అదొక్కటే నా బలం కాదు

21 Dec, 2018 03:04 IST|Sakshi
హను రాఘవపూడి

‘‘జీవితంలో మనకు దగ్గరగా ఉన్న వాటిని మనం అంతగా పట్టించుకోం. మన దగ్గర లేని దానిపైనే మనకి ఎప్పుడూ ఆసక్తి, ఆలోచన ఉంటాయి. అలా నా జీవితంలో ప్రేమకథలు లేవు. కాకపోతే ఇలా ఉంటే బాగుంటుంది అనే ఆలోచనలు ఉన్నాయి. వాటినే కథలుగా రాస్తున్నా’’ అని హను రాఘవపూడి అన్నారు. ఆయన దర్శకత్వంలో శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘పడి పడి లేచె మనసు’.  చెరుకూరి సుధాకర్‌ నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతున్న  సందర్భంగా హను రాఘవపూడి చెప్పిన విశేషాలు.
 

► ‘పడి పడి లేచె మనసు’ ఒక ప్రేమ కథ. ఇలా చెబితే రొటీన్‌గానే ఉంటుంది. కానీ, కొత్త ప్రేమ కథ అంటూ ఏదీ లేదని నమ్ముతాను. కాకపోతే ఒక్కో దర్శకుడి పాయింటాఫ్‌ వ్యూ వేరుగా ఉంటుంది. వారు పెరిగిన వాతావరణం కావొచ్చు, వారు చూసిన జీవితం కావొచ్చు.. వాటిని బట్టే ప్రేమకథలని తెరకెక్కించే విధానం వేర్వేరుగా ఉంటుంది. నా విజన్‌కి తగ్గట్లు ఈ ప్రేమకథని తీశా.

► నా బలం ప్రేమకథలు అని బయట టాక్‌ ఉంది. అయితే మన బలం మనకెప్పుడూ తెలియదు. ఎదుటివాళ్లు చెబితేనే తెలుస్తుంది. నా సినిమాలు చూశాక నా బలం లవ్‌ స్టోరీస్‌ అని వాళ్లకి అనిపించి ఉండొచ్చు. అయితే ప్రేమకథలు మాత్రమే నా బలం కాదు. మిగతా వాటిలో కూడా నేను బలంగానే ఉన్నాననుకుంటున్నాను.

► శర్వానంద్‌ నాకెప్పటి నుంచో తెలుసు. ఒకసారి నా కథను రామ్‌చరణ్‌కి కూడా చెప్పించాడు. ఎప్పటి నుంచో శర్వ, నేను సినిమా చేయాలని అనుకుంటున్నాం. తనకోసం రెండు, మూడు లైన్స్‌ చెప్పాను. తను మాత్రం లవ్‌ స్టోరీ చేద్దామన్నాడు. అలా శర్వానంద్‌ని దృష్టిలో పెట్టుకునే ఈ లవ్‌ స్టోరీ రాశా. దర్శకులు మణిరత్నం, సుకుమార్‌గార్లతో నన్ను పోల్చడం ప్రశంసగా భావిస్తా. సంజయ్‌లీలా భన్సాలీ సినిమాలో షాట్స్‌ అన్నీ రిచ్‌గా ఉంటాయి. నాకు మణిరత్నం, భన్సాలీ, రాజు హిరాణీ, రాజమౌళిగార్ల సినిమాలంటే చాలా ఇష్టం.

► ఒకసారి వెంకట్‌ సిద్ధారెడ్డి, నేను కూర్చుని ‘పదహారేళ్ల వయసు.. పడి పడి లేచె మనసు’ పాట వింటున్నాం. ఈ పదాల్లోనే ఏదో కథ ఉందనిపించింది. ‘పడి పడి లేచె మనసు’ టైటిల్‌ అనుకున్నాం. దాని నుంచి పుట్టిన కథే ఇది. కథ రాస్తున్నప్పుడే సాయి పల్లవిని హీరోయిన్‌గా అనుకున్నాను. శర్వా, సాయిపల్లవి  పోటీపడి నటించారు. తెరపై నటీనటులు కాదు.. ప్రేక్షకులకు వారి పాత్రలే కనిపిస్తాయి.

► ఈ సినిమా బడ్జెట్‌ అనుకున్న దాని కంటే 15 శాతం ఎక్కువ అయింది. కోల్‌కత్తాలో ఎక్కువ లైవ్‌ లొకేషన్స్‌లో షూట్‌ చెయ్యటం వల్లే ఆలస్యమైంది. కానీ, సుధాకర్‌గారు ఎక్కడా బడ్జెట్‌కి వెనకాడలేదు. నేను కోల్‌కత్తాలో ఉన్నప్పుడు అక్కడ ఓ సినిమా తీయాలనుకున్నా. ఆ కోరిక ఈ సినిమాతో తీరింది.

► నా వద్ద ఔట్‌ ఆఫ్‌ ద బాక్స్‌ కథలూ ఉన్నాయి. వాటిని తీయడానికి సమయం, సందర్భం కావాలి. నాపై ప్రేక్షకుల్లో నమ్మకం వచ్చినప్పుడే వాటిని తీస్తా. ‘అందాల రాక్షసి’ సినిమా ఫస్ట్‌ డే ఫ్లాప్‌ అన్నారు. ఆ తర్వాత ఆ సినిమా నాకు తెచ్చిన గుర్తింపు వేరు. ‘లై’ని అనుకున్నట్టు తీయలేకపో యా. అయితే ఆ సినిమాకి రైటర్‌గా సక్సెస్‌ అయ్యాను. టేకింగ్‌లోనే పొరపాటు జరిగింది.

► నాని కోసం మిలటరీ బ్యాక్‌డ్రాప్‌లో ఓ కథ రెడీ చేశా. ప్రాజెక్ట్‌ కూడా ఓకే అయింది. అయితే నాని గెటప్‌ని టోటల్‌గా మార్చాలి. మా ఇద్దరి వీలు చూసుకొని ఆ సినిమా చెయ్యాలి. ‘పడి పడి లేచె మనసు’ తర్వాత మైత్రి మూవీస్‌లో సినిమా ఉంటుంది. హీరో హీరోయిన్లు ఎవరని ఇంకా అనుకోలేదు. వచ్చే ఏడాది వేసవిలో ఆ సినిమా ప్రారంభమవుతుంది.

మరిన్ని వార్తలు