ప్రభుత్వాన్నే మోసం చేస్తున్నారు

23 Mar, 2017 00:19 IST|Sakshi
ప్రభుత్వాన్నే మోసం చేస్తున్నారు

‘‘తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (టి.ఎఫ్‌.సి.సి.) ఏర్పాటు చేసి నాలుగేళ్లవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు ఉంది. తెలుగు ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో మేమూ ఉన్నాం. అయితే తెలుగు ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్, తెలంగాణ స్టేట్‌ ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సంస్థలకు మాత్రమే ప్రభుత్వ గుర్తింపు ఉందని చెప్పడం తగదు’’ అన్నారు టి.ఎఫ్‌.సి.సి. చైర్మన్‌ ప్రతాని రామకృష్ణ గౌడ్‌.

బుధవారం ఆయన మాట్లాడుతూ– ‘‘టీఎఫ్‌సీసీలో ఇప్పటికి అమ్మకు ప్రేమతో, దీక్ష, చిన్న చిన్న ఆశ, కోమలి సినిమాలు సెన్సార్‌ కాగా, 10 సినిమాలు సెన్సార్‌కు రెడీగా ఉన్నాయి. అలాంటి మా సంస్థకు గుర్తింపు లేదనడం సరికాదు. మా సంస్థలో వెయ్యిమంది దర్శక–నిర్మాతలు,  3 వేల మంది టెక్నీషియన్స్‌ సభ్యులుగా ఉన్నారు.

పక్క రాష్ట్రాల్లో డిజిటల్‌ చార్జీలు వారానికి 2500 ఉంటే మన దగ్గర వారానికి సుమారు 13,000 వసూలు చేస్తున్నారు. నెలకు దాదాపు 15 కోట్లు కొల్లగొడుతూ కొందరు నిర్మాతలు ప్రభుత్వాన్నే మోసం చేస్తున్నారు’’ అన్నారు.