ఉప్పొంగిన అభిమానం

12 Oct, 2017 08:14 IST|Sakshi

తమిళసినిమా: వెలకట్టలేని వాటిలో అభిమానం ఒకటి. ఇక తారలకు మూలధనమే అదే. వాళ్ల ప్రేమాభిమానాలు కనుక లభిస్తే ఆ తారలకు తిరుగుండదు. నటి హన్సిక మంగళవారం అలాంటి అభిమానంతోనే తడిచి ముద్దయింది. హన్సిక దక్షిణాదిలో ముఖ్యంగా తమిళ చిత్ర పరిశ్రమలో పలు చిత్రాల్లో నటించింది. అయితే ప్రస్తుతం అవకాశాలు తగ్గుముఖం పట్టాయని చెప్పక తప్పదు. ఆమె చేతిలో ప్రభుదేవాకు జంటగా నటిస్తున్న గులేబాకావళి చిత్రం ఒక్కటే ఉంది.

అయినా అభిమానుల్లో ఈ బ్యూటీపై అభిమానం ఏమాత్రం కొరవలేదనడానికి మంగళవారం జరిగిన సంఘటనే చిన్న ఉదాహరణ. ఈ అమ్మడు మంగళవారం ఈరోడ్డులో సందడి చేసింది. అక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన హన్సికను చూడడానికి ఆ చుట్టు ప్రక్కల జనం భారీ సంఖ్యలో వచ్చి చేరారు. ఆమె కోసం సుమారు రెండు గంటలకు పైగా వేచి ఉన్నారు. హన్సిక వేదికపైకి రాగానే అభిమానుల్లో ఒక్కసారిగా ఉత్సాహం ఉప్పొంగింది. హేయ్‌ హన్సిక అంటూ కేకలు, ఈలలు, చప్పట్లతో అంటూ ఆ ప్రాంతం మారుమోగింది.

అప్పటికీ ముందుగానే భద్రతా సిబ్బందిని నిర్వాహకులు ఏర్పాటు చేసినా, వారికి అభిమానాన్ని కట్టడి చేయడం కష్టతరంగా మారింది. అభిమానులను ఉద్దేశించి హన్సిక మాట్లాడుతూ ఇక్కడ మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. మీరంటే చాలా ఇష్టమంటూ ఫ్లయింగ్‌ కిస్‌లు ఇచ్చింది. దీంతో అభిమానులు ఫిదా అయిపోయారు. హన్సికను చూసిన ఆనందంతో గాలిలో తేలినట్లుందే అంటూ పాడుకుంటూ ఇంటి దారి పట్టారు.అయితే హన్సిక రావడం, అభిమానులు చుట్టడం వంటి సంఘటనలతో ఆ ప్రాంత వాహనచోదకులకు అంతరాయం కలిగింది. ఎట్టకేలకు పోలీసులు పరిస్థితిని చక్కబరచారనుకోండి. అలా నటి హన్సిక అభిమానంతో తడిచి ముద్దయిందన్నమాట.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు