సాహసోపేతమైన సోషల్ కామెంట్

4 Jan, 2015 23:27 IST|Sakshi
సాహసోపేతమైన సోషల్ కామెంట్

 గొల్లపూడి మారుతీరావు,
 ప్రముఖ రచయిత - నటుడు
 
 తారాగణం: స్పెన్సర్ ట్రేసీ,  కేథరిన్ హెప్‌బర్న్, కేథరిన్ హూటన్,
 సిడ్నీ పోయిటర్ తదితరులు
 దర్శకుడు-నిర్మాత: స్టాన్లీ క్రామర్;
 రచన: విలియం రోజ్; విడుదల: 12 డిసెంబర్, 1967
 నిర్మాణం వ్యయం: 25 కోట్ల రూపాయలు; వసూళ్లు: 440 కోట్లు (ప్రపంచవ్యాప్త వసూళ్లు)
 
 అప్పటికీ ఇప్పటికీ కావ్యం అనదగ్గ చిత్రం - ‘గెస్ హూ ఈజ్ కమింగ్ టు డిన్నర్’. కారణం... కేవలం చిత్రమే కాక ఆ చిత్ర నేపథ్యం, ఆ చిత్రం చుట్టూ అల్లుకున్న అతి విచిత్రమైన సంఘటనలు.ఈ చిత్రం 1967లో నిర్మితమైంది. అమెరికా చరిత్రలోనే అంతవరకూ ఓ నిషేధం అమలులో ఉంది. నల్లవారికీ, తెల్లవారికీ మధ్య వివాహ సంబంధాలు. శరీరం రంగు కారణంగా ఏర్పరచుకున్న అసమానతల్ని తొలగించి, తత్కారణంగా ఒక జాతి నిరసనకు కారణమై ప్రాణాలర్పించిన అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్ కథ - అప్పటికే చరిత్ర. అయితే రెండు వర్ణాల మధ్య వివాహ సంబంధాలు కిందటి శతాబ్దం 12 జూన్ 1967 వరకూ నిషిద్ధం. నల్లవారితో పొత్తు తెల్లవారికీ, తెల్లవారితో సంబంధాలు నల్లవారికీ ఏ కోశానా పొంతన లేని రోజులవి. అయితే 12 జూన్ 1967న ఆ నిషేధాన్ని న్యాయస్థానం తొలగించింది. తొలగించిన ఆరు నెలలకు ఈ చిత్రం రిలీజయింది.
 
 అసలు ఈ నేపథ్యంలో - ఒక ఇతివృత్తం - రెండు వర్ణాల మధ్య వివాహం- ప్రధాన ఘట్టంగా ఎన్నుకోవడానికి ఎంతో ధైర్యం కావాలి. అంతకు మించి సమర్థించడానికి అనూహ్యమైన సామర్థ్యమూ కావాలి. తరతరాల వైషమ్యాన్ని దాటి, చిత్రాన్ని తీసి, సర్వజనామోదయోగ్యం చేయడం ఎంత సాహసం! ఇంకా విచిత్రం ఏమిటంటే కింద కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో అప్పీలు అప్పటికే నమోదైంది. ఈ చిత్రంలో ప్రధాన పాత్రధారి స్పెన్సర్ ట్రేసీ ఆఖరి సీను నటించాక - ఇంకా స్పష్టంగా - ఆయన కన్నుమూయడానికి రెండు రోజుల ముందు సుప్రీంకోర్టు అప్పీలును కొట్టివేసింది. ఓ సంస్కృతిలో ఇంత పెద్ద వివక్షను దాటి ఇద్దరు వ్యక్తులు - నల్లబ్బాయి, తెల్ల అమ్మాయి ప్రేమలో పడిన కథ ఇది. కథలో తల్లితండ్రుల లాగే దేశానికంతటికీ షాక్. దీన్ని రచయిత, దర్శకుడు ఎలా సమర్థించి నెగ్గుకు రాగలరు? ఎప్పుడయినా సవాలును ఎదుర్కొన్న మొనగాడే చరిత్రను సృష్టించగలడు. అటువంటి ధైర్యమూ, అపూర్వమైన చిత్తశుద్ధీ, అంత సామర్థ్యమూ - వీటన్నిటి కారణంగా జనామోదమూ సాధించిన కళాఖండం ‘గెస్ హూ ఈజ్ కమింగ్ టు డిన్నర్.’ ఈ చిత్రానికి అసలు సిసలైన కథానాయకుడు దర్శకుడు స్టాన్లీ క్రామర్.
 
 ఇందులో ప్రధాన పాత్రకు అంటే తెల్ల అమ్మాయి తల్లి పాత్రకు ప్రముఖ నటి కేథరిన్ హెప్‌బర్న్‌ను ఎన్నుకున్నారు. ఆమె మరో ప్రముఖ నటుడు స్పెన్సర్ ట్రేసీతో కలిసి 27 సంవత్సరాలు వివాహం చేసుకోకుండా జీవించారు. ఆమె ఈ పాత్రను నటించడానికి ఒక షరతు పెట్టింది. అది ఏమిటంటే, స్పెన్సర్ ట్రేసీ భర్త వేషం వేయాలని! ట్రేసీ వయస్సు అప్పటికి 67 సంవత్సరాలు. ఆరోగ్యం బాగా దెబ్బతిని ఉంది. అతణ్ణి ప్రధాన పాత్రలో పెట్టుకుంటే - షూటింగ్ జరుగుతుండగా ఆయనకేమైనా అయితే? అందుకని స్టాన్లీ క్రామర్ ఒక షరతు పెట్టాడు. షూటింగ్ జరుగుతున్నంత కాలం ట్రేసీ ఆరోగ్యం దిగజారకుండా కాపాడవలసిన బాధ్యత ఆమెదేనని! పెట్టాడేకాని ఆరోగ్యాన్ని కాపాడడం ఎవరి చేతుల్లో ఉంది? షూటింగ్ సాగింది. స్పెన్సర్ ట్రేసీ ఎప్పుడూ క్రామర్‌తో నవ్వుతూ ఓ మాట అనేవాడట. ‘‘భయపడకయ్యా! నేను నీ సినిమాలో చచ్చిపోనులే!’’ అని. క్లైమాక్స్ సీను అద్భుతంగా నటించాడు ట్రేసీ. షూటింగ్ పూర్తయింది. సరిగ్గా 17 రోజుల తర్వాత కన్నుమూశాడు. ఆ హృదయ విదారకమైన జ్ఞాపకాలతో కేథరిన్ హెప్‌బర్న్ సినిమా చూడడానికి కూడా ఇష్టపడలేదు, చూడలేదు. అప్పటికి ఆమెకి 60 సంవత్సరాలు. మరో 36 సంవత్సరాలు బతికి, 96వ ఏట కన్నుమూసింది!
 
 ఇక అసలు కథకి... ఒక తెల్ల అమ్మాయి, ఓ నల్లబ్బాయిని ప్రేమించింది. ఇద్దరూ పెళ్లి చేసుకుందామనుకున్నారు. ఇంటికి వచ్చి పెద్దల అనుమతి తీసుకుని - ఆ రాత్రి విమానంలో జెనీవా వెళ్లిపోవాలి. ఆ పిల్ల తల్లితండ్రులు విషయం తెలుసుకుని షాక్ అయ్యారు. అనాలోచితంగా ఆ రోజు భోజనానికి నల్లబ్బాయి తల్లితండ్రుల్ని కూడా అమ్మాయి పిలిచింది. నాలుగు గంటల్లో ఇద్దరి తల్లిదండ్రులూ వారి వివాహానికి నిర్ణయం తీసుకోవాలి. ఈ ఆరుగురి చదరంగం ఆట - స్క్రీన్‌ప్లే. ఈ చిత్రం స్క్రీన్‌ప్లేకి ఉత్తమ స్క్రీన్‌ప్లేగా ఆస్కార్ బహుమతి వచ్చింది. తెల్లమ్మాయి పాత్రను కేథరిన్ హెప్‌బర్న్ మేనకోడలు కేథరిన్ హూటన్ నటించింది. తరతరాల ఆంక్ష, వర్ణ వైషమ్యాల స్పృహే లేని 23 ఏళ్ల ప్రేమికురాలు తెల్లమ్మాయి. లోక ధర్మాన్ని, తమ చర్యల పర్యవసానాన్ని తెలిసిన పరిణతి ఉన్న యువకుడు నల్లబ్బాయి. ఆ పాత్రను మెథడ్ ఏక్టింగులో ఆరితేరిన నటుడు సిడ్నీ పోయిటర్ నటించారు. (ఆ ధోరణి నటనను ప్రదర్శించే మరో మహానటుడు మార్గన్ బ్రాండో). పోయిటర్ నా అభిమాన నటుడు. సరే! తెల్లమ్మాయి తల్లితండ్రులు స్పెన్సర్ ట్రేసీ, కేథరిన్ హెప్‌బర్న్.
 
 ఈ చిత్రాన్ని గత 40 సంవత్సరాలలో కనీసం పదిసార్లు చూసివుంటాను. ఈ వ్యాసం రాసే ముందూ చూశాను. ఎప్పుడూ నా కళ్లు ధారాపాతంగా వర్షించకుండా సినిమా ముగియదు. ఈ చిత్రానికి 8 ఆస్కార్ నామినేషన్లు వచ్చాయి. తన 60 ఏట ఉత్తమ నటిగా కేథరిన్ హెప్‌బర్న్‌తో సహా. రెండు ఆస్కార్ బహుమతులు - ఉత్తమ స్క్రీన్‌ప్లేకు విలియమ్ రోజ్ అనే రచయిత్రికి, దర్శకత్వానికి స్టాన్లీ క్రామర్‌కి దక్కాయి. సహజంగానే హెప్‌బర్న్ కళ్లలో చిన్న వెలుగు ఉంది. చాలా సులువుగా ఆర్ధ్రమయ్యే ముఖం. ఆ కళ్లలో ఆద్యంతమూ పల్చని నీటి తెర అపూర్వం. ఒక జాతి విశ్వాసాలను మొట్టమొదటిసారిగా ఎదిరిస్తూ, ఆ స్పృహ కూడా లేని - తనకత్యంత ప్రేమపాత్రమైన ఒక్కగానొక్క కూతురి ఆనందాన్ని చూస్తూ - తల్లి ప్రేమకూ, సామాజిక ఆంక్షలకూ రాజీ పడడాన్ని అపూర్వంగా నటించిన అద్భుత చిత్రం ఇది.
 
 అలాగని స్పెన్సర్ ట్రేసీ నటనను తక్కువ చేయడానికి వీలు లేదు. వారి జీవితాల గురించి అంతిమ నిర్ణయం తీసుకోవలసిన ఇంటి పెద్ద - కాదు తెల్లజాతికంతటికీ - మొట్టమొదటి ప్రతినిధిగా ట్రేసీ నటన అపూర్వం.ఓ జాతి మౌఢ్యం మీదా, స్వేచ్ఛకు అవకాశం ఇచ్చిన న్యాయస్థానం పెద్ద మనస్సు మీదా మొట్టమొదటి, సాహసోపేతమైన సోషల్ కామెంట్ ఈ చిత్రం. స్టాన్లీ క్రామర్ ఈ ఇతివృత్తాన్ని ఎంచుకున్నందుకే మన దేశపు గౌరవం ప్రకారం ‘పద్మభూషణ్’ ఇస్తాను నేను.
 
 ఆస్కార్ బహుమతిని పుచ్చుకున్న రచయిత్రి విలియం రోజ్ కి ఈ చిత్రం రాసేనాటికి 49 సంవత్సరాలు. ఊహించలేని విస్ఫోటనం కలిగించే ఇతివృత్తాన్ని అతి సరళంగా, అతి హృద్యంగా, ఏమీ శషభిషలు లేకుండా కుండబద్దలు కొట్టిన రచన ఆమెది. అంతవరకూ అలవాటు లేని, ఊహించడానికి ఊహకయినా అందని సంఘటనని - తన రచనతో అంగీకరించేటట్టు చేసిన ఘనత ఆమెది. తరతరాల ఆలోచనా సరళిలో, దృక్పథంలో మార్పు రావలసిన తరుణం ఆసన్నమయిందని నిర్ద్వంద్వంగా సూచించిన ఆ రెండు వాక్యాలూ చిరస్మరణీయాలు. తెల్లవారికి నల్లవారి మీద ఏహ్యత ఎంత ఉన్నదో, నల్లవారికీ తెల్లవారి పట్ల అంతే విముఖత ఉంది. నల్ల తండ్రి తన కొడుకు మీద విరుచుకుపడ్డాడు. ఆవేశపడిన తండ్రిని ఎదిరించాడు - చదువుకున్న కొడుకు. అక్కడ ఒక వాక్యం రాసింది: ‘‘డాడ్! నువ్వు ఒక నల్లమనిషిగా ఆలోచిస్తున్నావు. నేను కేవలం మనిషిగా ఆలోచిస్తున్నాను.’’
 
 చివర ఆ ఇద్దరి వివాహాన్నీ అంగీకరిస్తూ స్పెన్సర్ ట్రేసీ చేసే ముక్తాయింపు అద్భుతం. ‘‘మీరిద్దరూ ఒక జాతి విశ్వాసాల మీద తిరుగుబాటు చేస్తున్నారు. మీరు ఒకరికొకరై ఆనందంగా బతకవచ్చు. కానీ అక్కడ లక్షలాది కోట్లాదిమంది వ్యతిరేకతనూ, వివక్షనూ తట్టుకొని జీవించాలి. అది మీ సమస్య. మీరు కోరుకున్న సమస్య. రేపటి మీ పిల్లల సమస్య. వీటన్నిటికీ - మీరిద్దరూ ఒకరికొకరు పంచుకున్న ప్రేమే పెట్టుబడి.’’
 
 నల్లతల్లి, తెల్లతల్లి కళ్లు చెరువులయ్యాయి. కూతురు చెంపలు తడిసిపోయాయి. కేథరిన్ హెప్‌బర్న్ అనే తల్లి, మహానటి - కృతజ్ఞతతో, భర్త సరైన నిర్ణయం తీసుకున్నాడన్న తృప్తితో లేచి భర్త చేతిని పట్టుకుంది. విలియం రోజ్‌కి రాయడానికి మాటల్లేవు. స్టాన్లీ క్రామర్ చెప్పగల సూచన లేదు. ఓ మిడ్‌షాట్‌లో ఆ మహానటి అవలీలగా భర్త చెయ్యి పుచ్చుకుని, అతి సుతారంగా ఉత్తమ నటిగా ఆస్కార్ పోటీకి నిలిచింది. సినిమా చూస్తున్న నేను నాకు తెలియకుండానే పదోసారి ఏడ్చాను. తరతరాల వివక్షకు చరమగీతం ‘గెస్ హూ ఈజ్ కమింగ్ టు డిన్నర్’. ఎందరో మహాకళాకారుల సమష్టి కృషి. హాలీవుడ్‌లో అపురూపమైన చరిత్ర. ఆలోచనల్లో కదిలినప్పుడల్లా నన్ను అలరించే గొప్ప చిత్రం.. కాదు, మహా కావ్యం.
 
 హాలీవుడ్‌లో చరిత్ర సృష్టించిన మహాద్భుతమైన చిత్రాల రూపకర్త స్టాన్లీ క్రామర్. ‘హైనూన్’, ‘ఇటీజ్ మ్యాడ్ మ్యాడ్ మ్యాడ్ వరల్డ్’ లాంటి చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. 1954లో అమెరికా నాటకరంగంలో ప్రముఖమైన నాటకం ‘కెయినీ మ్యూటినీ కోర్ట్ మార్షల్’ను తెరకెక్కించిన ఘనుడు. ఒకప్పటి ఫ్రెంచి నాటకం ‘సిరానో డి బెర్గరాక్’ని చిత్రంగా తీశారు. చాలామంది టచ్ చేయడానికి వెనకాడే క్లిష్టమైన అంశాలతో సినిమాలు తీసిన ధీశాలి. క్రామర్ దాదాపు పదిహేను చిత్రాలకు దర్శకత్వం వహిస్తే, వాటిలో ఎక్కువ శాతం చిత్రాలు వివాదాస్పదమైన అంశాలతో రూపుదిద్దు కున్నవే. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలు 16 ఆస్కార్ అవార్డులు పొందగా, 80 ఆస్కార్ నామినేషన్స్ సాధించడం విశేషం.