జీవీ చిత్రానికి సెన్సార్‌ ప్రశంసలు

30 May, 2019 10:14 IST|Sakshi

సామాజిక సేవాభావం కలిగిన అతి కొద్ది మంది నటుల్లో జీవీ.ప్రకాశ్‌కుమార్‌ ఒకరు. నిజ జీవితంలోనే కాదు తన చిత్రాల్లోనూ సామాజికపరమైన అంశాలు ప్రతిభించాలని కోరుకునే నటుడు. అలాంటి జీవీకి నాచ్చియార్‌ తరువాత మంచి సక్సెస్‌ పడలేదు. తాజాగా ఐంగరన్‌ చిత్రంతో తెరపైకి రావడానికి రెడీ అవుతున్నారు. నటి మహిమా నంభియార్‌ కథానాయకిగా నటించిన ఈ చిత్రాన్ని కామన్‌మెన్‌ పిక్చర్స్‌ పతాకంపై పి.గణేశ్‌ నిర్మించారు.

ఈటీ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు రవిఅరసు తెరకెక్కించిన చిత్రం ఐంగరన్‌. నిజానికి ఐంగరన్‌ చిత్రం చాలా కాలంగా నిర్మాణ కార్యక్రమాల్లో ఉంది. తాజాగా సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. విశేషం ఏమిటంటే సెన్సార్‌ బోర్డు సభ్యులు ఈ చిత్రానికి యూ సర్టిఫికెట్‌ ఇవ్వడంతో పాటు మంచి కథా చిత్రం అని ప్రశించించారట. ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ ఒక ప్రకటనలో తెలిపి తమ సంతోషాన్ని వ్యక్తం చేసింది.

ఐంగరన్‌ నటుడు జీవీ.ప్రకాశ్‌కుమార్‌ గత చిత్రాలకు భిన్నంగా వేరే కోణంలో ఉంటుందని దర్శకుడు రవిఅరసు పేర్కొన్నారు. ఇందులో ఆయన యాక్షన్‌ కోణాన్ని కూడా చూస్తారని చెప్పారు. ఈ చిత్ర టీజర్‌ను ఇటీవల దర్శకుడు ఏఆర్‌.మురుగదాస్‌ చేతుల మీదగా విడుదల చేయగా కొన్ని గంటల్లోనే ప్రేక్షకుల నుంచి అత్యధికంగా లైక్స్‌ వచ్చాయని తెలిపారు. అంతే కాదు సినీవర్గాల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయని చెప్పారు. ఐంగరన్‌ చిత్రం కూడా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకాన్ని చిత్ర వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు