద నటుడిగా మాత్రం పేరు సంపాదించుకోవాలనుకుంటున్నాను..’ అని అన్నాడు.  ప్రస్తుతం ఇతడు ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’, ‘పీకే’,‘డిటెక్టివ్ బొంకేష్ బక్సే’, అభిషేక్ కపూర్ నిర్మిస్తున్న మరో సినిమాలో నటిస్తున్నాడు. 
 
 గొప్ప ప్రతిభ ఉన్న దర్శకుల సినిమాల్లో నటించడం తన అదృష్టమని సుశాంత్ చెప్పాడు. ‘ఈ పరిశ్రమలోకి వచ్చిన తర్వాత నేను ప్రతిరోజూ ఎంతో కొంత నేర్చుకుంటున్నాను.. ఒక వేళ నాకు సరైన సినిమా అవకాశాలు రాకపోతే టీవీల్లోనూ, థియేటర్లలోనూ ఏదో ఒకటి చేసుకుంటూ ఈ రోజు ఎలా ఉన్నానో అలాగే అప్పుడు కూడా ఆనందంగా బతికేయగలను..’ అని స్పష్టం చేశాడు. 
 
 నిర్మాతలు తనను నమ్మి ఇచ్చిన పాత్రలకు సాధ్యమైనంత న్యాయం చేయడమే తన బాధ్యతగా ఆయన చెప్పాడు. ‘ఒక చిత్రంలో ఒక పాత్రకు నన్ను తీసుకున్న వారు నా నుంచి చాలా ఆశించవచ్చు..దాని కోసం నేను చాలా సమయాన్ని కేటాయించడానికి కూడా వెనుకాడను.. ఆ పాత్ర నేను చేయగలను అని ఒక నమ్మకం కలిగిన తర్వాతే ముందడుగు వేస్తాను..’ అని ముక్తాయించాడు.
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా