ఆ ఇద్దరి కాంబినేషన్‌లో..

8 Aug, 2019 07:29 IST|Sakshi

సినిమా: కోలీవుడ్‌లో నాటి నేటి నాయికలతో చిత్రాలు చేసే ట్రెండ్‌ నడుస్తోందా అని అనుకునేలా క్రేజీ కాంబినేషన్లలో చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఇటీవల జాక్‌పాట్‌ చిత్రంలో నటి జ్యోతిక, రేవతి ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం నటి త్రిష, సిమ్రాన్‌ కలిసి ఒక చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా నటి హన్సిక, రమ్యకృష్ణ కలిసి నటించడానికి రెడీ అవుతున్నారని తెలిసింది. ప్రభుదేవా, హన్సిక జంటగా నటించిన గులేభాకావళి వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాన్ని తెరకెక్కించిన కల్యాణ్‌ ఇటీవల నటి జ్యోతిక, రేవతి ప్రధాన పాత్రల్లో నటించిన జాక్‌పాట్‌ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం గత శుక్రవారమే తెరపైకి వచ్చింది. ఈ రెండూ వినోదమే ప్రధానంగా రూపొందిన చిత్రాలన్నవి గమనార్హం. కాగా కల్యాణ్‌ చిత్రానికి సిద్ధమైపోయారు. ఈయన తాజా చిత్రానికి కామెడీనే ప్రధాన అంశంగా తీసుకున్నట్లు సమాచారం. నటి హన్సిక కథానాయకిగా నటించనున్న ఇందులో రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటించనున్నట్లు సమాచారం.

దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. కాగా హన్సిక, రమ్యకృష్ణ కలిసి 2015లో ఆంబళ అనే చిత్రంలో నటించారు. అందులో విశాల్‌ హీరో. కాగా ప్రస్తుతం నటి హన్సిక నటిస్తున్న తన 50వ చిత్రం నిర్మాణంలో ఉందన్నది గమనార్హం. ఇది ఆరంభం నుంచే చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ మధ్య ఆ చిత్రం ఊసే ఎవరూ ఎత్తడం లేదు. కారణాలేమిటో తెలియదు గానీ, ఆ తరువాత నటి హన్సికకు మరో అవకాశం రాలేదు. అలాంటిది ఈ ముద్దుగుమ్మకు దర్శకుడు కల్యాణ్‌ ఆఫర్‌ ఇచ్చినట్లు తెలిసింది. ఇంతకుముందు తాను దర్శకత్వం వహించిన గులేభాకావళి చిత్ర నాయకి హన్సికనే అన్నది గమనార్హం. ఆ చిత్రం మంచి హిట్‌ అయ్యింది. ఆ సెంటిమెట్‌తోనే దర్శకుడు కల్యాణ్‌ తన తాజా చిత్రానికి ఆమెను ఎంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మరిన్ని వార్తలు