నటనపై గౌరవం పెరిగింది

14 Mar, 2019 03:22 IST|Sakshi
గోరటి వెంకన్న

‘‘నటనలో నాకు పెద్దగా అనుభవం లేదు. ‘బతుకమ్మ’ సినిమా అప్పుడు ఇటీవల మరణించిన దీక్షితులుగారు మూడు రోజులు శిక్షణ ఇచ్చారు. అలాగే నాటకరంగంలో ఉన్న ప్రవేశం కూడా సహాయపడింది. ‘బిలాల్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌’ చిత్రంలో ఫుల్‌లెంగ్త్‌ పాత్ర చేసిన తర్వాత నటనపై చాలా గౌరవం పెరిగింది’’ అన్నారు రచయిత, గాయకులు గోరటి వెంకన్న. మాగంటి శ్రీనాథ్‌ హీరోగా మాకం నాగసాయి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బిలాల్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌’. మహంకాళీ శ్రీనివాస్‌ నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదలకానుంది.

ఈ సందర్భంగా గోరటి వెంకన్న మాట్లాడుతూ– ‘‘నిర్మాత శ్రీనివాస్, సాయి బాగా తెలుసు. అందుకే సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. ఈ చిత్రంలో హీరోయిన్‌ తండ్రి, హెడ్‌ కానిస్టేబుల్‌ సురేందర్‌ పాత్రలో నటించాను. అరుణయ్య అనే మిత్రుడు కానిస్టేబుల్‌ నుంచి ఎస్సై స్థాయికి చేరుకున్నారు. నాకు  ఆయనే గుర్తుకొచ్చారు. ఆ పాత్రనే  వేశాను అనిపించింది. టీమ్‌ అందరూ   ప్రోత్సహించారు. ఓ సీన్‌లో భాగంగా నన్ను ఏడవమన్నారు. గ్లిజరిన్‌ లేకుండా పదిసార్లు ఏడ్చాను.

ఆ సీన్‌ బాగా పండింది. దృశ్య మాద్యమం చాలా శక్తివంతమైనది. ఎవరైనా పాత్రలు చేయమని ప్రేమతో అడిగితే చేస్తాను. పాత్రల కోసం పని కట్టుకుని పోను. ప్రేమ గీతాలు రాశాను. మనసు చంపుకుని ఓ స్పెషల్‌ సాంగ్‌ కూడా రాశాను. ‘దొరసాని’, ‘సంత’, ‘మల్లేశం’,   ‘నేనే..సరోజ’, ‘మార్కెట్‌లో ప్రజాస్వామ్యం’ చిత్రాలకు పాటలు రాశాను. కొన్ని పెద్ద సినిమాల్లో పాత్రలు చేసే అవకాశాలు వచ్చాయి. వద్దనుకున్నాను’’ అని చెప్పుకొచ్చారు.

>
మరిన్ని వార్తలు