మన నీలాంబరికి నలభై ఐదేళ్లు..

14 Sep, 2013 23:55 IST|Sakshi
మన నీలాంబరికి నలభై ఐదేళ్లు..

జోలాజోలమ్మజోలా.. జేజేలా జోలా అంటూ జోలపాట పాడినా, బంచికు బంబం చెయ్యి బాగా.. ఒంటికి యోగా మంచిదేగా అంటూ యోగ విన్యాసాలు చేసినా, రోజ్ రోజ్ రోజాపువ్వా అని హీరోతో పొగిడించుకునే అరవిరిసిన రోజాలా కనిపించినా.. అమ్మోరై దుష్టశిక్షణ చేసినా.. అవన్నీ ఆమెకే చెల్లు. కూచిపూడి, భరతనాట్యం.. రెండింటిలోనూ ప్రవీణ. అమాయకపు పల్లెపిల్లలా కనిపించాలన్నా, ఒంటినిండా పొగరు చూపించే నీలాంబరి పాత్ర ధరించాలన్నా.. ఆమెకే సాధ్యం. ఇప్పటికే ఆమెవరో అర్థమైంది కదూ.. అవును.. రమ్యకృష్ణ. తమిళనాట ప్రముఖ పాత్రికేయుడు, విమర్శకుడు చో రామస్వామి మేనకోడలు అయిన రమ్యకృష్ణ ఆదివారం 45వ పుట్టినరోజు జరుపుకొంటోంది.

దాదాపు దశాబ్ద కాలంపాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ సినిమాల్లో తన అసమాన ప్రతిభా పాటవాలతో నటించి, కుర్రకారును ఉర్రూతలూగించిన రమ్యకృష్ణ టీనేజిలోకి అడుగుపెడుతూనే సినిమా రంగంలోకీ అడుగుపెట్టింది. ఎనిమిదో తరగతి చదువుతూనే తమిళంలో ‘వెల్లై మనసు’ లో ప్రధాన ప్రాత పోషించింది. తెలుగులో ఆమె నటించిన తొలి చిత్రం ‘బాల మిత్రులు’ 1987లో విడుదల అయింది. కె. రాఘంద్రేరావు దర్శకత్వంలో రమ్యకృష్ణ ఒక వెలుగు వెలిగింది. దాదాపుగా తెలుగుహీరోలు అందరితోనూ ఆమెకు విజయవంతమైన సినిమాలున్నాయి.

నరసింహ చిత్రంలో రజనీకాంత్‌తో పోటీపడి మరీ చేసిన 'నీలాంబరి' పాత్రను ప్రేక్షకులు ఇప్పుటికీ  మరిచిపోలేరు. ఈ సినిమా దక్షిణ భారతదేశంలో కాకుండా, సింగపూర్, లండన్, ఫ్రాన్స్, జపాన్ లాంటి అనేక దేశాల్లో విడుదలై అంతర్జాతీయంగా కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. స్వతహాగా మంచి నృత్యకారిణి అయిన రమ్యకృష్ణ.. ఇటీవలే న్యూయార్క్, డల్లాస్ వేదికలపై నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీని పెళ్లి చేసుకున్న రమ్యకృష్ణకు ఇద్దరు కుమారులు. వారిలో రిత్విక్ పేరుతో ఒక నిర్మాణ సంస్థ ప్రారంభించింది.

ఆమె ఇప్పుడు సినీ ప్రముఖులను ఇంటర్వ్యూ చేసేందుకు ‘జరా మస్తీ జరా ధూమ్’ అనే టీవీ షో ప్రారంభించింది. త్వరలో మరిన్ని రకరకాల టీవీ షోలు చేయలన్ని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకానొక సమయంలో సినిమాలో రమ్యకృష్ణ ఉంటే చాలు.. అది ఫ్లాపే అన్న టాక్ వచ్చినా, 'అల్లుడుగారు' సినిమాతో ఆ విమర్శలన్నింటినీ తిప్పికొట్టింది. తర్వాత నుంచి ఆమె నటించిన చిత్రాలన్నీ సూపర్హిట్లే. ఇప్పుడు చేస్తున్న, చేయబోతున్న టీవీ షోలు కూడా విజయవంతం కావాలని ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆశిద్దాం..