ఇన్ని సమస్యలుంటాయా అనిపిస్తోంది : నాగార్జున

22 Jun, 2014 23:30 IST|Sakshi
ఇన్ని సమస్యలుంటాయా అనిపిస్తోంది : నాగార్జున

స్టార్ హోదా నుంచి టీవీ షోలలో స్టార్ లాంటి ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ తెలుగు వెర్షన్ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’కు హోస్ట్‌గా కొత్త వేషంలోకి హీరో నాగార్జున సులభంగానే పరకాయ ప్రవేశం చేశారు. ఈ నెల ప్రథమార్ధం నుంచి ‘మా’ టి.వి.లో ప్రసారమవుతున్న ఈ గేమ్ షో తొలివారంలో మంచి టి.ఆర్.పి.లు సాధించింది. సామాన్యులు సైతం సంపన్నులయ్యేందుకు అవకాశమిచ్చే ఈ షో గురించి నాగ్ తో జరిపిన సంభాషణ.  
 
 బుల్లితెరపై మీ తొలి షో ఇది. ఎలా ఉంది మీ అనుభవం?

 సినిమా ప్రపంచానికి పూర్తి భిన్నమైన వాతావరణాన్ని ఈ షో నాకు పరిచయం చేసింది. నన్ను నేను బెటర్ చేసుకోవడానికి ఈ షో ఉపకరించింది. స్టార్‌డమ్‌కి అతీతమైనది ఇది. ‘అన్నమయ్య’, ‘మనం’ చిత్రాల ఘనవిజయం ఎంత ఆత్మసంతృప్తినిచ్చిందో, ఈ ‘షో’ విజయం కూడా అంతే ఆత్మసంతృప్తినిచ్చింది.
 
 ఈ షో ద్వారా సామాన్య ప్రజల సమస్యలు తెలుసుకోవడం ఎలా ఉంది?
 వాళ్ల సొంత మనిషిలా మారిపోయి, సమస్యలను వింటున్నాను. వాళ్ల సమస్యలను నా సమస్యలతో పోల్చుకుంటున్నాను కూడా. ఒక సినిమా పరాజయం పాలైతే తెగ బాధపడిపోతుంటాం. కొంతమందైతే నెలల తరబడి బయటకు రారు. రేపెలా గడుస్తుందోనని ఈ రోజు రాత్రి కంటి మీద కునుకు లేకుండా గడిపేవారి సమస్యల ముందు సినిమా ఫ్లాప్ అనేది చిన్న సమస్య అనిపిస్తోంది.
 
 పోటీలో పాలుపంచుకునేవారి సమస్యలు విన్న తర్వాత ‘వీళ్లు అన్ని ప్రశ్నలకూ సమాధానం చెబితే బాగుంటుంది’ అనిపిస్తోందా?
 కొంతమంది జీవితం మొత్తం సమస్యలే. వాళ్లు ఎక్కువ డబ్బు గెల్చుకుంటే బాగుండు అనిపిస్తుంది. ముఖ్యంగా క్లిష్టమైన ప్రశ్నలు అడిగినప్పుడు, ‘సమాధానం తెలిస్తే బాగుంటుంది’ అనే టెన్షన్ నాకు మొదలవుతుంది. ఇన్నేళ్లూ కష్టాలు పడ్డారు కదా.. కనీసం ఇక్కడైనా వాళ్ల కల నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగని, ప్రశ్నలు ముందే లీక్ చేయలేను.. సమాధానాలు కూడా బయటపెట్టలేను. ఒక్కోసారైతే నాకు తెలియకుండా క్లూ ఇచ్చేస్తానేమో అనిపిస్తోంది. కానీ, అది చేయకుండా జాగ్రత్తపడతాను. రకరకాల వయసుల వాళ్ళను కలుసుకోవడం, వారి కష్టనష్టాలు వినడం వల్ల అందరి మనస్తత్వాలూ తెలుసుకునే వీలు కలుగుతోంది. సుబ్బలక్ష్మి గారనే పెద్ద వయసు ఆవిడైతే చాలా బాగా ఆడారు. చక్కగా జోక్‌లేసుకుంటూ సరదాగా సాగిందా ఎపిసోడ్. అందరితోనూ కనెక్ట్ కాగలుతున్నాను.
 
 ఈ షోలో పాల్గొన్న హెచ్‌ఐవీ పేషెంట్ భవాని జీవితం విన్నప్పుడు మీరు ఫీలైన వైనం స్పష్టంగా బుల్లితెర మీద కనిపించింది?
 భవానీ లైఫ్ విన్నప్పుడు నిజంగానే బాధ అనిపించింది. కానీ, తన ధైర్యం, ఆత్మవిశ్వాసం మాత్రం మెచ్చుకోదగ్గవి. తను 80వేల రూపాయలు గెల్చుకోవాలనే లక్ష్యంతో వచ్చింది. 40వేలు గెల్చుకుంది. కానీ, ఇక్కణ్ణుంచి ఊరు తిరిగి వెళ్లేసరికి తన ఇంటి చుట్టుపక్కలవాళ్లు, ఇంతకొంతమంది స్వచ్ఛందంగా ‘మీ అబ్బాయిలకు ఫీజు కట్టు’ అని డబ్బులిచ్చారట. ఆ డబ్బంతా కలిపితే 20వేలయ్యాయని, భవాని ఫోన్ చేసి చెబితే, చాలా ఆనందం అనిపించింది.
 
 ఈ షో చేయడం మొదలుపెట్టిన తర్వాత మనలో తెలియకుండా మార్పొస్తుందని అమితాబ్ మీతో అన్నారు కదా.. మరి, ఇప్పటివరకు చిత్రీకరించిన ఎపిసోడ్స్ ద్వారా మీలో ఏమైనా మార్పును గ్రహించారా?

 వెంటనే పూర్తిగా మార్పు రావడం జరగదు కానీ, పాల్గొంటున్నవారి మాటలు విన్నాక నా ఆలోచనా విధానంలో కొంత మార్పు వచ్చింది. ఎదుటి వ్యక్తుల పరిస్థితిని అర్థం చేసుకునే నేర్పు, అందరి సమస్యలూ వినే ఓర్పు వచ్చింది. ఎంతసేపూ మన సమస్యల గురించి మాత్రమే ఆలోచిస్తాం. కానీ, ఈ షో ద్వారా ఇతరుల సమస్యలను తెలుసుకోవడం, ఆలోచించడం మొదలైంది. ‘ఇలా కూడా బతికేస్తున్నారా.. ఇన్ని సమస్యలుంటాయా’ అనిపిస్తోంది.
 
 పేదరికం అనుభవిస్తున్నవారి జీవితాల గురించి విన్న తరువాత అవి మిమ్మల్ని ఇంటివరకూ వెంటాడుతున్నాయా?
 నేను ఇంటికెళ్లేసరికి మా పిల్లలిద్దరూ ఇంట్లో ఉంటే, ‘ఎలా జరిగింది’ అని అడిగి తెలుసుకుంటారు. అమల ఒక్కతే ఉంటే, ఒకవేళ నేను డల్‌గా కనిపిస్తే, ‘ఇవాళ చాలా సమస్యలు విని ఉంటాను’ అని ఫిక్స్ అయిపోతుంది. తను అడిగి తెలుసుకుంటుంది. ఈ షో చేయడం ద్వారా నా కుటుంబంలోనే ఓ మార్పు కనిపిస్తోంది. నాగచైతన్యని, అఖిల్‌ని కూర్చోబెట్టి, ‘వాళ్ల నాన్న జీతం నాలుగు వేలట.. ఆ అబ్బాయి చాలా కష్టపడి చదువుకుంటున్నాడట’ అని చెబుతుంటాను. అదే నేను కావాలని వాళ్లకి ఏవేవో నీతులు చెబితే, ‘లెక్చర్ ఇస్తున్నాడు’ అనుకుంటారు. కానీ, స్వయంగా నేను విన్నవి చెప్పడంతో, వాళ్లు కూడా ‘ఇంతే సంపాదిస్తారా డాడీ... లైఫ్ ఇలా ఉంటుందా’ అంటున్నారు. సో.. ఈ షో మా కుటుంబానికి కూడా ఓ ఆదర్శమే. తల్లిదండ్రులు చెబితే పిల్లలు పెద్దగా వినరు. అదే, ఇలాంటి షోస్ చూస్తే, కొంతైనా స్ఫూర్తి పొందుతారు.
 
 మీరే కనుక ఈ పోటీలో పాల్గొంటే.. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పగలిగేవారా?
 లేదు. చాలా ప్రశ్నలకు నాకు జవాబు తెలియదు. అది అవగాహన లేక. ఉదయం నిద్ర లేచి పేపర్ చదవడం, ఖాళీ దొరికితే టీవీలు చూడటం.. అంతవరకే. బయటి ప్రపంచానికి చాలా దూరంగా ఉండటంవల్లే చాలా ప్రశ్నలకు సమాధానాలు తెలియడం లేదు. ఈ షో చేయడం ద్వారా మన భారతీయ చరిత్ర గురించి చాలా విషయాలు తెలుస్తున్నాయి. ఎప్పుడో చిన్నప్పుడు హిస్టరీలో చదువుకున్నవి మర్చిపోతాం. అవన్నీ రీ కలక్ట్ చేసుకున్నట్లుగా ఉంది.
 
 ఫస్ట్ సీజన్ తర్వాత రెండోది కూడా కంటిన్యూ చేయాలనే ఆసక్తి ఉందా?
 ఇప్పటికైతే ఆ ఆసక్తి ఉంది. ఈ షో చేసే అవకాశం నాకు కాకుండా, మరో హీరోకు వచ్చి ఉంటే, కచ్చితంగా బాధపడేవాణ్ణి. ఈ ఫస్ట్ సీజన్ 45 ఎపిసోడ్స్‌తో ముగుస్తుంది. ఆ తర్వాత కచ్చితంగా ఏదో మిస్సయిన ఫీలింగ్ కలగక మానదు.