'రుద్రమదేవి' మూవీ రివ్యూ

9 Oct, 2015 08:56 IST|Sakshi
'రుద్రమదేవి' మూవీ రివ్యూ

టైటిల్ : రుద్రమదేవి
జానర్ ;  హిస్టారికల్ యాక్షన్ డ్రామా
తారాగణం ; అనుష్క, అల్లు అర్జున్, రానా, ప్రకాష్ రాజ్, కృష్ణంరాజు
దర్శకత్వం ; గుణశేఖర్
సంగీతం ; ఇళయరాజా
నిర్మాత ; గుణశేఖర్


ఎన్నో అవాంతరాల తరువాత  దర్శకుడు గుణశేఖర్ డ్రీమ్ ప్రాజెక్ట్ రుద్రమదేవి ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాకతీయ వీరనారి రుద్రమదేవి జీవితకథ ఆధారంగా భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం రుద్రమదేవి. దర్శకుడు గుణశేఖర్ 12 ఏళ్ల పాటు రిసెర్చ్ చేసి రూపొందించిన కథతో రూ. 80 కోట్లకు పైగా బడ్జెట్ తో తొలి భారతీయ స్టీరియో స్కోపిక్ త్రీడి చిత్రంగా తెరకెక్కిన రుద్రమదేవి ఆడియన్స్ ను ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.

కథ ;
చరిత్ర పరంగా రుద్రమదేవి కథలో ఎన్నో ఊహాగానాలు, కల్పిత కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ అపోహలన్నింటికీ రుద్రమదేవి సినిమాతో సమాధానం చెప్పే ప్రయత్నం చేశాడు గుణశేఖర్. 13 శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు గణపతిదేవుడు( కృష్ణంరాజు). ఆయనకు కుమార్తె మాత్రమే ఏకైక సంతానం కావటంతో, తన తరువాత సింహాసనాన్ని అధీష్టించడానికి వారసులు లేరన్న భావనతో  కుమార్తె రుద్రమదేవినే... కుమారుడు రుద్రదేవగా కాకతీయ ప్రజలకు పరిచయం చేస్తాడు. అందుకు తగ్గట్టుగానే మహామంత్రి శివదేవయ్య( ప్రకాష్రాజ్) రుద్రమదేవికి అన్ని విద్యలలోనూ శిక్షణ ఇస్తాడు.

గణపతిదేవుని మరణం తరువాత కొంత కాలనికి కాకతీయ సామ్రాజ్యపు వారసుడు రాజు కాదు రాణి, రుద్రదేవ కాదు, రుద్రమదేవి (అనుష్క) అని ప్రకటిస్తాడు మంత్రి శివదేవయ్య. ఈ విషయాన్ని సామంతులు జీర్ణించుకోలేకపోతారు. ఓ మహిళ దగ్గర సామంతులుగా ఉండటానికి అంగీకరించరు.  దీంతో రుద్రమదేవి రాజ్యం విడిచి వెళ్లాల్సి వస్తుంది. అదే సమయంలో మహదేవ ( విక్రమ్జిత్) కాకతీయ సామ్రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని కుట్రలు పన్నుతాడు. పాలన సరిగా లేకపోవటంతో ప్రజా హక్కుల కోసం పోరాడే గోన గన్నారెడ్డి (అల్లుఅర్జున్) కాకతీయ సామ్రాజ్యంపై ఎదురుతిరుగుతాడు.

రాజ్యంలో అనిశ్చితి నెలకొనటంతో ఎలాగైన రాజ్య పరిస్థితి చక్కదిద్దాలని, తిరిగి సింహాసనాన్ని అధిష్టించాలని రుద్రమదేవి ప్రయత్నాలు ప్రారంభిస్తుంది. అందుకు సాయం చేయాల్సిందిగా తనకు అత్యంత సన్నిహితుడైన నిడదవోలు రాజు చాళుక్య వీరభద్రుడి(రానా) సాయం కోరుతుంది. రాజ్య పరిస్థితి చూసిన గోన గన్నారెడ్డి కూడా వీరికి సాయం చేయడానికి అంగీకరిస్తాడు. ఈ ఇద్దరి సాయంతో రుద్రమదేవి కాకతీయ సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేసింది.? ఆ క్రమంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నది అన్నదే సినిమా కథ.

విశ్లేషణ :
మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్తో కాకతీయ సామ్రాజ్యపు గొప్పతనాన్ని వివరిస్తూ సినిమా ప్రారంభమవుతుంది. సినిమాలో ప్రతీ పాత్రను అద్భుతంగా ప్రజెంట్ చేయటంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా రుద్రదేవగా, రుద్రమదేవిగా రెండు షేడ్స్ చాలా బాగా బ్యాలెన్స్ చేశారు. ఇక అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ నుంచి గెటప్, డైలాగ్స్ ఇలా అన్నింటిలోనూ చాలా కేర్ తీసుకున్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సినిమాకు మెయిన్ ఎసెట్ గా భావిస్తున్న గోన గన్నారెడ్డి పాత్రను ఆశించిన స్ధాయిలో ప్రజెంట్ చేశారు. రుద్రమకు సాయం చేసే పాత్రలో చాళుక్య వీరభద్రుడిగా రానా మరోసారి మెప్పించాడు. భళ్ళాలదేవ తరువాత మరో చారిత్రక పాత్రలో కనిపించిన రానా ... తాను ఎలాంటి పాత్రనైన పోషించగలనని మరోసారి ప్రూవ్ చేశాడు. అయితే చాలా పెద్ద కథ కావటంతో అన్ని పాత్రలకు సరైన క్లారిటీ ఇవ్వటంతో మాత్రం దర్శకుడు విఫలమైనట్టుగా అనిపిస్తుంది.

ఆడియో పరంగా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది రుద్రమదేవి, కథలో ఎక్కడ పాటలకు అవకాశం లేకపోయినా కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం అన్నట్టుగా పాటలు రావటం స్టోరి నారేషన్కు కాస్త ఇబ్బంది కలిగిస్తుంది. ఇంటర్వెల్ వరకు కథ మీద మంచి పట్టు చూపించిన దర్శకుడు తరువాత మాత్రం అనుకున్న స్థాయిలో నడిపించలేకపోయాడు. చాలా సన్నివేశాలు లెంగ్తీగా అనిపిస్తాయి.

నటీనటులు :
రుద్రమదేవిగా  చారిత్రక పాత్రలో అనుష్క చక్కగా ఒదిగిపోయింది. ముఖ్యంగా రుద్రదేవ, రుద్రమదేవిగా రెండు షేడ్స్ను ఆమె తన నటనతో మెప్పించింది. ఇక పోరాట సన్నివేశాల్లో యాక్షన్ స్టార్స్కు ఏ మాత్రం తీసిపోని విధంగా అలరించింది. అనుష్క లుక్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకున్నారు. బాడీ లాంగ్వేజ్తో పాటు దుస్తులు, నగలు కూడా చాలా బాగా సెట్ అయ్యాయి.


గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ ఆకట్టుకున్నాడు. గంభీరమైన లుక్ తో, డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో అలరించాడు. మాస్లో మంచి ఫాలోయింగ్ ఉన్న బన్నీకి ఈ క్యారెక్టర్ మంచి ప్లస్ అవుతుందనే చెప్పాలి. రానా పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోయినా ఉన్నంతలో బాగానే మెప్పించాడు. సినిమా అంత రుద్రమకు సపోర్ట్ చేసే పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇక కృష్ణంరాజు, ప్రకాష్రాజులు తమ పరిథి మేరకు అలరించారు. విలన్గా విక్రమ్జిత్ పరవాలేదనిపించాడు.

సాంకేతిక నిపుణులు :
ఓ భారీ చారిత్రక కథాంశాన్ని వెండితెర మీద చూపించాలన్న గుణశేఖర్ కల నెరవేరిందనే చెప్పాలి. సెట్, గ్రాఫిక్స్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించిన రుద్రమదేవి ప్రేక్షకులను 13వ శతాబ్దంలోకి తీసుకెళుతుంది. పాటలు పెద్దగా ఆకట్టుకోలేకపోయినా నేపథ్య సంగీతంతో సినిమాకు ప్రాణం పోశారు మ్యాస్ట్రో ఇళయరాజా. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉండి ఉంటే బాగుండేది. ముఖ్యంగా సెకండాఫ్లో వచ్చే చాలా సన్నివేశాలు లెంగ్తీగా ఉన్నాయి.

ఈ సినిమా కోసం టెక్నికల్ టీమ్ పడిన కష్టం ప్రతీ ఫ్రేములోనూ కనిపిస్తుంది. తోట తరణి ఆర్ట్ వర్క్, జయనన్ విన్సెంట్ సినిమాటోగ్రఫి అద్భుతంగా వచ్చాయి. నీతాలుల్లా కాస్ట్యూమ్స్ కాకతీయ సామ్రాజ్యపు పరిస్థితులను కళ్లకు కట్టినట్టుగా చూపించాయి. రుద్రమదేవి సినిమా విషయంలో దర్శకుడి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. దాదాపు 12 ఏళ్ల పాటు శ్రమించి తయారు చేసుకున్న కథతో ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఈ సినిమాను తెరకెక్కించాడు గుణశేఖర్. అయితే అందరికి తెలిసిన కథను మరింత ఇంట్రస్టింగ్గా చెప్పడంలో కాస్త తడబడ్డాడు. అయితే క్లైమాక్స్లో వచ్చే వార్ ఎపిసోడ్స్తో అన్ని మరచిపోయేలా చేయగలిగాడు గుణ. యుద్ధ సన్నివేశాలు ఇంకాసేపు ఉంటే బాగుండనిపించింది.

ప్లస్ పాయింట్స్ :
అనుష్క, అల్లు అర్జున్ నటన
విజువల్ ఎఫెక్ట్స్
సెట్టింగ్స్
స్టోరీ

మైనస్ పాయింట్స్ :
లెంగ్తీ సీన్స్
ఎడిటింగ్
పాటలు

ఓవరాల్గా రుద్రమదేవి కాకతీయ చరిత్రను నేటి తరానికి పరిచయం చేసే మంచి ప్రయత్నం.