'కోచడయాన్' సినీ చరిత్రలో గొప్ప చిత్రం:రజనీకాంత్

10 Mar, 2014 08:52 IST|Sakshi
'కోచడయాన్' సినీ చరిత్రలో గొప్ప చిత్రం:రజనీకాంత్

చెన్నై: ‘కోచడయాన్’ (తెలుగులో విక్రమసింహా) సినిమా  సినీ చరిత్రలో గొప్ప చిత్రంగా నిలుస్తుందని  దక్షిణ భారత సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా  రజనీకాంత్ కూతురు సౌందర్య నిర్మించిన కోచడయాన్  ఆడియో ఆవిష్కరణ ఆదివారం చెన్నైలో జరిగింది.  ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ తనకు  రాజుల కథలంటే చిన్నప్పటి నుంచీ ఇష్టం అని చెప్పారు.  ఆ తరహా కథతో సినిమా చేయాలన్న తన కోరిక ఈ చిత్రం ద్వారా నెరవేరిందన్నారు. తన అభిమానులను ఈ సినిమా తప్పక అలరిస్తుందని చెప్పారు.

ఈ కార్యక్రమానికి దక్షిణాది చిత్రసీమ తరలివచ్చింది. యానిమేటెడ్ చిత్రంగా కాప్చర్ మోషన్‌లో రూపుదిద్దుకోవటంతో ఈ చిత్రంపై  అంచనాలు భారీగా పెరిగాయి. ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన దీపికా పదుకునే నటించింది. ఈ చిత్రానికి రజనీకాంత్ కుమార్తె దర్శకత్వం వహించటంతో అందరిలో ఆసక్తి  నెలకొంది. ఏఆర్ రెహమాన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా షారూక్ మాట్లాడుతూ తాను రజనీకాంత్‌కి వీరాభిమానినని చెప్పారు. తెరపై రజనీ స్టయిల్ చూసి మెస్మరైజ్ అయిపోయానన్నారు. ఇరవై ఏళ్ళక్రితం ఓ షూటింగ్ నిమిత్తం ఆయన ముంబై వచ్చినప్పుడు సిగరెట్ కాల్చే స్టయిల్ స్వయంగా చూశానని,  ఆయనలా స్టయిల్‌గా కాల్చాలని చాలాసార్లు ప్రయత్నించి విఫలమయినట్లు చెప్పారు. రా.వన్ చిత్ర నిర్మాణ సమయంలో సౌందర్య, లతా మేడమ్, రజనీకాంత్లు తనకు ఎంతో సహాయం చేశారని షారుక్ పాత విషయాలను గుర్తు తెచ్చుకున్నారు.

ఆడియో ఆవిష్కరణలో రజనీకాంత్, ఆయన గురువు బాలచందర్, శంకర్, ఏఆర్ రహమాన్, దీపిక పదుకొణే, రసూల్, పూకుట్టి, శరత్ కుమార్, శోభన, సౌందర్య రజనీకాంత్, దనుష్, వెరముత్తు, కేయస్ రవికుమార్, ఆది పినిశెట్టి, నాజర్,  ఏవీఎం శరవణన్ తదితరులు పాల్గొన్నారు.