ఏ మలుపు ఎప్పుడొస్తుందో చెప్పలేం

5 Oct, 2019 01:27 IST|Sakshi
గోపీచంద్‌

‘‘చాణక్య’ సినిమా చాలా బాగా వచ్చింది. తొలిసారి గూఢచారి పాత్ర చేశా. ఈ సినిమాలో వినోదం, భావోద్వేగాలు, యాక్షన్‌.. అన్నీ సమపాళ్లలో ఉంటాయి. తప్పకుండా ప్రేక్షకుల అంచనాలను చేరుకుంటాం’’ అన్నారు గోపీచంద్‌. తిరు దర్శకత్వంలో గోపీచంద్, మెహరీన్‌ జంటగా నటించిన చిత్రం ‘చాణక్య’. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర  నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గోపీచంద్‌ చెప్పిన విశేషాలు.

► తిరు చెప్పిన ‘చాణక్య’ స్టోరీ చాలా ఆసక్తిగా అనిపించింది. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకూ ప్రేక్షకులకు తర్వాత ఏం జరుగుతుందనే ఎగై్జట్‌మెంట్‌తో పాటు టెన్షన్‌ ఉంటుంది. ఇందులో ఎంటర్‌టైనింగ్‌ లవ్‌ ట్రాక్‌ కూడా ఉంటుంది. మాస్, క్లాస్‌.. ఏ జోనర్‌ అయినా యాక్షన్‌ కామనే. ఇందులో మంచి యాక్షన్‌ ఉంది. మంచి సినిమా తీశామని యూనిట్‌ అంతా సంతోషంగా ఉన్నాం.

► ఈ సినిమాలో నా లుక్‌ చాలా కొత్తగా ఉంటుంది. కెమెరామేన్‌ వెట్రి పళనిస్వామి నన్ను చాలా అందంగా చూపించారు. మంచి విజువల్స్‌ ఇచ్చారు. ‘గౌతమ్‌ నంద’లో గెడ్డంతో కనిపించినా, ‘చాణక్య’లో మాత్రం వేరే స్టైల్‌ గెడ్డంతో ఉంటా. సరదాగా నేను గెడ్డం పెంచాను. ఈ లుక్‌ చాలా బాగుందని తిరు చెప్పడంతో అదే కంటిన్యూ చేశాను. స్పై ఏజెంట్స్‌ జీవితం ఎలా ఉంటుంది? అనే నేపథ్యంలో కథ ఉంటుంది. గతంలో వచ్చిన గూఢచారి సినిమాలకు భిన్నంగా ఉంటుంది. ఇందులో నా పాత్ర పేరు అర్జున్‌. రెండు షేడ్స్‌ ఉంటాయి.

► మాకు బాగా దగ్గరైన వారికి ‘చాణక్య’ ప్రివ్యూ వేశాం. వారంతా సినిమా చాలా బాగుందన్నారు. సినిమా చూశాక ప్రేక్షకుల నుంచి కూడా ఇదే మాట వస్తుందనే నమ్మకం ఉంది. విదేశాల్లో ఉండటం వల్ల ఈ సినిమాని నా ఫ్రెండ్‌ ప్రభాస్‌ చూడలేదు. నా నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే అంశాలన్నీ ఈ సినిమాలో ఉంటాయి.

► ‘చాణక్య’ సినిమాని మేలో విడుదల చేయాలనుకున్నాం. అయితే చివరి రోజు షూటింగ్‌లో బైక్‌ స్కిట్‌ అవడంతో నాకు బాగా గాయాలయ్యాయి. దాంతో షూటింగ్‌ ఆగిపోయి, విడుదలకు మూడు నెలలు ఆలస్యం అయింది. ‘సైరా’ ప్యాన్‌ ఇండియన్‌ సినిమానే. అయితే దసరా పండగ సమయం కావడంతో రెండు మూడు సినిమాలు ఆడేందుకు అవకాశం ఉంటుంది. అందుకే మా చిత్రం కూడా విడుదల చేస్తున్నాం.

► నాకు కొంచెం సిగ్గెక్కువ. అందుకే సెట్స్‌లో త్వరగా ఎవరితోనూ మాట్లాడను. అది హీరోయిన్‌ అయినా? ఎవరైనా సరే. మన కెరీర్‌లో ఏ సినిమా ఏ మలుపు తిప్పుతుందో ఎవరికీ తెలియదు. మా వరకూ కష్టపడి మంచి సినిమా చేస్తాం. విజయాన్ని నిర్ణయించేది ప్రేక్షకులే. అయితే నా కెరీర్‌కి ‘చాణక్య’ సినిమా ప్లస్‌ అవుతుందని మాత్రం కచ్చితంగా చెప్పగలను. అందులో ఎటువంటి అనుమానం లేదు.

► మా సినిమాకి నేపథ్య సంగీతం వెన్నెముకలాంటిది. చక్కగా కుదిరింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్స్‌లోని డైలాగులకు మంచి  స్పందన వస్తోంది. సినిమాలోనూ చాలా మంచి డైలాగులున్నాయి.  నా కెరీర్‌లో చాలా మంది తమిళ డైరెక్టర్స్‌తో సినిమాలు చేశా. నాకు కథ ముఖ్యం.. భాష కాదు. డైరెక్టర్‌ తిరు మంచి ప్రతిభావంతుడు. తెలుగు నుంచి వెళ్లి తమిళ్‌లో సెటిల్‌ అయ్యాడు. తనతో పని చేయడం సౌకర్యంగానే అనిపించింది. అనిల్‌ సుంకరగారు ప్యాషనేట్‌ నిర్మాత. ప్రేక్షకులకు ఇంకా బాగా ఏం ఇవ్వగలం? అని ప్రతిరోజూ ఆలోచిస్తుంటారాయన. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి అవసరం.

► మీరు ప్యాన్‌ ఇండియన్‌ సినిమా ఎప్పుడు చేస్తున్నారు? అనే ప్రశ్నకు గోపీచంద్‌ బదులిస్తూ.. ‘తెలుగులో ప్యాన్‌ ఇండియన్‌ సినిమాలకు ఈ మధ్యే గేట్లు తెరుచుకున్నాయి. నిజంగా ఇది చాలా సంతోషం. సమయం వచ్చినప్పుడు చేద్దాం (నవ్వుతూ)’ అన్నారు. ప్రస్తుతం బిను సుబ్ర మణ్యం దర్శకత్వంలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌గారి బ్యానర్‌లో ఓ సినిమా చేస్తున్నా. అది పూర్తయ్యాకే సంపత్‌ నంది సినిమా మొదలవుతుంది. ఈ రెండూ మంచి కథలే.

మరిన్ని వార్తలు