మాఫియా టీజర్‌కు సూపర్బ్‌ రెస్పాన్స్‌

22 Sep, 2019 10:13 IST|Sakshi

మాఫియా చిత్ర టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని చిత్ర వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేశాయి. అరుణ్‌విజయ్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మాఫియా. నటి ప్రియభవానీశంకర్‌ నాయకిగా నటిస్తున్న ఈ సినిమాలో నటుడు ప్రసన్న ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. యువ దర్శకుడు కార్తీక్‌నరేన్‌ తెరెక్కిస్తున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్ర పస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేశారు. అందులో నటుడు అరుణ్‌విజయ్‌ స్టైలిష్‌ గెటప్‌ అందరినీ ఆకర్షించింది.

మాఫియా అనగానే యాక్షన్‌ సన్నివేశాలతో కూడిన మాస్‌ ఎంటర్‌టెయినర్‌ చిత్రంగా ఉంటుందని తెలుస్తోంది. నటుడు అరుణ్‌విజయ్‌ కెరీర్‌లో ఈ చిత్రం స్పెషల్‌గా నిలిచిపోతుందని ఆయన ఇటీవల పేర్కొన్నారు.  చిత్రంలో తన పాత్ర కూడా చాలా వైవిధ్యంగా ఉంటుందన్నారు. తాజాగా చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. అది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతోంది. టీజర్‌లో నటుడు అరుణ్‌విజయ్‌ను  సింహంగానూ, ప్రసన్నను నక్క గానూ చూపించి కథను మాత్రం రివీల్‌ చేయకుండా జాగ్రత్త పడుతూ వారి పాత్రల స్వభావాన్ని ఆవిష్కరించి ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని కలిగించారు.

ఈ టీజర్‌ను  ఇప్పటికే 2.9 మిలియన్ల ప్రేక్షకులు యూట్యూబ్‌లో తిలకించారు. ఇది అరుణ్‌విజయ్‌ చిత్రాలలోనే పెద్ద రికార్డు అంటున్నారు. కాగా  దర్శకుడు కార్తీక్‌నరేన్‌ మాఫియా చిత్రాన్ని హై టెక్నికల్‌ వ్యాల్యూస్‌తో తెరకెక్కిస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ మాఫియా చిత్ర షూటింగ్‌ పూర్తి అయిందని, ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. కాగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం, చిత్ర విడుదల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని యూనిట్‌ వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకు జాక్స్‌ బిజాయ్‌ సంగీతాన్ని, గోకుల్‌ బెనాయ్‌ ఛాయాగ్రహణంను అందిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా