నా పిల్లల్లో ఒకరు టెన్త్ చదువుతున్నారు..

3 Jan, 2019 09:18 IST|Sakshi

సినిమా: నటి హన్సిక నూతన సంవత్సరంలో ఒక శపథం చేసింది. ఈమెలో అందమే కాదు దాని వెనుక అంతకన్నా అందమైన మనసూ, మంచి ఆశయమూ ఉంది. నటిగా పుష్కరాన్ని టచ్‌ చేసినా క్రేజీ కథానాయికల్లో ఒకరిగా రాణిస్తున్న నటి హన్సిక. ఈ ముద్దుగుమ్మ సిగ్ధమనోహరం యువత గుండెల్లో తీయని గునపాలను గుచ్చుతుంది. ఇప్పటి వరకూ కమర్శియల్‌ చిత్రాల్లో అందాలను ఆరబోయడానికే ఎక్కువగా ప్రయత్నించిన ఈ బ్యూటీ తాజాగా నటనకు అవకాశం ఉన్న పాత్రలపై దృష్టి పెట్టింది. అలాంటి చిత్రమే ప్రస్తుతం ఈ అమ్మడు నటిస్తున్న మహా. ఇది హన్సికకు అర్ధ సెంచరీ చిత్రం కావడం విశేషం. అయితే ఈ చిత్రంతో మొదటి నుంచే హన్సిక వివాదాలకు కారణంగా మారుతోంది. మహా చిత్ర తొలి రెండు ఫస్ట్‌లుక్‌ పోస్టర్ల విడుదల సమయంలోనూ విమర్శలను ఎదుర్కొంది. తాజాగా మరో పోస్టర్‌ను విడుదల చేశారు. అదీ చర్చనీయాంశంగా మారింది. అందరూ టబ్‌లో నీళ్లతో స్నానం చేస్తారు. మహా చిత్రంలో నటి హన్సిక మాత్రం రక్తంతో స్నానం చేసింది. అవును చేతిలో గన్‌ పట్టుకుని రక్తం నిండిన టబ్‌లో స్నానం చేస్తున్నట్లున్న హన్సిక ఫొటోతో కూడిన మహా చిత్ర మూడో పోస్టర్‌ను ఇటీవల చిత్ర వర్గాలు విడుదల చేశారు.

ఇది ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇక నూతన సంవత్సరంలో నటి హన్సిక చేసిన శపథం విషయానికి వస్తే ఈ బ్యూటీ ఇంత చిన్న వయసులోనే 34 మందికి తల్లి అయ్యింది. అవును 34 మంది అనాథ పిల్లలను దత్తత తీసుకుని వారి సంరక్షణ బాధ్యతలను నిర్వహిస్తోంది. వారిని హన్సిక తన పిల్లలనే చెబుతుంది. వారి కోసం ముంబైలో ఒక ఆశ్రమాన్ని కట్టించే ప్రయత్నంలో ఉంది. ఈ సందర్భంగా హన్సిక తన ట్విట్టర్‌లో పేర్కొంటూ నా పిల్లల్లో ఒకరు ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలను రాయనున్నారని చెప్పింది. అతన్ని మంచి మార్కులు సాధించేలా చేసి రాష్ట్రంలోనే ప్రథమ విద్యార్థిగా తీర్చిదిద్దాలని నూతన సంవత్సరంలో శపథం చేశానని తెలిపింది. ఇకపోతే తాను ప్రస్తుతం నటిస్తున్న మహా చిత్రం విభిన్నమైన థ్రిల్లర్‌ కథా చిత్రంగా ఉంటుందని చెప్పింది. అయితే ఈ చిత్రం గురించి తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని అంది. ఇప్పుడు మరో మూడు కొత్త చిత్రాలను అంగీకరించానని, వాటి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని హన్సిక పేర్కొంది. అదేవిధంగా ఇకపై తాను నటించే చిత్రాల్లో తన పాత్రలకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు