సల్మాన్‌ ఓడించి.. పెద్ద సూపర్‌స్టార్‌ అయ్యాడు!

2 Jan, 2020 11:38 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ ఖిలాడీ అక్షయ్‌ కుమార్‌ తాజా సినిమా ‘గుడ్‌న్యూస్‌’  భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఆరు రోజుల్లోనే వందకోట్ల క్లబ్బులో ఈ సినిమా చేరింది. కొత్త సంవత్సరం సందర్భంగా బుధవారం ఈ సినిమా ఏకంగా రూ. 22.50 కోట్లు సాధించింది. దీంతో  ఆరురోజుల్లోనే  రూ. 117.10 కోట్లు సాధించి ‘గుడ్‌న్యూస్‌’ సూపర్‌హిట్‌గా నిలిచింది. సినిమాకు మంచి టాక్‌ ఉండటం, విమర్శల ప్రశంసలు లభిస్తుండటం.. ప్రేక్షకులు పెద్దసంఖ్యలో థియేటర్లకు వస్తుండటంతో మున్ముందు కూడా ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టే అవకాశం కనిపిస్తోంది.

ఇక, గుడ్‌న్యూస్‌ సినిమా వందకోట్ల క్లబ్బులో చేరి బాక్సాఫీస్‌ వద్ద స్ట్రాంగ్‌గా ఉండటంతో నటుడు, సినీ విమర్శకుడు కమాల్‌ ఆర్‌ ఖాన్‌ (కేఆర్కే) ఆసక్తికరమైన ట్వీట్‌ చేశారు. ‘గుడ్‌న్యూస్‌ సూపర్‌ హిట్‌ అయింది. దబంగ్‌3 సూపర్‌ప్లాప్‌ అఅయింది. అంటే అక్షయ్‌కుమార్‌ అధికారికంగా సల్మాన్‌ ఖాన్‌ను ఓడించి.. అతని కంటే పెద్ద సూపర్‌స్టార్‌గా అవతరించినట్టే. ఇది అక్షయ్‌ జీవితకాల కోరిక. అది నెరవేరింది. ఇక రానున్న ఈద్‌ 2020కి నేరుగా బాక్సాఫీస్‌ వద్ద తలపడి సల్మాన్‌ను అక్షయ్‌ ఓడించబోతున్నాడు’ అని కేఆర్కే ట్వీట్‌ చేశాడు.

గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా కళ్లుచెదిరేరీతిలో వసూళ్లు రాబడుతున్న సంగతి తెలిసిందే. ఒకవైపు పౌరసత్వ వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్నప్పటికీ.. ఆ ప్రభావం అంతగా ‘గుడ్‌న్యూస్‌’పై లేదని బాక్సాఫీస్‌ లెక్కలు చాటుతున్నాయి. వీక్‌ డేస్‌లోనూ నిలకడగా వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమా గత శుక్రవారం రూ. 17.56 కోట్లు, శనివారం రూ. 21.78 కోట్లు, ఆదివారం రూ. 25.65 కోట్లు, సోమవారం రూ. 13,41 కోట్లు, మంగళవారం రూ. 16.20 కోట్లు, బుధవారం రూ. 22.50 కోట్లు మొత్తంగా రూ. 117.10 కోట్లను  కలెక్ట్‌ చేసిందని బాలీవుడ్‌ ట్రెడ్‌ అనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు.

అక్షయ్‌-కరీనా కపూర్‌, దిల్జిత్‌ దోసాన్జ్‌-కియారా అద్వానీ జోడీలుగా నటించిన ఈ సినిమాలో కృత్రిమ గర్బధారణ సమయంలో జరిగిన ఓ తప్పిదం వల్ల రెండు జంటలకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయన్నదే కథ. ఇదొక సున్నిత అంశమైనప్పటికీ దర్శకుడు రాజ్‌ మెహతా దాన్ని ఎక్కడా అపహాస్యం చేయకుండా జాగ్రత్తపడుతూ ప్రేక్షకులకు చక్కని వినోదాన్ని పంచాడు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర కలెక్షన్లు కురిపిస్తోంది. ఈ చిత్రం స్టార్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ ‘దబాంగ్‌ 3’ను పక్కకునెట్టి మరీ భారీ వసూళ్లు రాబట్టడం.. ట్రెడ్‌ విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది.

మరిన్ని వార్తలు