హీరో చేస్తానని ఆశ పెట్టి ...

11 Jan, 2015 11:31 IST|Sakshi
హీరో చేస్తానని ఆశ పెట్టి ...

చెన్నై : చిత్ర కథానాయకుడిగా తనకు ఓ ప్రముఖ దర్శకుడు ఆశ పెట్టి వదిలేశారని, దాని పర్యవసానమే తన తెరంగేట్రమని యువ సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్‌కుమార్ అన్నారు. ఈయన కథానాయకుడిగా నటించిన డార్లింగ్ చిత్రం సంక్రాంతికి తెరపైకి రానుంది. స్టూడియో గ్రీన్, గీతా ఆర్ట్స్ చిత్ర నిర్మాణ సంస్థలు అధినేతలు కె.ఇ.జ్ఞానవేల్ రాజా, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది. శ్యామ్ ఆండాన్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో జీవీ సరసన నిక్కి కవరాణి నటించారు. ఇది తెలుగులో మంచి విజయం సాధించిన ప్రేమ కథా చిత్రానికి రీమేక్. డార్లింగ్ చిత్రం సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది.
 
 ఈ సందర్భంగా జి.వి.ప్రకాష్‌కుమార్ మాట్లాడుతూ నిజం చెప్పాలం టే తనకు నటించాలనే ఆలోచనే లేదన్నారు. ఒక చిత్ర ప్రమో షన్ కోసం ఫొటో సెషన్ చేశామన్నారు. వాటిని చూసిన ప్రముఖ దర్శకుడు ఎఆర్.మురుగదాస్ హీరోలా ఉన్నారు నటించండి అని అన్నారన్నారు. ఏదో సరదాగా అంటున్నారని తాను భావించానన్నారు. అయితే అన్నట్లుగానే తాను హీరోగా ఎ ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఒక చిత్రం చేసే ప్రయత్నాలు జరిగాయని తెలిపారు. తర్వాత నిర్మాతతో దర్శకుడికి అభిప్రాయభేదాలు రావడంతో ఆ చిత్రం తెరకెక్కలేదని చెప్పారు.
 
 ఆ విధంగా ఎఆర్.మురుగదాస్ తనలో హీరో ఆశ రేపి వెళ్లిపో యారన్నారు. అనంతరం తన చిరకాల స్నేహితుడు పెన్సిల్ చిత్ర కథతో వచ్చారని తెలిపారు. కథ నచ్చడంతో కథానాయకుడిగా నటించడానికి సిద్ధమయ్యానన్నారు. ఆ చిత్ర నిర్మాణం లో అనూహ్యంగా మూడు నెలలు గ్యాప్ వచ్చిందన్నారు. దాంతో కాస్త బాధ అనిపించిందని అన్నారు. అలా కాస్త మీసం, గడ్డం పెంచి ఒకసారి జిమ్‌కు వెళ్లినప్పుడు నిర్మాత జ్ఞానవేల్ రాజా కలిశారని పేర్కొన్నారు. జీవీ మీకు మీసం, గడ్డం బాగున్నాయి, నేనొక తెలుగు చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాను, అందులో హీరోగా మీరు బాగుంటారు, సీడీ పంపిస్తాను చూడండి అని చెప్పారన్నారు. అలా మొదలైందే డార్లింగ్ చిత్రమని జి.వి.ప్రకాష్ వెల్లడించారు.
 
 మొదటిసారే దెయ్యం కథ చిత్రంలో నటిస్తున్నారేమిటని అన్నవారు ఉన్నారన్నారు. మంచి విషయం అయితే అది దెయ్యం మూలంగా జరిగినా మంచిదేగా అని తాను అన్నానని తెలిపారు. ప్రేమ, హార్రర్, థ్రిల్లర్ కథా చిత్రంగా తెరకెక్కిన డార్లింగ్ చిత్రాన్ని సంగీత దర్శకుడు ఎఆర్.రెహ్మాన్ చూసి బాగుందని మెచ్చుకున్నారని జీవీ వెల్లడించారు.