సైరా విడుదలకు గ్రీన్‌సిగ్నల్‌

2 Oct, 2019 04:35 IST|Sakshi

రిట్‌ను కొట్టివేసిన హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: సైరా నర్సింహారెడ్డి సినిమా విడుదల కాకుండా ఉత్తర్వులివ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన రిట్‌ను డిస్మిస్‌ చేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ప్రకటించింది. ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీస్తున్నట్లు ప్రకటించారని, చరిత్రను వక్రీకరిస్తూ చిత్రాన్ని నిర్మించారనే పిటిషన్‌కు నంబర్‌ కేటాయింపు చేయాలో, వద్దో అనే ప్రాథమిక దశలోనే హైకోర్టు కొట్టివేసింది. సినిమాను వినోద అంశంగానే చూడాలని హితవు చెప్పింది.

మరో రిట్‌ దాఖలు: ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి ప్రధాన అనుచరుడు వడ్డే ఓబయ్య అయితే రాజా పాండే ప్రధాన అనుచరుడిగా సినిమాను నిర్మించడం తప్పని పేర్కొంటూ వడ్డెర సంక్షేమ సంఘం విడిగా రిట్‌ దాఖలు చేసింది. దీనిని మంగళవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి విచారించారు. వడ్డే ఓబయ్య పాత్ర చిత్రంలో ఉందని సైరా చిత్రం తరఫు సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి చెప్పారు. తదుపరి విచారణ 16వ తేదీకి వాయిదా పడింది.  

సైరా ప్రత్యేక షోలకు అనుమతి
సాక్షి, అమరావతి: చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాకు బుధవారం నుంచి ఈ నెల 8వ తేదీ వరకు వారం రోజులపాటు ప్రత్యేక షోలు ప్రదర్శించేందుకు అనుమతిస్తూ రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి కేఆర్‌ఎం కిశోర్‌కుమార్‌ మంగళవారం ఉత్తర్వులిచ్చారు. ఆ మేరకు ఏడు రోజులపాటు అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఉదయం 10 గంటల మధ్య ప్రత్యేక షోల ప్రదర్శనకు అనుమతించారు. 

మరిన్ని వార్తలు