అందుకే మంచి ఫలితం వచ్చింది!

22 Apr, 2015 22:51 IST|Sakshi
అందుకే మంచి ఫలితం వచ్చింది!

 ‘‘తెల్లాపూర్ గ్రామంలో మా స్నేహితుడి అన్నయ్య కొడుకు విచిత్రంగా ప్రవర్తించేవాడు. ఆ పాయింట్‌ని తీసుకుని, ఈ చిత్రం చేశాను. కథ వినగానే నిర్మాతలు సారికా శ్రీనివాస్, భాస్కర్ మరో ఆలోచనకు తావు ఇవ్వకుండా నిర్మించడానికి అంగీకరించారు. నటీనటులు అందరూ కూడా ఈ కథతో బాగా కనెక్ట్ అయ్యారు కాబట్టే, మంచి అవుట్‌పుట్ వచ్చింది. అందుకే మంచి ఫలితం కూడా వచ్చింది’’ అని దర్శకుడు చల్లా మన్‌మోహన్ అన్నారు.

మంచు లక్ష్మీ, శ్రీధర్, ఇంద్రజ, మాస్టర్ ప్రేమ్‌బాబు, డాలీ ముఖ్య తారలుగా సుధీర్ సమర్పణలో భాస్కర్, సారికా శ్రీనివాస్ నిర్మించిన ‘బుడుగు’ ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో మన్‌మోహన్ పత్రికలవారితో మాట్లాడుతూ -‘‘మొదటి మూడురోజుల్లోనే సినిమా ఎత్తేస్తున్న ఈ రోజుల్లో మా సినిమా ఐదో రోజుకి కూడా 37 థియేటర్లు పెంచాం. మొత్తం 130 థియేటర్లలో మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమా హిందీ హక్కులను సన్నీ ఎంట ర్‌టైన్‌మెంట్స్ పొందింది’’ అని చెప్పారు.