వీరి రెమ్యూనరేషన్‌ ఎంతంటే..

26 Apr, 2018 19:29 IST|Sakshi

సాక్షి, ముంబయి: బాలీవుడ్‌లో ఖాన్‌ త్రయం తర్వాత యువ కెరటాల్లా దూసుకొస్తున్న నవతరం హీరో, హీరోయిన్లు పెద్దమొత్తంలో రెమ్యూనరేషన్‌లు అందుకుంటున్నారు. స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ మూవీతో ఎంట్రీ ఇచ్చిన వరుణ్‌ ధావన్‌ వరుసగా హిట్‌ సినిమాలతో దూసుకెళుతూ భారీ మొత్తంలో పారితోషికం అందుకుంటున్నారు. రెమో డిసౌజా దర్శకత్వంలో తెరకెక్కనున్న తాజా సినిమాకు వరుణ్‌ ధావన్‌ ఏకంగా రూ 32 కోట్లు రెమ్యూనరేషన్‌ సొంతం చేసుకున్నారు. ఇక బాలీవుడ్‌ లేటెస్ట్‌ బ్యూటీ అలియా భట్‌ హైవే, ఉడ్తా పంజాబ్‌ సినిమాలతో తన నటనా సామర్థ్యాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు ఈ పాతికేళ్ల బ్యూటీ రూ 7 కోట్ల పారితోషికం వసూలు చేస్తున్నారు.

పద్మావత్‌ మూవీలో ఖిల్జీగా నట విశ్వరూపం ప్రదర్శించిన రణ్‌వీర్‌ సింగ్‌ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ 300 కోట్లు పైగా కలెక్ట్‌ చేయడంతో తన రెమ్యూనరేషన్‌నూ అమాంతం పెంచేశారు. రణ్‌వీర్‌ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ 13 కోట్లు డిమాండ్‌ చేస్తున్నారు. బాలీవుడ్‌లో ప్రస్తుతం అత్యధిక రెమ్యూనరేషన్‌ పొందుతున్న దీపికా పదుకోన్‌ పద్మావత్‌ ఘనవిజయంతో తనకు ఆ మాత్రం ఇవ్వడం​సముచితమేనంటూ పారితోషికం మరింత పెంచే పనిలో పడ్డారు. షారుక్‌ మూవీతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన అనుష్క శర్మ రూ 8 కోట్లు రెమ్యూనరేషన్‌గా అందుకుంటున్నారు.

బాలీవుడ్‌ కండలవీరుడిగా పేరొందిన సల్మాన్‌ ఖాన్‌ను మరిపించే బాడీతో తెరపై యాక్షన్‌ సీక్వెన్స్‌లను అలవోకగా పండిస్తున్న టైగర్‌ ష్రాఫ్‌ తక్కువ సినిమాలే చేసినా భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. బాఘీ 2తో ఘన విజయం అందుకున్న టైగర్‌ ప్రస్తుతం రూ 3 నుంచి 5 కోట్లు డిమాండ్‌ చేస్తున్నప్పటికీ త్వరలోనే ఆయన పారితోషికం భారీగా పెరుగుతుందని బాలీవుడ్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఇక బాలీవుడ్‌ భామ శ్రద్ధా కపూర్‌ గత సినిమాలు నిరాశపరిచినప్పటికీ సాహో మూవీకి ఆమె ఏకంగా రూ 9 కోట్లు పారితోషికం రాబట్టడంతో శ్రద్ధ మార్కెట్‌ చెక్కుచెదరలేదు. బాలీవుడ్‌ మూవీలకు మాత్రం ఆమె రూ 5 కోట్లు డిమాండ్‌ చేస్తారని, సాహో పలు భాషల్లో తెరకెక్కుతుండటంతో అదే స్ధాయిలో పారితోషికం డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు